13, అక్టోబర్ 2024, ఆదివారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 39,

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 39,వ భాగము*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*పరమాణు వాదులు:*


పరమాణువాద మత స్థులలో ధీరశివుడను వాడు పెద్ద. ఆయన శంకరులను సమీపించి, 'స్వామీ! నమస్కారములు! పరమేశ్వరుడు లోకములన్నింటికి కర్తయై వెలయు చున్నాడు. అంతవరకు అందరికి సమ్మతమే. నిత్యత్వంగల భూమ్యాది పరమాణు వుల సంయోగము వలన లోకములు సృష్టింప బడుచున్నవి. ఎప్పుడా పరమాణువు లు వియోగము జెందునో ఆనాడు ప్రళయము సంభవించుచున్నది. కాని పరాత్పరుడు తాను నిమిత్త మాత్రుడై, సాక్షీభూతుడై ఉన్నాడు’ అని వివరించాడు.


ధీరశివుని మత విధాన మును విని, 'ధీరశివా! నీవన్నదంతా వేద విరుద్ధమైనది. సమస్త ము పరమేశ్వరుడి నుండియే పుట్టు చున్నది. ఆయన సృష్టించనిది ఏమియు లేదు. లోకముల కాయన తండ్రి యని వేదము తెలియ జేయు చున్నది. గౌతమ ముని చే తెలుపబడినన్యాయ విద్యను అనుసరించిన వారు నక్కలై పుట్టెదరు. కనుక అట్టివన్నియు విడనాడి అద్వైతతత్త్వ మునాశ్రయించి ముక్తు లు కండు. అందులకు సద్గురువుల నాశ్రయిం చవలెను' అని శ్రీ శంకరాచార్యస్వామి తెలుపగా ధీరశివుడు మొదలైన పరమాణు వాద మతము వారందరు తమ మతమును వీడి శ్రీ శంకరపాదులకు శిష్యులై అద్వైతతత్త్వ జ్ఞానార్జన జేయుచు సుఖముగ నుండిరి.

ఆ మరునాడు బ్రాహ్మీ ముహూర్తమున లేచి, త్రివేణీ సంగమంలో స్నానాదులొనర్చి, శ్రీ శంకరపాదులు శిష్య సమేతముగా బయలు దేరి వారము దినములకు కాశీక్షేత్రం జేరు కొన్నారు.


*కర్మవాదులు:*


ప్రయాగ పట్టణము నుండి కాశీ జేరుకొని శ్రీశంకరాచార్య స్వామి మూడు మాసములు అద్వైత మత ప్రచార ముజేసిరి.శ్రీ శంకర పాదుల ఆగమనముతో కాశీ పట్టణం కళకళలాడి నది. పురజనులు తండోపతండములుగ వచ్చి జగద్గురువుల దర్శనం చేసికొని పద్మపాదాదియతులను దర్శించి ఆశీర్వచన ములు పొంది పోవు చుండిరి. పూర్వ పరిచయం గలవారు శ్రీశంకరాచార్యుల దివ్య తేజంచూచి అబ్బుర పడి అమితానంద భరితులైరి. శ్రీ ఆచార్య స్వామి దేశమందనేక మతములను నిరాక రించి అద్వైత మతము నకు పట్టాభిషేకము జేసి వచ్చినారని కాశీ పురమందు, చుట్టుపట్ల గల కర్మవాదులందరు ఒకచో సమావేశమై ఎట్లైనను కర్మమతము నకు ప్రముఖస్థాన మిప్పించ వలెనని నిర్ణయించు కొనిరి.

కర్మవాదులందరు శ్రీ శంకరపాదులకు యధా విధిగ నమస్కారములర్పించి తమతమ స్థానములయందు ఆసీను లయ్యారు. అందొకరులేచి, ఆచార్య స్వామీ! కర్మ చేయనిదే ఏమీలేదు. సృష్టిస్థితు లకు కర్మ వల్లనే గదా కారణమగు చున్నది. మంచికర్మలు చేయుట వలన మంచి జన్మలు, చెడు కర్మలాచరించి నందువలన నీచజన్మలు కలుగు చున్నవి. జనకమహారాజు మొదలయిన వారు అందరు సత్కర్మలాచ రించుట వలననే గదా జ్ఞానులై ముక్తిని బడసి యున్నారు. ముముక్షు వులందరు కర్మలు చేయవలెనని, దాని వలన సుఖం కలుగు నని, ఆ సుఖమే మోక్షమని నిర్ణయిం చారు గదా!” అని తెలియజేసెను.


కర్మోపాసకుల పలుకు లాలకించి శ్రీ శంకరా చార్యులు, 'కర్మోపాసకుడా! “యస్యైతత్ కర్మ” అని శ్రుతి తెలుపుచున్నది. జగత్తు పుట్టినదనిన అందులకు కారణము బ్రహ్మే, అది సుస్పష్టము. కర్మ జడమై యుండ,జడము సృష్టికి కారణమెట్ల గును? మూఢులయిన వారుమాత్రం జడమగు కర్మనాశ్రయించి జనన మరణరూప సంసార సాగరమందు బడుచు న్నారు' అని సూక్తులతో పలుక కర్మవాదులం దరూ శ్రీశంకరులకు శిష్యులై కర్మమతమును విడనాడి అద్వైత విద్య నాశ్రయించారు.


*చంద్ర మతస్థులు*:


శివభూషణుడను పేరు గల చంద్రమత గురువు శిష్యులతో శ్రీశంకరాచార్యుల కడకు జేరి, 'యతీశ్వరా! నమస్కార ములు! పూర్ణిమ మొదలగు పుణ్య తిథులలో భక్తిశ్రద్ధలతో చంద్రుని ఆరాధించెదరు. లోకములన్నిటికి ప్రకాశమును కలుగ జేయు చున్నాడు చంద్రుడు. ఆయన ప్రత్యేక మండలము గలిగినవాడై లోకములకు కూడ పాలకుడై అలరారుచున్నాడు. అందువలన చంద్రుడు అందరికి పూజనీయు డయ్యాడు. ఆతడే ముక్తి నిచ్చువాడు. అందుచే మేమందరం ఆయన్నే ఉపాసించు చున్నాము. తాముకూడ మావలెనే చంద్రుని పూజించి ధన్యులు కండు!' అని తన మత విధానమును వివరించెను.


శ్రీశంకరాచార్యులు ఆ పద్దతిని విని, 'శివ భూషణా! అనిత్యమైన వాళ్ళను ఉపాసించిన నిత్యమైన మోక్షం ఎట్లా కలుగును? అదెన్నటికి సాధ్యం కాని పని. కొన్ని కర్మలు చేసిన చంద్ర మండల నివాసం కలుగును. ఆ పుణ్యం తరిగిన వెంటనే తిరిగి భూ లోకమందు జన్మించడం సత్యం. ‘ధూమో రాత్రి స్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ | తత్ర చాంద్రమానం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే' అని శ్రీకృష్ణ భగవానుడువచించాడు. అనగా పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెల లతోగూడిన దక్షిణాయ నము, ఏ మార్గమున గలవో ఆ మార్గమున వెడలి, సకామ కర్మయోగి చంద్ర సంబంధ మైన ప్రకాశమును పొంది, మరల వెనుకకు వచ్చుచున్నాడు. అనగా భూమండ లమున జన్మించుచున్నాడు. పైగా చంద్రుడు దేవతలకు అన్నమని చెప్పుచున్నది. అట్టి వాణ్ణి ఎట్లు సేవించినను ముక్తి రానేరదు. ఒక్క చంద్రలోక ప్రాప్తి మినహాగా చంద్రోపాస కునకు లభ్య మయ్యేది మరియొకటి కానరాదు. కనుక ఇంతటితో మీ మూఢత్వమును విడనాడి జ్ఞానమును ఆర్జించుకొని ముక్తులు కండు! జ్ఞానమే ముక్తికి మార్గము' అని బోధించారు.


శివభూషణాదులు శ్రీ జగద్గురువుల తత్త్వ బోధను విని తమ మతమును  విడనాడి శ్రీశంకరపాదులకు శిష్యులై అద్వైతతత్త్వ జ్ఞానార్జన చేయుచు సుఖముగ నుండిరి.


పిమ్మట కుజుడు మొదలైన గ్రహోపాసకు లు శ్రీశంకరపాదులతో వాదించ వచ్చి యున్నారు.


*కుజాది గ్రహోపాసకులు*


గ్రహములు తొమ్మిది. అందు మొదట రవి చంద్రులను ఉపాసిం చువారు శంకరులతో వాదించి అద్వైతు లయ్యారు.మిగిలినవారు కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర మతములవారున్నారు. వారందరు శ్రీశంకరా చార్యులను దర్శించి, 'స్వామీ! అనేక నమస్కారరములు! అంగారకుడు మొదలయిన గ్రహములను ఉపాసిం చిన ముక్తి కలుగునని వేదమందు వచించ బడియున్నది. మేమం దరము అంగారకాది గ్రహోపాసకులము. మా ఉపాసనలతో తప్పక మాకు ముక్తి కలుగు చున్నది. కావున ముక్తిని పొందగోరు వారు మావలె శ్రద్ధతో కుజాది గ్రహములను ఉపాసించవలెను అన్నారు.


శ్రీ శంకరదేశికేంద్రులు కుజాది గ్రహోపాసకుల ఆశయము విని, ‘భక్తులారా! గ్రహాల నుపాసించిన ముక్తి లభింపదు. అట్టి ఉపాసన గ్రహపీడలను వదల్చుకొనుటకు ఉపకరించును. తత్త్వజ్ఞానం వల్లనే ముక్తి కలుగుచున్నదని 'సదేవ’ మొదలగు వాక్యములు ప్రమాణ ములుగ నున్నవి. కావున నవగ్రహోపాస నలు విడనాడి ఆత్మ తత్త్వ జ్ఞానమునకై పాటుపడుడు!' అని బోధించారు. అంతట గ్రహోపాసకులందరు శ్రీశంకరపాదుల మాటల యందు గౌరవముంచి శ్రీజగద్గురువులకు శిష్యులై ఆత్మతత్త్వము నాశ్రయించి జ్ఞానులై సుఖమును పొందిరి. పిమ్మట క్షపణకుడను వాడు శ్రీశంకరపాదుల శిష్య గణమందు వేచి యున్నవాడు, శ్రీ శంకరాచార్యస్వామి వారి పరీక్షకు సిద్ధ పడెను.


*క్షపణకుడు శిష్యుడగుట:*


ఆరుమాసముల క్రితం శ్రీశంకరాచార్యులఆజ్ఞకు బద్ధుడై గోలయంత్ర తురీయ యంత్రములను ధరించిన క్షపణకుడను కాలమతస్థుడు ఉండ బట్టలేక శ్రీజగద్గురువుల కడ కరుదెంచి, నమస్కరించి, 'స్వామీ! చిరకాలము నుండి మీకడ నుండిపోతిని. నన్ను పరీక్షింతు నంటిరి. కాని మీకడ సుఖముగ నుంటిని. నన్ను మన్నించి నా మతవిధానము వినుడు!' అనగా శ్రీశంకరపాదులంగీక రించి వివరించమనిరి.


'పరాత్పరా! కాలమే పరబ్రహ్మమని మేము నమ్మియున్నారము. ముక్తికోరువారు మా కాలదేవుణ్ణి ఉపాసించవలెను. ఆయన మాకు ముక్తి నిచ్చుచున్నాడు. తామును మావలెనే కాలదేవుని ఉపాసిం చుడు!' అని క్షపణ కుడు వివరించెను.


వాని మాటల కాశ్చర్య పడి శ్రీశంకరాచార్యులు 'కాలముగూడ పరబ్రహ్మము నుండియే ఉత్పన్నమైనది. పుట్టిన దెప్పుడును నిత్యము కాదు. కనుక దాని నుపాసించ తగదు. కాలోపాసన వలన ముక్తి రాదు. ఇకనైన నీ బుద్ధి మార్చుకొని అద్వైత మతము నాశ్రయించుము! అదియే నీకు ముక్తి నిచ్చును' అని బోధించారు. 

క్షపణకుడు తక్షణం తన మతమును విడిచి శంకరులకు శిష్యుడై అద్వైతము నాశ్రయిం చాడు.


*పితృమతస్థులు:*


సత్యకర్మ మొదలయిన పితృ మతస్థులు తమ మత విధానమును తెలిపి శ్రీశంకరులను ఒప్పించుటకు వచ్చి నమస్కరించారు. 'స్వామీ! పితృ దేవతలు ఎల్లపుడు ముక్తులయి ఉన్నవారు. వాళ్ళను సేవించుట వలన ధర్మాదులు లభించి ముక్తి కలుగు చున్నది. వారలకు నిత్యము పితృ తర్పణ ములు వదలుచుండ వలెను. శ్రాద్ధాదులు శ్రద్ధతో పెట్టవలెను. అట్లుచేసిన గృహస్థులు ముక్తులగుచున్నారు. పితృలోకము చంద్ర మండలమునకు పైగా నున్నది. 


చాంద్రమానమును బట్టి ప్రతీ అమావాస్య పితృదేవతలకు మధ్యాహ్న కాలము అగును. మానవమానం ప్రకారము పితృదేవత లకు ఒక దినము అచున్నది. అమావాస్యనాడు పితృదేవతలకు భోజన మిడిన వాళ్ళు ప్రతీ దినము భోజనము చేసినట్లగును. మన మట్లుచేసిన పితృదేవత తలు నిత్య తృప్తులగుదురు. ప్రతీ అమావాస్య నాడు పిండపితృ యజ్ఞము లాచరించి వలసి యున్నది. కావున పితృదేవతో పాసన చేసినవారు తప్పకుండ ముక్తిని పొందెదరు" అని వివరించారు పితృ మతస్థులు.


శ్రీ శంకరాచార్యస్వామి అది విని 'కర్మలు చేయుట వలన ముక్తి రాదని వేదం వచించు చున్నది. అందువలన మీరాడిన మాటలలో సత్యం దూరమైనది. ఆత్మతత్త్వ జ్ఞానమే ముక్తిని ఇచ్చునని పరమ ప్రమాణమై యుండ కర్మ చేయడం వలన ముక్తి కలుగు ననుటకు ఆస్కార మెక్కడ? కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి మాత్రమే కలుగు చున్నది. చిత్తశుద్ధి గలిగినవాడు సద్గురువుల నాశ్రయించి తత్త్వ విచారణ చేయవలసి యున్నది. దానివలన ముక్తి తప్పక సిద్దించును' అని బోధించారు. అంతట సత్యశర్మాదు లందరు తమతమమతములను విడనాడి శ్రీశంకరా చార్యులనుశరణుజొచ్చి శిష్యులై జ్ఞానమార్గము నవలంబించిరి.


*గరుడ శేష భక్తులు:*


గరుడ శేష భక్తులు శ్రీశంకరుల జూడ వచ్చారు. అందు కుజ్వలీటుడు ఆదిశేషుని భక్తుడు. శంఖపాదుడు గరుడభక్తుడు. వారిరువురు వారివారి మతస్థులలో గురువులై యున్నారు. వారిరువురు శ్రీశంకరపాదులను జేరి నమస్కరించి ‘యతీశ్వరా! మా మనవి చిత్తగింపుడు! ఆదిశేషుడు శ్రీ పరమే శ్వరునకు సర్వదా శయ్యాసుఖమును కలుగజేయు చున్నాడు. అందువల్ల మేమందరం  ఆదిశేషుని ఉపాసించు చున్నాము' అన్నాడు కుజ్వలీటుడు. 


'పరమేశ్వరునకు నిత్యం వాహన సౌఖ్యమును కలుగ జేయుచున్న గరుత్మం తుని పరమభక్తితో సేవించుచుందుము' అని శంఖపాదుడు వివరించాడు.


వారిరువురి విధానము లను విని, 'ఓయీ! భక్తులారా! శయ్యను, వాహనమును ఉపాసించిన ముక్తిరానేరదు. మీకు ముక్తి కావలెనన్న పరాత్పరునే సేవించుడు ఆ దేవదేవుని దయకు పాత్రులు కండు. ఆయన దయ వలన తత్త్వ జ్ఞానార్జన ప్రాప్త మగును. తద్వారా ముక్తిని పొందుడు' అని శ్రీ శంకరాచార్యులు తెలియజెప్పిరి. అంతట వారిరువురు సంత సించి జగద్గురువులు వచించిన విధానము ననుసరించుటకు నిశ్చయం చేసికొని శ్రీశంకరాచార్యుల నాశ్రయించి శిష్యులై నారు.


*సిద్ధోపాసకులు:*


'స్వామీ! నమస్కార ములు! మేమందరం సిద్ధుల అనుగ్రహంతో మంత్రాలను పొంది యున్నాము. శ్రీశైలము మొదలైన దివ్య స్థలములలో సత్యనాధుడు మొదలయిన అనేకమంది సిద్ధులు ఉంటున్నారు. వారు అందరు మంత్రసిద్ధి ప్రభావం వలన చిరకాలము నుండి అట్లనే ఉండిపోయారు. మేముకూడ వారివలెనే చిరకాలము నుండి జీవించుచున్నాము. అనేకవిద్యలు అంజనా దులు మా యధీన మైనవి. మమ్ములను కాదనువారికి శక్తి చాలదు. కనుక తాము కూడ మా వలెనే సిద్ధులై ప్రసిద్ధికెక్కుడు' అని తమ ఉపాసనా విధానమును విశద పరిచారు.


శ్రీ శంకరపాదులు సిద్ధుల ప్రజ్ఞ విన్నారు. 'సిద్దోపాసకులారా! విచిత్రవేషములు దాల్చుటవలన ఆడంబ రమే మిగులును. అజ్ఞానముతో మాట లాడుట యుక్తము కాదు. వేషాదుల వలన ద్రవ్యార్జనకు అనువుగా నుండిన నుండవచ్చు. అట్టి ద్రవ్యము పాప భూయిష్టమగును. ఆ ద్రవ్యమనుభవించిన వాడు పాపి యగును. ఈ శరీరములు సర్వ దుఃఖములకు నిలయ ములు. ఎంత కాలం జీవించిన నేమి ఫలము ఉన్నది? చిరజీవికి ఆత్మ సుఖం లేనప్పుడు జన్మ సార్ధకము కానేరదు. కావున తరుణో పాయము పొందుటకు జ్ఞాన మార్గమును అవలం బించుడు. తద్వారా ముక్తిని బడయుడు' అని తెలియజెప్పగా సిద్దులు శంకరసూక్తులు మనమున నాటి వారి మతమును విడచి శ్రీ శంకరపాదులకు శిష్యులై కృతార్ధు లయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము39 వ భాగముసమాప్తము*

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

కామెంట్‌లు లేవు: