13, అక్టోబర్ 2024, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్య చరితము40

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము40 వ భాగము*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*గంధర్వోపాసకులు:*


గంధర్వోపాసకులు శ్రీ శంకరా చార్యులను తమ మతములో కలుపుకొన నెంచి, సమీపించి, 'యతీశ్వరా! విశ్వావసుడనే గంధర్వుడు మాకు ప్రభువై దైవముగా నున్నాడు. ఆతడు గంధర్వులకు దేవుడు. అట్టి వానిని మేము సదా భక్తిశ్రద్ధలతోపూజించు వారలము.ఆదేవుని అనుగ్రహంతో మేము  అందరము గానమందలి నాదబిందు కళాత్మకమైన విజ్ఞానం తో ఆరితేరిన విద్వాంసులమై యున్నా ము. దీనివలన మేమం దరము కృతార్థులమై ముక్తిని బడయుచుంటిమి. తామును మావలెనే గాంధర్వ విద్య యందు కళాపూర్ణులై ముక్తిని పొందుడు’ అని కోరిరి. 


అంతట శ్రీ శంకరాచార్యులు, 'భక్తులారా! మీ పలుకులు వేదములకు వ్యతిరేకముగ నున్నవి. ఇదిమీకు న్యాయమేనా?పరమాత్మ శబ్దాదులకు అతీతమై ప్రకాశించుచున్నదని వేదమున తెలుపబడినది. మీ గాంధర్వ విద్య శబ్దముతో గూడియున్నది. అందు వలన ఇది పరబ్రహ్మ విద్య కానేరదు. పరబ్రహ్మ ఎట్టివాడుగ నున్నాడో వినుడు. ఆతడు నిత్యుడు, అవ్యయుడు, ఆది మధ్యాంతములు లేని వాడు, నిశ్చయుడు, శబ్ద స్పర్శ రూప రస గంధ రహితుడు, మహత్తత్త్వము కన్నా పరమైనవాడు. అట్టి పరమాత్మను తెలిసి కొనినవాడే ముక్తుడు కాగలడు. కావున మీరందరు నాద బిందు కళాతీత మగు పరాత్పరు ని ఉపాసించుడు. అందు వలన తప్పక ముక్తి లభించును' అని ఉపదేశించగా గంధర్వ ఉపాసకులందరు శ్రీ శంకరాచార్యులను ఆశ్ర యించి శిష్యులయ్యారు. అద్వైత జ్ఞానమును ఆర్జించుకొని నిత్యానంద మును పొందిరి. అటు తరువాత భేతాళోపాస కులు చితాభస్మము (స్మశాన భస్మము) ను ధరించి శ్రీశంకరపాదులను సమీపించి నమస్కారములు చేసిరి.


*భేతాళ మతస్థులు:*


శ్రీశంకరపాదుల యెదుట తమ మతమును ప్రతిష్ఠింప జేయ నెంచి భేతాళ మతస్థులు, 'శ్రీ ఆచార్య వర్యా! మేమం దరము భేతాళుడు మొదలైన భూతములను ఉపాసించుచు లోకము లను మా యధీనమందు ఉంచుకొనుటకు తగిన సమర్ధుల మైతిమి. కావున తాము కూడ మావలెనే ఉపాసించిన లోకములు మీ యధీన మందుండ గలవు' అని తెలియజేసిరి.


శ్రీ శంకరులది విని, ‘భక్తు లారా! మీరందరు బ్రాహ్మణులు గదా! మీరిట్టి నీచమైన ఉపాసనలు చేయకూడదని శాస్త్రములు వచించుచున్నవి. సత్కర్మలకట్టి భూతములు ఆటంక ములు కలుగ జేయుచు న్నవి. సత్కర్మాచరణకు ముందుగా *'అపసర్పన్తు యే భూతా యే భూతా భూమి సంస్థితాః।*

*తేభూతా విఘ్నకర్తారస్తే నశ్యన్తు శివాజ్ఞయా*' (భూమి మీద ఏ భూతములు గలవో అవన్నియు దూరముగా నుండు గాక, సత్కర్మలు చేయుటకు ఏభూతము లు విఘ్నములు కలుగ చేయుచున్నవో అవి అన్నియు శివుని ఆజ్ఞచే నశించు గాక) అని వచించెదరు. అప్పుడు అవన్నియు దూరముగ తప్పు కొనును. ఇది శాస్త్ర ప్రమాణము. సత్కర్మల నాచరించని వారు పరమపదమును పొంద జాలరు. కావున నింద్యమైన మీ నీచ ఆచారములను వెంటనే వదలుడు. మీ మీ విధికర్మలను ఆచరిస్తూ ఆత్మతత్త్వము  తెలిసికొని జ్ఞానులు కండు. జ్ఞానము నలవరచు కొనడమే మోక్షము' అని బోధించెను.


అంతట వారు శ్రీశంకరా చార్యులు తత్త్వ రహస్యమును వినిపించుట తో శ్రీ శంకరపాదులకు నమస్క రించి ఆశ్రయించారు. ఉత్తమ దేవతలను ఆరాధించుకొనుచు అద్వైతతత్త్వ జ్ఞానము నార్జించుకొని ముక్తిని బడసిరి.


అంతటితో శ్రీ శంకరా చార్యస్వామి విశ్వప్రేమ ను అనేకమంది మీద కనబరచి దురాచారములను రూపు మాపి కృతార్థులయి యచ్చోటు వీడి పశ్చిమ సముద్రమునకు ప్రయాణమైనారు.


*గోకర్ణ క్షేత్రము:*


బహుమతములలోని లోపములను తెలియ జెప్పి శాస్త్రసమ్మతం గాని మతములను విడిచి పెట్టించి తరించు విధానము గల అద్వైతమత విశిష్టతను బోధించి యావద్భారతము సంచా రము జేసి కాశీపట్టణం జేరుకొన్నారు.


అచ్చట అనేక మతములను కాదని తత్త్వ రహస్యమును వెల్లడించి ప్రేమతో సరియైన మార్గమున త్రిప్పి తద్వారా అద్వైత మత స్థాపన జేసి పశ్చిమతీర ప్రాంతములకు ప్రయాణమై మార్గమధ్యమందు అనేక దేశములు దాటి కొలది దినములకు గోకర్ణ క్షేత్రం జేరు కొన్నారు. వెళ్ళీ వెళ్ళడంతో అందున్న పరమశివుని దర్శించారు.


శ్రీ శంకరాచార్యుల దర్శనం కొరకు వేలాది జనం శివాలయానికి వెళ్ళి వారిని దర్శించారు. ఆనాడా శివాలయంచూడ ముచ్చటైనది. తీరికసమయములలోఆలయంలో శిష్యులకు వేదాంత తత్త్వబోధ చేసే వారు. పురవాసులు వచ్చి వినేవారు. హరదత్తు డను శివభక్తుడు బాగుగ విద్యలు నేర్చినవాడు. శ్రీ శంకరులిచ్చు ఉపన్యాస ములు కడు శ్రద్ధతో విని శ్రీశంకరులు కేవలం అవతార పురుషులని నిశ్చయించు కొన్నాడు. అప్పటికి తన గురువైన నీలకంఠాచార్యుని కంటె గొప్ప వాడు లేడని తలంచేవాడు. శ్రీశంకర పాదుల శక్తిసామర్ధ్యము లు చూచుటతో అతని తలంపు తారుమారైనది. రెండురోజులు శ్రీశంకర దేశికేంద్రుల తత్త్వబోధ విని తన గురువులకు ఆ విషయం విన్నవించు కొనుటకు చాల కుతూహలం కలిగి గురువులను సమీపించి,'సద్గురువర్యా వందనములు! మన శివాలయమున యతీశ్వరులొకరు మహా శిష్యగణంతో అరుదెంచి యున్నవారు. లోకంలో ఎందరెందరినో జయించారట! అపజయమనునది ఆయనెఱుగరట! మండమిశ్రుడు మొదలైన దిగ్గజములు వాదమందు విజయం సాధించలేక నిర్వీర్యులై, జగద్గురువులకు శిష్యులై సేవిస్తు న్నారు. శ్రీ ఆచార్య స్వామి శిష్యులకు వేదాంతవిజ్ఞాన బోధలు చేయుచుండ నేనచ్చోట కొలదిసేపుండి విని యున్నాను.


అద్వైత మత ప్రచారమే వారి ముఖ్యాశయమట.


దేశ మందుగల మతములలో నుండే లోపములను పూర్ణమైన ప్రేమతో సవరించి నిజతత్త్వమును సాకల్య ముగ బోధించడమే వారి అవతారాశయమట! ఆ ఆశయమును దేశమం దంతట ప్రచారం చేసి విజయపతాకమును చేపట్టి కుమతములను ఖండించి మన ప్రాంతం మిగిలియున్నదని దీనిని గూడ ఆ విధముగ ఉద్దరించిన వారి కోరిక నిర్విఘ్నముగ, సంపూర్తి యగునని వచ్చియున్నారట! వాదమందు మిమ్ములను గూడ జయించ వలెనన్న ఆకాంక్షతో మన పురమందు బసచేసి యున్నారు' అని మెల్లగ హరదత్తుడు తన గురు దేవులకు వ్యక్తం చేశాడు.


శిష్యుని పలుకులు ములుకులై హృదయాం తరాళమందు గాఢముగ నాటుకొనగా నీలకంఠాచార్యు లొకించుక సేపు మౌనం వహించి పిమ్మట, 'శిష్యా! నా శక్తిసామర్థ్యములు నీవెఱుగవా? ఆసన్న్యాసి సముద్రమును ఎండగట్ట గలడనుకో! ఆదిత్యుని అనేక మారులు ఆకాశము నుండి అవనీతలమునకు దింప గలడనుకో! ఈ భూమినంతను ఒక్క పర్యాయం చాపచుట్ట వలె చుట్టగలడనుకో! ఇంకను ఏలాటి ఘన కార్యములనైనను చేయ గలడనుకో! నన్ను మాత్రం జయించడం కల్ల! క్షణంలో అతణ్ణి ఓడించడం స్థిరం! నా చాకచక్యం, నా ప్రజ్ఞ ఆ సన్న్యాసి చవి చూచును. నీకనుమాన మేల?' అని లోన గల పిరికితనమును వ్యక్తం చేయక హేలగాపలికాడు. లోనికేగి, ‘అదేమియో చూచెదను గాక!' అని మనస్సులో తలచి చక్కగా ద్వాదశ స్థానము లలోను విభూతిరేఖలను ధరించి, రుద్రాక్ష మాలలను అలంకరించుకొని, సాక్షాత్ శివునివలె తయారై, శిష్యులను వెంటబెట్టుకొని బయలు దేరి శ్రీశంకరాచార్యుల కడకు పోవుచుండెను. శ్రీ ఆచార్యస్వామిని సమీ పించి చేరువన కూర్చుం డెను.


*నీలకంఠుడు:*


నీలకంఠుడు జగద్గురువులతో వాదించుటకు  ఉద్యుక్తుడైనటుల సురేశ్వరాచార్యుడు గ్రహించాడు. తన చాతుర్యం వాదంలో చూపించెదనని, నీల కంఠునితో శ్రీసురేశ్వరా చార్యుడు వాదించుటకు జగద్గురువులనర్ధించాడు.  అందులకు శ్రీ శంకరపాదు లంగీకరించగా తయారుగ నుండెను. నీలకంఠాచార్యులు దానిని కనిపెట్టి, 'ఓయీ! నీవు నాతో వాదించ నాయత్తపడు చున్నట్లు కన్పట్టుచున్నావు! అలనాడు నీవు, నీ భార్య శ్రీశంకరులతో వాదించి ఓడిపోయి నటుల నేనెఱుగనా? నీ ప్రజ్ఞ అందు వ్యక్తమైనది గదా! స్వయంగా ఆచార్యస్వామితో వాదించ నుద్యుక్తుండనై వచ్చితిని. మధ్య నీతో  నాకేల?' అని సురేశ్వరా చార్యుని తిరస్కరించి శ్రీ ఆచార్యపాదులవైపు తిరిగి వాదమునకు సిద్ధముగా నున్నటుల వ్యక్తపరిచాడు. అందు లకు సర్వసిద్ధముగ నున్న జగద్గురువులు తన యభి మతమును వ్యక్తంచేయగా నీలకంఠా చార్యులు, 'శంకరా చార్యా! బ్రహ్మసూత్రములకు నేను ఇదివరకే భాష్యమును రచించి యుంటిని. శివతత్త్వమే మానవులకు శరణ్యమని సిద్దాంతం జేసినాడ' అని ప్రారంభించునంత శ్రీ శంకరాచార్యులు నీల కంఠాచార్యునికి గల ప్రభావమును సంపూర్తిగా వ్యక్తం చేయువరకు వేచియుండిరి. అంత వరకు వెడలగ్రక్కిన విషయములను పట్టు కొని ఒక్కొక్కదానినే తుత్తునియలు గావించిరి. అట్లు ఛేదించుట గమనించి పక్షములు తెగి న పక్షివలె నీలకంఠుడు కూలబడియెను. పట్టు దలవహించి వితండ వాదమునకు నడుం బిగించ  సమకట్టెను. 'యతివర్యా! తత్త్వమ స్యాది మహావాక్యములు జీవబ్రహ్మైక్యమునే ప్రతి పాదించుచున్నవని పలుకుచున్నారు. తాము కూడ అట్టిభావము స్థిర మైనదిగా భావించుచున్నారు. కాని అదెంత మాత్రము సమంజసము గనున్నటు లొప్పుటలేదు. లోకములో చీకటి, వెలుగులున్నవి. ఆ రెండి టికి విరుద్ధ భావములు సహజముగ నున్నవే కదా! ఆ రెండింటికి భేదము లేదనడం ఎట్లు పొసగును?అదేవిధముగ జీవేశ్వరులు ఒకే ధర్మము గలవారు కాదు గనుక వారిరువురకు భేదమే సత్యము. జీవేశ్వరులకు భేదములేదనుట పొసగు నది కాదు.


'శంకరాచార్యా! జీవేశ్వరులకు భేదం లేదని ఒప్పించుటకు ఎన్నెన్నో యుక్తులు పన్ని ప్రయత్నించెదరు. అందు ‘బింబము-ప్రతిబింబము' అనుసామ్యంచెప్పుదురు. బింబము లేకుండ ప్రతిబింబ ముండదు. బింబము వంటివాడు ఈశ్వరుడు. ప్రతిబింబ మువలె జీవుడున్నాడని యందురు. అంత మాత్ర మున బింబ ప్రతిబింబ సామ్యంతో జీవేశ్వరులకు భేదములేదని ఒప్పించుట సమంజసము కానేరదు. ఏలయన సూర్యునకుండే గుణము లు ప్రతిబింబమునకు లేవుగదా! అందువలన గుణభేదం ఏర్పడినం దున వైరుధ్యము ప్రత్యక్ష మగుచున్నది. ఇందు సామ్యం ఎట్లు సమర్ధ నీయము? కనుకనే వ్యోమశివుడు మొదలైన మహా మహులందరు దానిని మిథ్య యని స్థిరపరిచినారు. కావున మీరందరు పలుకునది ప్రమాణరహితం. ఇది యును గాక, బింబము సత్యము, ప్రతిబింబము అసత్యమేగదా! ప్రతి బింబము బింబము యొక్క ఛాయమాత్రమే అయియున్నది. ఛాయ లెన్నటికి సత్యములు కానేరవు. జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమని అంగీక రించిన అది సత్యము ఎన్నటికీ కాదు. పరమాత్మకు ఉపాధి లేదు. ఉపాధి లేనప్పుడు పరమాత్మకు ఛాయ యెట్లు కలుగును? ఒకవేళ ఉన్నదని ఒప్పుకొనిన ప్రతిబింబ మునకు సత్యత్వమే యుండదు. కనుక జీవుడు మిథ్యావస్తువే యగుచున్నది. జీవుడే లేనప్పుడు తేడా లేదనడం ఎన్నటికీ సాధ్యం కానిమాట. అట్లయినచో బంధము లేదు, మోక్షము లేదు. మరియొక విషయము - 'జీవునకు బ్రహ్మకు ఉపాధులు లేవు, అవి కల్పితము' లనుచు న్నారు. ఆ ఉపాధులు నశిస్తే 'జీవుడే బ్రహ్మ' అని అంటారు వేదాంతులు. జీవేశ్వరులలో ఈశ్వరుని వలె జీవుడుండుట లేదు. ఈశ్వరునకు సర్వజ్ఞత్వ మున్నది.


జీవుడు మూఢుడు, పైగా అల్పజ్ఞానంతో నున్న వాడు.


అందువలన వారిరువురి ధర్మముల లోను తేడాలు స్పష్టముగ నున్నవి. మరియు ఆవులకు గుఱ్ఱములకు ధర్మాలలో తేడాలున్నవి. ఆ ధర్మములను కాదను టకు ఎట్లు వీలు లేదో జీవేశ్వరులకు చిన్న, పెద్ద అను తేడాలున్నవి. అట్లు కాదనుట ఎవరికీ శక్యం కాదు. 'నేనుపరమాత్మను కాను' అనేది కూడ ప్రత్యక్ష ప్రమాణం కలదియే. దీనిని కూడ కాదనుటకు వీలు లేదు. కనుక భేదం లేదని వాదించడం భ్రాంతి కాక మరేమున్నది? 

 

లోకమంతా 'నేను, నీవు' 'వాడు, వీడు' అనే భావంతో మునిగి యున్నది. ఇది నా భార్య, వీడు నా కుమారుడు, ఈతడు నా మిత్రుడు అనుచున్నారు. నాకు, వీనికి భేదము లేదనుచున్నారు. భేదము లేకుండ అభేదము రాదు. అప్పుడు కూడ రెండు ఉండి ఉండ వలెను. నేనే వాడు, వాడే నేను అన్నప్పుడు భేదం లేకున్నను ఇద్దరు కనబడుచున్నారు. 'నేను బ్రహ్మను' అనినప్పుడు 'నేను' అనువాడొకడు, ‘బ్రహ్మ’ అనువాడొకడై తీరుచున్నది. కనుక అద్వైతమనునది శుద్ధ అబద్ధమైంది. గనుక ద్వైతమే స్థిరం' అని నీలకంఠుడు తనలో నున్నదంతయు వెలువ రించెను.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 40వ భాగముసమాప్తము* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

కామెంట్‌లు లేవు: