🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శతరుద్రీయము-16*
(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*ప్రథమానువాకము-14 వ ఋక్కు*
*నమకనామాని : ఓం అన్నానాంపతయే నమః*
ఋషి : భగవంతుడు
దేవత. : భగవంతుడు
ఛందస్సు: అనుష్టుప్పు
*నమస్తే అస్వాయుధాయానాతతాయ ధృష్ణవే!*
*ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే!!*
ఉపద్రవము తలపెట్టని రుద్రా నీకు నా నమస్కారము♪. నీ చేతి యందలి సమర్థమగు బాణములకూ, ధనుస్సునకూ, నీ బాహువులకూ నా నమస్కారము♪.
*వివరణ :*
*అనాతతాయ : హానిచేయ తలపెట్టనటువంటిది.*
రుద్రుని చేతియందలి ఆయుధమును "హేతి” గా సంబోధించారు ఇంతకు ముందర♪. దానిని మనం “ఆశ” అని అన్వయించుకున్నాము♪. ఈ ప్రపంచంలో చాలామంది భగవంతుని పేరు తలచేవాడిని పిచ్చివాడని అంచనావేస్తారు♪. సన్యాసులను ఎందుకూ పనికిరాని వారుగా తలుస్తారు♪.
కానీ, ఎంతమంది నిజంగా అర్థం చేసుకుంటారు....
“భక్తులు అంటే కోటానుకోట్ల జన్మల అనుభవాల ద్వారా జీవితాన్ని కాచి వడపోసి చివరకు కావలసినది ఏదో దానిని అర్థం చేసుకున్నవారనీ, వారి జన్మలు ఆఖరుజన్మలనీ, శాశ్వతమైన పదమును పొందిన ఆ భక్తాగ్రేసరులు మనము తిరిగే ఈ పిచ్చి ప్రపంచంలోకి రారనీ”..........
“నా కృష్ణునికి ఇదే ఇచ్ఛ అయితే అలాగే కానియ్యి” అంటూ మీరాబాయి విషం త్రాగింది♪. కృష్ణునిపై ఆమెకుగల అపారమైన నమ్మకంవల్ల విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది♪.
ప్రహ్లాదుడు తండ్రి ద్వారా పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటారు♪. ఆ భక్తాగ్రేసరునికి శ్రీహరి పైనున్న కాంక్ష ఈ కష్టాలను గుర్తించకుండా చేసింది♪.
భగవంతునిపై కోపం తెచ్చుకొనేవాళ్ళు కూడా వుంటారు♪. నాకు తెలిసిన ఒక కుటుంబంలో వెంకటేశ్వరునికి పూజ చేయరు♪. ఎందుకో అని అడిగితే వాళ్లు తిరుపతికి వెళ్లినప్పుడు రోడ్డుప్రమాదంలో వాళ్ల తండ్రిగారు పోయారట, అందుకని వీళ్లు వెంకటేశ్వరుని పూజించడం మానేశారు♪. సరే వారినమ్మకం వారిది♪.
ఇలాగే, చాలా మంది భగవంతునిపై అపోహలు పెట్టుకుంటూంటారు♪. ఇటువంటి వారికోసమే ఇక్కడ *“అనాతతాయ”* అంటూ భగవంతుని పైన కాంక్ష హానిచేయనటువంటిది అని చెప్పబడింది♪.
*అనన్యాశ్చింతయంతో మాం*
*యేజనాః పర్యుపాసతే!*
*తేషాం నిత్యాభియుక్తానాం*
*యోగక్షేమం వహామ్యహమ్ ||*
(భగవద్గీత, 9-22)
భగవద్గీతలో అర్జునునికి ఇవ్వబడ్డ హామీ మనందరికీ వర్తిస్తుంది♪. భగవంతుని ద్వేషించి నాశనమైన చరిత్రలు ఎన్నెన్నో చూశాముగానీ, ఆ స్వామిని ఆశించి ఆశాభంగం పొందిన వారెవరూ లేరు♪.
భగవద్గీతలో “నా భక్తుడు యెన్నటికీ నాశనం పొందడు (న మే భక్తః ప్రణశ్యతి)” అంటూ చెప్పారు♪. ఈ విషయాన్ని నిజంచేసిన గాథలు ఎన్నెన్నో♪. మన దురదృష్టం ఏమిటంటే భగవంతునితోటి బేరసారాలు నడుపుతాము♪.
వెలుతురు ఎక్కడవుంటుందో చీకటి అక్కడే వుంది, సుఖం ఎప్పుడైతే అనుభవిస్తున్నామో దానిని వెంబడించే దుఃఖమూ వుంటుంది♪. ఇవన్నీ ద్వంద్వాలు అనబడతాయి♪.
భగవంతుని దగ్గరకు వెళ్లి అన్యమైనది కోరుకుంటే కోరుకున్నది దొరుకుతుంది కానీ, ద్వంద్వ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది♪. అనన్యమైన కోరిక వున్నవానికి అది యెటువంటి హానీ కలుగచేయదు♪. కాబట్టి, అటువంటి దానికి ఇక్కడ సాధకుడు శిరస్సువంచి నమస్కరిస్తున్నాడు♪.
*బాహుభ్యాం నమః :*
భగవంతుని చూడాలన్న ఆశ ఎవరికి వుండదు? అందరికీ వుంటుంది♪. కానీ ఆయన దర్శనం చేసుకోవాలనో లేదా ఆయనను చేరుకోవాలనో ఖచ్చితమైన లక్ష్యంతోటి ఎవరో కోటిమందిలో ఒక్కరు ప్రయత్నం చేస్తారు♪. వారిలోగూడా ఎవరో ఒక్కరు ఆయనను యధార్థం (తత్త్వం) గా తెలుసుకుంటారు♪. దానికి కారణం తెలుసుకోవడం అవసరం♪.
విశ్వామిత్రుడు నాలుగువేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు, చివరకు మేనక ఎదురుగా వచ్చి నాట్యంచెయ్యగానే మైమరచి తపస్సువదిలి సంసారంలో పడ్డాడు♪. అంటే ఆయన ఆకర్షణకు లోబడినట్లుగా మనకు పురాణం చెబుతుంది♪.
అదే శివపురాణం చూడండి. జగన్మాత ఆ శివుడిని పెళ్ళి చేసుకుంటానని భీకరమైన ప్రతిజ్ఞ చేస్తుంది♪. తపస్సు చేస్తూ శరీరాన్ని కృశింపజేస్తూ వుంటే ఒక అతిలోకసుందరుడు ప్రత్యక్షమై 'ఆ శివునివద్ద ఏముంది, భూతాల మధ్య వుంటాడు, పుర్రెలో తింటాడు, స్మశానంలో వుంటాడు♪. అతనిని చేసుకుని ఏం సుఖపడతావు ....నన్ను చేసుకో” అంటూ అడగగానే పార్వతి అతనితో... “నా శివుని గురించి ఇలా నువ్వు మాట్లాడడం నీకు తగనటువంటిది♪. ఆయన గురించి నేను చేసే ఈ తపస్సు నేను మానను, నిన్ను చేసుకోవటం జరగని పని” అంటూ అసహ్యంగా తిరస్కరిస్తుంది♪. తర్వాత తన తపస్సును పరీక్షించేందుకై సదాశివుడే ఆ రూపంలో వచ్చాడని తెలిసి సంతోషిస్తుంది♪.
పై రెండు కథలలోనూ ఒకటే లక్ష్యం కనిపిస్తుంది♪. ఇద్దరూ సాధకులే. కాకపోతే ఒకరిది అపరిపక్వ స్థితి, వేరొకరిది పరిపక్వస్థితి♪.
ఇంతకీ ఈ కథలకూ శివుని బాహువు లకూ ఏమిటి సంబంధం?
విశ్వామిత్రుడు ఆకర్షణకు లొంగిపోయాడనీ, పార్వతి అమ్మవారు ఆకర్షణకు లొంగలేదనీ అర్థం అవుతుంది♪. ఆ ఆకర్షణను ప్రయోగించేది “ఆవరణ, విక్షేప” శక్తులనబడే బాహువులు♪.
మరింత వివరంగా పరిశీలిద్దాము.
*సశేషం.....*
❀┉┅━❀🛕❀┉┅━❀
*సేకరణ:* *శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి