25, మార్చి 2024, సోమవారం

బంధవిముక్తి మోక్షమార్గం*

 *బంధవిముక్తి మోక్షమార్గం*

                   ➖➖➖✍️



```

అన్ని బంధాల నుంచీ మనిషిని విముక్తం చేసేదే ముక్తి. దీన్నే‘మోక్షం’ అంటాం. అది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతోంది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి మతం వారికి సమ్మతం. వ్యక్తిగత వాదాలే మతాలుగా పరిణమించి, అనేకంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ ముక్తిని సాధించడానికి తోడ్పడేవే.


ఒక గమ్యస్థానానికి వెళ్లాలనుకొన్నప్పుడు మనిషి బయలుదేరే చోటు నుంచి ఒకే దారి ఉండదు. అన్ని దిక్కుల నుంచీ దారులెన్నో ఉంటాయి. ఎటు నుంచి వెళ్లినా చేరాల్సిన చోటు ఒకటే.

ఏ దారిలో వెళ్లినా గమ్యం చేరేవరకు విశ్రమించడు. జీవన స్వభావం ఇదే.


ఇదే విషయాన్ని మోక్షానికీ అన్వయిస్తూ ‘శివ మహిమ్న స్తోత్రం’ ఇలా ప్రబోధించింది:```


*“పరమేశ్వరా! నిన్ను చేరడానికి మనుషులు ఎన్నో మార్గాలను ఏర్పరచుకొన్నారు. కొందరు వేదమార్గంలో నిన్ను చేరుకుంటూ ఉండగా మరికొందరు సాంఖ్య మార్గంలో,  ఇంకొందరు శైవ మార్గంలో, కొందరు యోగ మార్గంలో, కొందరు వైష్ణవ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు.  ఎవరికి వారు తాము నమ్మిన మార్గాలే గొప్పవని వాదిస్తారు. ‘లోకో భిన్న రుచిః’ అన్నారు కదా…!*```


లౌకిక బంధాలనన్నింటినీ పరిత్యజించి పరమేశ్వరుడిలో లీనం కావడమే మోక్షం. అది నాలుగు విధాలని ‘శివానంద లహరి’లో శంకర భగవత్పాదులు స్పష్టం చేశారు.```


*మొదటిది సారూప్య ముక్తి.*```

భక్తుడు శివుణ్ని అర్చిస్తున్నప్పుడు తానూ శివుడిలా రూపం ధరించాలని కోరుకోవడమే ఈ ప్రక్రియలోని పరమార్థం. స్తోత్ర పఠనంలో శివుడి రూపాన్ని స్మరించడం, ఆ రూపాన్నే ఆరాధించడం అంటే శివుడితో సమానమైన రూపాన్ని కోరుకోవడమే! అందువల్ల దీన్ని ‘సారూప్య ముక్తి’గా భావిస్తాం.```


*రెండోది సామీప్య ముక్తి.*```

శివుడి కథలు ప్రవచించేవారికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం, వారు చేసే ఆరాధనల్లో పాలుపంచుకోవడం, వారితోనే స్నేహం చేస్తూ కలిసి మెలిసి తిరగడం వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆనందదాయకాలైన అంశాలే. కనుక దీన్ని ‘సామీప్య ముక్తి’ అని వ్యవహరిస్తాం.```


*మూడవది సాలోక్య ముక్తి.*```

అంటే శివుడు ఉండే లోకంలోనే ఉండాలనుకోవడం! శివుడు లేని చోటు ఏదైనా ఉందా అంటే ‘లేనే లేదు’ అని బదులిస్తుంది ప్రాచీన సాహిత్యం. చరాచరాలతో కూడిన మానవ లోకంలో ప్రతీ అణువులో శివుడున్నాడంటారు. మానవ లోకంలోని మనిషి శివుడున్నచోటే ఉన్నాడని దీని అర్థం. ఈ ప్రపంచం అంతా శివుడి శరీరమే అని వేదాలు చెబుతున్నాయి. ‘శివుడి తనువే ఈ జగత్తు’ అనే భావన ఇందులో కనిపిస్తుంది. శివుడున్న లోకంలోనే తానూ ఉన్నాననే భావనను భక్తుడికి కలిగించడమే “సాలోక్య ముక్తి”.```


*ఇక నాల్గవది “సాయుజ్య ముక్తి”.* ```‘సాయుజ్యం’ అంటే “కలిసి ఉండటం”. చరాచరాలన్నీ శివమయాలే అన్నప్పుడు అందులో చరాలు (చైతన్యం కలిగిన ప్రాణులు)గా మనుషులూ ఉన్నట్లే. అందరూ శివస్వరూపాలే ఐనప్పుడు ఆయనతో వారు నిరంతరం కలిసి ఉన్నట్లే అవుతుంది. దీన్నే ‘మనిషికి శివుడితో సాయుజ్య ముక్తి లభించడం’ అంటాము.


ఇలా ప్రతి మనిషికీ నాలుగు విధాలైన మోక్షాలు అందుబాటులో ఉంటాయి.


’ముక్తి’ఎవరికైనా సాధ్యమే! శివుడి కరుణకు ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. అందుకే ఆయన తనను అర్చించిన సాలీడు,పాము,ఏనుగును తనలో లీనం చేసుకొన్నాడు. 

శ్రీ(సాలీడు), కాళ(పాము), హస్తి (ఏనుగు) నామాలతో ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అయ్యాడని మనకు తెలుసు.


కాలు కదపనివాడికి ఏదీ లభించదు. కదిలి ముందుకు సాగేవాడికి ప్రపంచమంతా ఓ కుగ్రామంలా కనపడుతుంది. “మోక్షం” విషయంలోనూ ఇదే సూత్రాన్ని అన్వయించుకోవాలి.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: