☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(63వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*పురూరవుడు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*బుధుడికీ, ఇలకీ పురూరవుడు జన్మించాడు. షట్చక్రవర్తులలో పురూరవుడు ఒకడు.*
*గంగా యమునా సంగమ తీరాన ఉన్న ప్రతిష్ఠానపురం రాజధానిగా పరిపాలించాడితను. గొప్ప పరాక్రమశాలి. దేవతలకూ దానవులకూ యుద్ధం జరిగినప్పుడల్లా ఇంద్రుడు, పురూరవుని సహాయాన్ని అర్థించేవాడు. పురూరవుడు కత్తి పట్టాడంటే విజయం తథ్యం. చాలా యుద్ధాల్లో అతను దేవతలకు విజయం చేకూర్చాడు. ఈ కారణంగానే పురూరవుడంటే ఇంద్రునికి గొప్ప గౌరవం. ముల్లోకాల్లోనూ పురూరవుడు యథేచ్ఛగా సంచరించేవాడు.*
*ఒకనాడు దేవలోకంలోని అప్సరసను చూశాడతను. మోహించాడు. అదో కథ. ఆ కథ అలా ఉండగా...*
*ఒకనాడు దేవసభలో పురూరవుణ్ణి నారదుడు ప్రశంసించాడు. అతని వీరవిక్రమాలనూ, గుణగుణాలనూ తెగ మెచ్చుకున్నాడు. అతని అందం గురించి కూడా పొగిడాడు. అదంతా విన్నది ఊర్వశి. పురూరవుణ్ణి ప్రేమించసాగింది. అందుకు మిత్ర వరుణుల శాపం కూడా కలసి వచ్చిందామెకు. ఊర్వశిని వారు భూలోకంలో పుట్టమని శపించారు. దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఊర్వశి, ప్రతిష్ఠానపురంలో విహరించసాగింది. పురూరవుడు చూశాడామెను. మోహించాడు. పెళ్ళి చేసుకుందామన్నాడు.*
*భార్యగా ఉండేందుకు కొన్ని షరతులు విధించింది ఊర్వశి. ‘‘నా దగ్గర రెండు మేకపిల్లలు ఉన్నాయి. ప్రాణసమానంగా పెంచుకుంటున్నాను. వాటిని నువ్వు కాపాడాలి. నేను నెయ్యి తప్ప వేరేదీ తినను. నాకు నువ్వు ముప్పూటలా నేతినే వడ్డించాలి. సంభోగసమయంలో తప్ప నువ్వెప్పుడూ నాకు దిసమొలతో కనిపించకూడదు. ఈ మూడు షరతులూ నువ్వు పాటిస్తానని నాకు మాట ఇస్తే తప్పకుండా పెళ్ళి చేసుకుందాం.’’ అన్నది ఊర్వశి.*
*పాటిస్తాననని ప్రమాణం చేశాడు పురూరవుడు. పెళ్ళి చేసుకున్నారిద్దరూ. అనేక సంవత్సరాలపాటు సుఖాల్ని అనుభవించారు. ఇంతలో ఊర్వశికి శాపవిమోచనకాలం దగ్గరపడింది.*
*ఆమెను దేవసభకు రప్పించేందుకు ఇంద్రుడు ప్రయత్నించాడు. పురూరవునికీ, ఊర్వశికీ ఎడబాటు కల్పించాలి. అందుకు గంధర్వులను పురిగొల్పాడతను. వారు ఓ రాత్రివేళ ఊర్వశి ప్రాణసమానమయిన మేకపిల్లలను దొంగిలించారు. తమనెవరో ఎత్తుకునిపోతున్నారని చెబుతూ మేకపిల్లలు బిగ్గరగా అరవడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఊర్వశీ పురూరవులిద్దరూ ఏకశయ్యాగతులై ఉన్నారు. మేకల అరుపులు విని, ఊర్వశి గొల్లుమంది. ఏడ్చింది. వాటిని కాపాడమని పురూరవుణ్ణి వేడుకుంది. మేకపిల్లలను కాపాడేందుకు దిసమొలతోనే కత్తిపట్టి పరిగెత్తాడు పురూరవుడు. గంధర్వులను ఓడించాడు, మేకపిల్లలను తీసుకొచ్చి, ఊర్వశిని ఓదార్చాడు. అయితే అప్పుడు కూడా అతను దిసమొలతోనే ఉన్నాడు. దిసమొలతో ఊర్వశికి కనిపించి, నియమభంగం చేశాడు. దాంతో అతన్ని విడిచి పెట్టింది ఊర్వశి. వెళ్ళిపోయిందక్కణ్ణుంచి.*
*ఊర్వశి వియెగాన్ని తట్టుకోలేని పురూరవుడు పిచ్చెక్కి తిరుగుతూంటే అతనికి ఊర్వశి కురుక్షేత్రంలో కనిపించింది. ఆనందించాడతను. వెంట రమ్మని బతిమలాడాడు. రాలేనని చెప్పింది ఊర్వశి.*
*గర్భవతిని అంది. ఒక ఏడాది ఆగి, రమ్మంది అతన్ని. ఆగాడు పురూరవుడు. ఏడాది తిరగ్గానే వచ్చాడు. రమ్మని ఊర్వశిని బతిమలాడాడు మళ్ళీ. గంధర్వులను ప్రార్థించమందామె. ప్రార్థించాడు పురూరవుడు. గంధర్వులు అతని ప్రార్థనకు సంతోషించి, అగ్నిస్థాలి (వంటకుండ)ని బహూకరించి అదృశ్యమయ్యారు. దానిని జాగ్రత చేశాడు పురూరవుడు. దానినే ఊర్వశిగా భావించి కొంతకాలం గడిపాడు. చివరికి అది ఊర్వశి కాదని తెలిసింది. దాంతో దానిని అడవిలో విడిచి పెట్టి వచ్చాడు. అయినా ఊర్వశి మీద మోహం పోలేదతనికి. ఆ మోహంలో మనోవ్యధకు గురయ్యాడు. ఆ వ్యధలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కృతయుగం అంతరించిపోయింది. త్రేతాయుగం ప్రారంభమయింది.*
*పురూరవునికి అప్పుడు కర్మబోధకమయిన వేదత్రయం అగుపించింది. అగ్నిస్థాలిని విడిచిన చోటుకి పరిగెత్తాడతను. దాని కోసం వెదికాడు. కనిపించలేదది. శమీగర్భజాతమయిన అశ్వత్థవృక్షం కనిపించిందతనికి. దానిని రెండు అరణులుగా రూపొందించాడు. ఒక అరణిని తాననుకుని, రెండోదానిని ఊర్వశిగా భావించాడు పురూరవుడు. మధ్యగల కాష్ఠాన్ని కుమారుడనుకున్నాడు.*
*మంత్రోచ్చారణ చేస్తూ అరణులను మథించాడు. అప్పుడు అందులో నుంచి అగ్ని పుట్టింది. దాని పేరు జాతవేదసుడు. పుత్రుడుగా ప్రకాశించింది. అంతవరకూ ఉపాసన అర్హమయి ఉన్న అగ్నిని పురూరవుడు ఆనాడు మూడుభాగాలు చేశాడు. వాటినే ‘త్రేతాగ్నులు’ అన్నారు. దక్షిణాగ్ని, గార్హపత్యం, అవహనీయం వాటి పేర్లు.*
*అలా త్రేతాగ్ని ముఖాన పురూరవుడు ‘త్రయీవిద్య’కు ఆద్యుడయినాడు. అగ్నిని సంతానంగా పొందడంతో అతనికి ఉత్తమలోకం సంప్రాప్తించింది.*
*పురూరవునికీ, ఊర్వశికీ ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అని ఆరుగురు కుమారులు కలిగారు.*
*వారిలో విజయుడికి భీముడు, అతనికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు పుట్టారు. ఈ హోత్రకుని కొడుకే జహ్నువు.*
*ఈ జహ్నుముని కారణంగానే గంగకు ‘జాహ్నవి’ అని పేరు వచ్చింది. ఈ జహ్నుని వంశంలోనే గాధిరాజు జన్మించాడు. ఈ గాధి కుమారుడే విశ్వామిత్రుడని వాల్మీకి తన రామాయణంలో పేర్కొన్నాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి