31. " మహాదర్శనము "--ముప్పై ఒకటవ భాగము--మింగుడు పడని ముద్ద
31. ముప్పై ఒకటవ భాగము-- మింగుడు పడని ముద్ద
ఆచార్య దేవరాతుడు ప్రాతః కర్మలన్నిటినీ ముగించి , వచ్చి కూర్చున్నాడు . కించిత్ ఉపాహారమును స్వీకరించు వేళ. కానీ అతనికి ఈ దినము ఉపాహారము సహించదు .ఆకలి దప్పులు పుట్టవు . ఏదో చింతలో ఉన్నాడు . మనస్సు యొక్క క్లేశమును శరీరము కూడా వహించినట్లుంది . యజమానుడు రోగ గ్రస్తుడైనపుడు ఇంటిలోని పశువులలో కూడా కనిపించు దౌర్మనస్యము వలె అంగాంగములూ తేజోహీనమైనవి . అధ్యయనము కోసము వచ్చి నిలచిన శిష్యులకు అధ్యయనము చేయించమని వృద్ధ శిష్యుడొకనికి చెప్పి , తాను చింతాక్రాంతుడై కూర్చున్నాడు .
ఆలంబినికి కూడా ఆచార్యునికి వచ్చిన జ్వరమేమిటో తెలుసు . ఆమెకు కూడా వంట చేయునపుడు పెద్దగా ఏడవవలె ననిపిస్తున్నది . అయితే అది ఆమెకు అలవాటులేని పని . ఆడపిల్ల అని , తన తల్లి వలె తనను నెత్తికెక్కించుకోకున్ననూ , భర్త దగ్గర ఇతరులకు అధికారము లేని , అనన్యభాజమైన తన స్థానము ఒకటుందన్న నమ్మకము పొందిన మనసు ఇంటి పనులలో ఆమెకు స్వాతంత్ర్యమును ఇచ్చినది . భర్త తన మాట ప్రకారము నడవకున్ననూ , తన మాటను కొట్టివేయడు అన్న ధైర్యము ఆమెకు తాను చేయు పనులలో ఉత్సాహము శ్రద్ధ లను ఇచ్చింది . " తాను చేయుచున్న పనులు , ఏవికూడా ఇతరుల ఆక్షేపణలకు గురియగుట జరగదు , తృప్తిని తెచ్చేవి" అను నమ్మిక కావలసినంత సంతోషాన్ని తెచ్చింది . చేసే పనిలో ఏదైనా తప్పు జరిగితే , దానిని పెద్దదిగా చేసి తనను ఒక అనామకురాలిగా చేయక, ’ కాళ్ళు నడుస్తున్నపుడు ఎప్పుడైనా ఒక అడుగు తప్పదా ? ’ అను విశాలమైన మనసుతో చూచు గొప్పవారు . తనను దేవతయని గౌరవిస్తూ తన ప్రసాదము కోసము వేచియుండే గొప్పవారు . ఆమె కన్నీరెందుకు కార్చ వలెను ?
నిన్నటి ప్రసంగము మొగుడూ పెళ్ళాలిద్దరికీ మింగుడు పడని ముద్ద అయినది . గురుదేవులు వైశంపాయనుల గురుకులములోని శిష్యమండలము లన్నిటా , వీడు లేకున్న ఇంకేమీ లేదు అనిపించుకున్న కొడుకు ఇప్పుడు కులపతుల కోపమునకు పాత్రుడై ఇంటికి వచ్చేసినాడు . అధ్యయనము చేయునపుడు శిష్యుల దౌర్బల్యము వల్లనో , అనవధానము వల్లనో అక్కడక్కడా చెడిపోవుట కద్దు . అయినా అది దోషము . వేదము నకు అపరాధము అగుట వలన అది బ్రహ్మ హత్యతో సమానము . దానిని దినదినమూ తగ్గించుట కోసము ఆచార్యుడైన వాడు ప్రత్యేకముగా కొన్ని భాగములను పారాయణ చేయును . ఏ దినమైనా అతని దేహ , మనోస్థితులవల్ల అతనికి ఆ కార్యమును చేయుట సాధ్యము కాకపోతే అతని కోసము వృద్ధ శిష్యుడొకడు చేయును . అప్పుడపుడు ఆ కార్యమును చేయుట యాజ్ఞవల్క్యుని వంతు అయ్యేది . యాజ్ఞవల్క్యుడు గురు దేవులకు ఏదో అస్వస్థత ఉండుట చూచి వారి అనుమతి అయితే , ఆ ప్రాయశ్చిత్తాధ్యయనమును తాను చేయగలనని తెలుపుకున్నాడు . నీరు ఉన్నట్టుండియే ఉడుకునట్లు గురుదేవులు రెచ్చి , " ఇతరులకన్నా బాగా అధ్యయనము చేసియున్నావన్న అహంకారము నీకు వచ్చింది . ఈ అహంకారము విద్యావంతునికి తగినది కాదు . ఈ అహంకారము వలన ఇతరులకు అవమానము చేసినట్లయింది . మా విద్యను మాకు ఇచ్చివేసి వెళ్ళూ ! " అని ఎగురుటయా ?
యాజ్ఞవల్క్యుడు సదా వినయముతో ఉండువాడు . కానీ ఆకస్మికమైన ఈ కోపమువలన అతనికి కూడా విరసమైనది . మనసు విరిగి ఆక్రోశమైనది . కంట నీరు వచ్చింది . అయినా కూడా సభ్యతను వదలక , ఆ ఆక్రోశములో కూడా , " నేను తప్పు చేసిన క్షమించ వలెను " అని నమస్కారము చేసినాడు .
ఎప్పటివలె అయితే , ఆ నమస్కారముతో కులపతులు శాంతులయ్యేవారు . కానీ ఆ దినము అదేమిటో , మండే మంటకు ఉప్పు తగిలినట్లాయెను . ఇంకా చెలరేగిపోయి , " అపచారానికి వినయపు ముసుగు కప్పవలెనని యున్నావా ? మేము చెప్పినట్లు చేసి వెళ్ళిపో . నువ్వు ఇకమీదట మా ఆశ్రమములో ఉండవద్దు . నువ్వు మా ఆశ్రమములో ఒక్క ఘడియ కూడా ఉండకూడదు . మా విద్యను మాకు ఇచ్చి వెళ్ళు " అని అతడు గద్దించినాడు .
అతడు అలాగు గదరుకోవడము చూచి కులపతి యొక్క పత్ని కదంబిని వచ్చినది . భర్త ఎదురుగా కన్నీరు కారుస్తున్ననూ , నాగుపాము వలె బుసకొట్టుతూ , కళ్ళు వెడల్పు చేసుకొని , క్రోధ తామ్రాక్షుడై నిలచిన శిష్యుడిని చూచి రివ్వుమని వచ్చి వాడిని తన వెనుకకు లాగుతూ , భర్తకు ఎదురైంది . ఆమెకు దిగులు పుట్టింది . గురుశిష్యులిద్దరూ తపస్వులు . ఇద్దరికీ కోపము మితిమీరి , శాప ప్రతి శాపముల పర్యవసానము అగునో ఏమో అని బెదరి ఆమె వెంటనే భర్తకు నమస్కారము చేసి , " ఇక్కడికే ఈ కోపము ఉపసంహరించవలెను . యాజ్ఞవల్క్యుని పిలుచుకొని వెళ్ళుటకు అనుమతి కావలెను ." అని చేతులు జోడించినది . గురుదేవుడు కోపమునంతటినీ ఉపశమించుకుంటూ , కోపముతో మండునట్లున్న కళ్ళను అటు తిప్పుకొని , సరేనని అనుమతినిచ్చినాడు . ఆమె వాడిని లాగుకొని వంట ఇంటికి వెళ్ళినది . ఆచార్యుడు లేచి స్నానమునకు వెళ్ళినాడు . మాధ్యాహ్నికములన్నీ ముగిసి కులపతి వైశ్వదేవమును అయిన తర్వాత ఆమె యాజ్ఞవల్క్యునికి భోజనము పెట్టినది . ఇష్టము లేకున్ననూ , ఆమె బలవంతానికి ఇంత తిన్నాననిపించుకుని ఎవరికీ చెప్పకుండా , దొంగతనము చేసినవాడి వలె , దుర్దానమును పట్టినవాడివలె ఆశ్రమమునుండీ బయలుదేరి వచ్చినాడు .
భార్యాభర్త లిద్దరూ కొడుకు ద్వారానే ఈ కథనంతటినీ విన్నారు . అకారణముగా కోపము , అదికూడా తమ కొడుకుపై కోపము చేసుకున్నారు గదా ఆ కులపతులు ? అని భర్తకు అభిమానము ముంచుకొచ్చినది . భార్యకు , తన కొడుకు అప్పుడూ , ఇప్పుడూ వినయముతోనే ఉన్నాడుకదా అని ఒక అంతస్సంతోషము . బ్రహ్మ హత్యా నివారణకోసము ప్రాయశ్చిత్తాధ్యయనమును తాను చేసెదనని చెప్పుటలో తప్పేమిటని భర్త విచికిత్స చేస్తే , " ఎంతైనా కదంబినిది తల్లి హృదయము . అప్పుడు , ఏమౌతుందో అని ఆమె అడ్డము రాకుండా ఉండి ఉంటే నిజము గానే ఏమేమి జరిగేదో ? " అని భార్యకు భయమై వణుకు వస్తుంది . అంతు , ఇద్దరికీ దౌర్మనస్యము . ఏమి చేయుటకూ మనసు ఒప్పదు . భర్తకు అభ్యాసమైన అధ్యాపనమూ వద్దనిపిస్తే , భార్యమాత్రము , అభ్యాసమును వదలలేక వంట చేస్తున్నది . ఇలాగ ఇద్దరూ తమ తమ బాధ , చెరువు కట్టను తెంచుకొని పరవళ్ళు తొక్కుటకు సిద్ధమైన నీటివలె పెరిగి కాల్చుతుండగా నిద్రాహారాలు లేక వ్యథ ననుభవించు వారి వలె మూగబోయి , స్తబ్ధులై తమ తమ స్థానములలో కూర్చున్నపుడు , " ఆచార్యా ! " అన్న గొంతు ఉరుము ఉరిమినట్లు వినిపించినది . ఆచార్యుడు ఆ గొంతు వినగానే కొత్తగా ఏదో దారి దొరికినట్లై , నీటిలో మునగ బోయేవాడికి మునగ బెండు ఆసరా దొరికి మరలా ఆయుస్సు లభించినట్లై , కళ్ళు చెమర్చినాయి . " రావలెను , దయ చేయవలెను " అని లేచి ఆ వచ్చినవారికి ఎదురు వెళ్ళి పిలుచుకు వచ్చినాడు . వారికి కాళ్ళు చేతులకు నీరిచ్చి పిలుచుకొని వెళ్ళి నడిమింట్లో వేత్రాసనము పైన కూర్చోబెట్టినాడు .
ఇటు ఆలంబినికి కూడా ఆ ఉరుము వినిపించినది . ఇంత గట్టిగా అరచువారెవరు ? అనిపించినది . మనసు ఎప్పటివలె తేలికగా ఉంటే , గొంతును గుర్తించ గలిగేది . కానీ అటుల కాలేదు . ఏమైనా సరే యని , మీగడ పెరుగును గిన్నెలో వేసి, దానికి చక్కెర కలిపి తీసుకొని వచ్చింది .
వచ్చినవారు బుడిలులు. " ఏమిటి సంగతి ? " అని అడిగినారు . ఆచార్యుడు ’ కొడుకు సంగతి చెప్పవలెను . ఎక్కడనుండీ ఆరంభించేది ? ’ అన్న యోచనలో ఉండగా ఆలంబిని చెక్క పళ్ళెములో , చెక్క గిన్నెలో చక్కెర కలిపిన పెరుగును తెస్తూ వాకిట్లో కనిపించినది . బుడిలులు నవ్వుచూ , " ఏమి ఆలంబమ్మా ? ఏమిటి సంగతి ? " అని అడిగినారు . ఆమెకు , అలాగయిన , వీరికి కూడా తెలిసిందా ? అనిపించి కళ్ళలో నీరు నిండింది . కానీ అల్పాహారము నిచ్చునపుడు కన్నీరు పెట్టరాదని బహుకష్టముతో దానిని నిగ్రహించుకొని , " ఏదో ఒకటి ఉండే ఉంటుంది , మొదట అగ్ని దేవుడు శాంతము కానీ , ఆ మీదట మాటలు " అని పళ్ళెమును ముందుంచింది . అయినా గొంతులో జీర లేకుండా పోలేదు .
బుడిలులు , ’ అటులనా ? సరే సరే ’ అని మారు మాట్లాడక , మళ్ళీ అడిగించు కోకుండా పెరుగు తీసుకున్నారు . దానిని సేవించి , " ఈ పెరుగు తోడు పెట్టుట కూడా ఒక కళ అయి ఉండాలి . అది నీకు చాలా బాగా అలవడిందమ్మా , ఇదేమిటి , పాలరాయా లేక బిగిసిపోయిన పెరుగా ? " అని దానిని ఆస్వాదించి , గిన్నెను పక్కకు పెట్టి , " ఎక్కడ యాజ్ఞవల్క్యుడు ? " అన్నారు .
దంపతులకు , " బుడిలులకు అంతా తెలిసినట్లుంది " అనిపించినది . ఒకరి ముఖము నొకరు చూసుకున్నారు . ఒక ఘడియ తాళి , " వాడు పెరట్లో తోటదగ్గర ఉండవలెను , వెళ్ళి పిలుచుకు వస్తాను " అని ఆలంబిని వెళ్ళింది . బుడిలులు ఆమెకు చేత్తో నిలవమని సంజ్ఞ చేసి , " వద్దు వద్దు , వాడే వస్తాడు . ఇంకొంచము సేపైన తర్వాత వాడే రానీ . నువ్విక్కడే ఉండి నేను చెప్పునది విను " అన్నారు . ఆలంబిని లోపలికి బయలుదేరినది అక్కడే నిలిచింది . బుడిలులు ఆరంభించినారు :
" ఆచార్యా , మీరు కొడుకు విషయము ఆలోచిస్తున్నారు . నిన్నటి సంగతి మీ ఇద్దరి మనసులలో నిండింది . ఆ విషయమై ఆలోచనలను మానండి . ఇదంతా దేవతల ఆట. అటువైపు వైశంపాయనుడు , ఇటువైపు యాజ్ఞవల్క్యుడు , ఇద్దరినీ పట్టి ఆడించినారు దేవతలు . అది మీకు చెప్పాలనే నేను వచ్చినది . "
" సరే , తమకెలా తెలిసింది ? "
" అయ్యా , యాజ్ఞవల్క్యుని పంపించుటకైతే పంపించినారు గానీ ఇప్పుడు ఆ వైశంపాయనుల గోడు ఎవరూ తీర్చలేనిది . నిన్న సరిగ్గా అర్ధరాత్రి జాములో వచ్చి వాకిలి తలుపు తట్టినారు . ఈ సమయములో వచ్చువారు ఎవరు అని వచ్చి చూస్తే వైశంపాయనులు వస్తూనే పాదములు ముట్టి నమస్కరించి ’ ఒక మూర్ఖపు పని జరిగిపోయింది . దాని వలన ముందు ముందు ఏమీ అనర్థము సంభవించకుండా చూచి కాపాడు భారము మీదే " అని కన్నీరు పెట్టుకున్నారు . " ఏమిటో చెప్పండి , సరిదిద్దుకుందాం ’ అని నేను అనునయించిన కొద్దీ అతడి దుఃఖము ఎక్కువయింది . చివరకు వారు చెప్పినదేమంటే ,
" పొద్దుటినుండీ అతడికి ఏదో అవివేకము జరుగునని తెలుసు . దానివలన మనసు అలజడి అయింది . అయినా అభ్యాస బలము వలన అధ్యాపనము చేసినారు . చివరకు అందరూ వెళ్ళిపోయిన తరువాత యాజ్ఞవల్క్యుడు అక్కడే నిలచి , ’ ఈ దినము మీకు దేహస్థితి సరిగా లేనట్లుంది . అనుమతి అయితే నేను ప్రాయశ్చిత్తాధ్యయనము చేస్తాను ’ అన్నాడట. అదే కారణముగా అతడు రేగిపోయినాడు . అదేమో , చిలికి చిలికి భూమ్యాకాశములను ఏకము చేయునట్లయిందట . దైవ వశాత్తూ కదంబిని మాత అడ్డురాకుండిన ఏమయ్యెడిదో ? అదే కారణము వల్లనే యాజ్ఞవల్క్యుని పంపించినది . అతడిదేమీ తప్పులేదు . తప్పుంటే , అకారణముగా రేగిపోయిన నాది . అతనికి ఈ నిర్గమనము వలన శ్రేయస్సే అగునట్లు నా తపస్సునంతటినీ ధారపోసినాను . కాబట్టి ఆచార్య దంపతులు కొడుకుపై ఏమాత్రమూ కోపము చేసుకోరాదు , గద్దించనూ వద్దు అని తమరు వెళ్ళి వారికి సాంత్వన నిచ్చి రావలెను " అని ఈ కార్యమును నాకు అప్పజెప్పి , అదే అర్ధరాత్రిలోనే అతడు వెళ్ళిపోయినాడు . మీకు ఇది చెప్పుటకు నేను వచ్చినాను "
" ఎట్టి కారణము చేతనైనా సరే , బుడిలులు మా ఇంటికి వచ్చినారు . అదే మా భాగ్యము . సరే , మరి అతడే వచ్చి మాకు ఎందుకు చెప్పియుండ కూడదు ? "
" దానిలో ఏదో రహస్యమున్నదట . యాజ్ఞవల్క్యుని ఎదురుగా ఈ విషయమును మీకు చెప్పకూడదు అని అతడు రాలేదట ! వటువు ఎదురుగా చెప్పకూడదు అనుటలో లౌకికమునకన్నా , అలౌకికమే ఎక్కువ అని నాకు అనిపించి , ’ పోనివ్వండి , ఆ దంపతులు ఇది తెలిసిన తరువాత వ్యథపడుట మానెదరు . అటులనే మీరు కూడా నామీద భారము వేసి మీ దుఃఖమును వదలండి . ఏదైతే తర్కమునకు అందకుండా జరుగుటకు కారణమగునో దానిని దైవికమనవలెను. కాబట్టి అది దైవ చిత్తముచేత జరిగినది . ఇది కూడా దేవకార్యార్థమే అయి ఉండవలెను ’ అన్నాను . గురుదేవులు నవ్వుచూ , నాకూ అటులే యనిపించుతున్నది . తమరు ఇంత చెప్పిన తరువాత దుఃఖము నన్ను వీడినది . ’ అంటూ , ఏడుస్తూ వచ్చినవారు నవ్వుతూ వెళ్ళినారు "
ఆ దంపతులకు మోయలేని భారమేదో దింపినట్లై వారికి తెలీకుండానే , వారి ప్రయత్నము లేకుండానే ఒక నిట్టూర్పు వచ్చినది . తేలికైన మనసుతో వారు బుడిలులకు నమస్కారము చేసి తమకు అయిన ఉపకారమును గురించి మాట్లాడినారు .
బుడిలులు నేర్పుగా మాట మార్చుతూ , " నేను వచ్చి ఇంత సేపైనది . యాజ్ఞవల్క్యుడెక్కడ ? ఇంకా రాలేదే ? " అన్నారు . యాజ్ఞవల్క్యుడు , ’ ఇగో , వచ్చినా తాతా ! " అని వచ్చి నమస్కరించినాడు .
Janardhana Sharma
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి