🙏తెలుగు నాటక సమీక్ష 🙏
నాటక కళ ఎంత గొప్పది. నాటకం కంటే గొప్ప దృశ్య కావ్యం మరొకటి ఉన్నదా?
సంస్కృత భాషలో విశేష ఖ్యాతి గడించిన నాటకాలు ప్రాచీన తెలుగు కవులు ఆదరించలేదు.
ప్రాచీన తెలుగు మహాకవులు కావ్యాలు, ప్రబంధాలు రాశారే కానీ నాటకాలు రాయలేదు. ఎందుకని? సంస్కృత సాహిత్యంతో అంత సంబంధం ఉండీ అక్కడి నాటక రచన సంప్రదాయం ఎందుకు పట్టుకోలేదు?
ప్రాచీన తెలుగు సాహిత్యంలో నన్నయకు ముందు ఎవరైనా నాటకాలు రాశాారా? లేదా అనే ప్రశ్న గనుక ఉద్భవిస్తే, అందుకు తగిన ఆధారాలు లేవు. కానీ ఆ కాలంలో తెలుగు నేలపై నాటక సంప్రదాయం బతికే ఉందనడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. నన్నయ్య తన మహాభారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అన్నాడు. కాబట్టి, నన్నయ కాలంలోనూ, అంతకు ముందూ నాటక ప్రదర్శనలు ఉండేవని అర్థం చేసుకోవాలి. బహుశా అవి సంస్కృత నాటకాలు అయ్యి ఉండవచ్చు
నాకు తెలిసి గ్రంథరూపేణ వచ్చిన తెలుగు నాటక రచనలు 14 వ శతాబ్దంలో కొంతవరకు ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఆ శతాబ్దంలో వినుకొండ వల్లభరాయడు రాసిన సుప్రసిద్ధ వీధినాటకం క్రీడాభిరామం ఒక చరిత్రకు సాక్ష్యం. పైగా తెలుగులో లభ్యమైన తొలి నాటకంగా కూడా ఘనతకెక్కింది.
అయితే క్రీడాభిరామం మీద కూడా కొన్ని విమర్శలు, వాదనలు ఉన్నాయి. అసలు ఈ నాటకాన్ని వల్లభరాయుడు రాయనేలేదని, శ్రీనాథుడు రాశాడని కొందరు అంటారు. మరో విషయం ఏమిటంటే, తెలుగులో నాటక రచనలు పెక్కురీతిలో అందుబాటులోకి రాకపోయినా, తెలుగు సాహితీ అభిమానులు మాత్రం సంస్కృత నాటకాలను ఎన్నడూ మర్చిపోలేదు. ఉదాహరణకు 1వ శతాబ్దం వాడైన కాళిదాసు రాసిన నాటకాలైన అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము ఇవన్నియూ ఆనాటి తెలుగు సాహితీవేత్తలకు కంఠోపాఠాలే. అవి తెలుగు నేలపై కూడా పలు రాజ్యాలలో ప్రదర్శించినట్లు ఆధారాలున్నాయి.
కావ్యేషు నాటకం రమ్యమ్’, ‘నాటకాంతంహి సాహిత్యమ్’, ‘నాటకాంతం కవిత్వమ్’.. అంటూ నాటకమును ఉత్కృష్ట సాహితీ సృష్టిగా ప్రకటించారు సంస్కృత పండితులు. అయితే కావ్యాలను తెనిగీకరించిన రీతిలో నాటకాలను ప్రాచీన తెలుగు కవులు లేదా నాటక రచయితలు అనువదించడానికి ప్రయత్నించలేదు.
సంస్కృత నాటకాలను కూడా ప్రబంధాలుగానే అనువదించారు. ఉదాహరణ శృంగార శాకుంతలం కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. సంస్కృత నాటకాలకు ఉన్న గౌరవం తమ అనువాద నాటకాలకు రాదని భయమో? కాళిదాసాది కవుల ముందు నిలవలేమని భయమో? మరే కారణమో? చెప్పలేను. మొత్తం దిగ్గజ కవులు ఎవరు కూడా నాటకాలను స్పృశించలేదు.
ఈ ప్రయత్నం కూడా ఆధునిక యుగంలోనే జరిగింది. పరవస్తు వెంకట రంగా చార్యులు 1872 లో కాళిదాసు రచించిన "అభిజ్ఞాన శాకుంతలము"ను ఆంధ్రీకరించారు.
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రాసిన తెలుగు వారి జానపద కళారూపాలు అనే గ్రంథంలో హాలుడు రచించిన గాథా సప్తశతి గురించి ఒక వ్యాఖ్య ఉంది. దీని ప్రకారం క్రీస్తుకు పూర్వమే ఆంధ్ర దేశంలో సంగీతం, నృత్యంతో పాటు నాటక కళ కూడా అందుబాటులో ఉండేదని ఆ గ్రంథం చెబుతోంది. అయితే ఏ రూపేణ నాటకం ఆనాడు బతికి బట్టకట్టింది అనేది తెలుసుకోవాలి. బహుశా నగరాల వరకూ ఈ నాటకం ప్రాచుర్యం పొందక పొయినా, గ్రామీణులకు మాత్రం ఏదో ఒక రూపంలో అందుబాటులో ఉండేదని మాత్రం గ్రహించాలి. బహుశా వీధి నాటకం రూపేణా ఇది ప్రాచుర్యం పొంది ఉండవచ్చు.
మరొక విషయం ఏమిటంటే, శివకవుల యుగంలో అనగా నన్నయకు, తిక్కనకు సంధికాల సమయంలో (అనగా 1100 నుండి 1225 వరకు), తెలుగు నేలపై శైవ భక్తులు ఎన్నో దేశీయ తెలుగు నాటకాలు ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే తిక్కన రాసిన మహాభారతం విరాటపర్వంలోని కొన్ని భాగాలు మనకు నాటకం చదువుతున్న భావాన్ని కలిగిస్తాయి.
ఇక్కడ కూడా ఓ చిన్న విషయం ఉంది. ఒకప్పుడు ఆర్య సంప్రదాయం ప్రకారం (ముఖ్యంగా సంస్కృత నాటకాలలో) నాటకాలాడే నటులను పంక్తి బాహ్యులుగా నిర్ణయించారు. అటువంటివి చాలా తక్కువగా చూసేవారు. కానీ తెలుగు నేల పై శివకవులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన దేశీయ నాటకాలలో, శివ తత్వానికి కట్టుబడి ఉన్న అగ్రజాతి వారు కూడా నటించేవారు. ఈ నాటకాలు రాత రూపంలో లేకపోవడం వల్ల వాటి గురించి చాలామందికి తెలియదు. కానీ ఇవి మౌఖిక సాహిత్య రూపంలో మాత్రం జనాల నాల్కలపైనే ఉన్నాయి. ఈ దేశీ నాటకాలను జంగమలు ఎక్కువగా ప్రదర్శించేవారు. అయితే ఈ నాటకాలన్ని కూడా శైవమత ప్రచారం కోసం రాసినవే అని గుర్తుపెట్టుకోవాలి. పాల్కురికి సోమనాథుడు రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్రలలో కూడా దేశీ నాటకాల ప్రస్తావన ఉంది.
ఇక ఆంధ్ర రెడ్డి రాజుల కాలంలో అనగా 13వ శతాబ్డంలో పాటల నాటకాలుగా యక్షగానాలు తమదైన పాత్ర పోషించాయి. నిజం చెప్పాలంటే యక్షగానాలు తెలుగు నాటకానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇవి సంప్రదాయ నాటక ప్రమాణాలను అందుకోకపోయినా, నాటక కళ ఏదో విధంగా ఆ కాలంలో తెలుగు నేలపై బతికుండడానికి దోహదపడ్దాయి.
15 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నాటక కళ నగరాలలో ప్రయోగాత్మకమైన రీతిలో పలువురి ఆదరణను పొందింది. గంగాధర కవి రచించిన " గంగాదాస ప్రతాపవిలాసం" ఒక ప్రయోగాత్మక నాటకం. కానీ రంగస్థలంపై ఆ నాటకం రాణించకపోవడంతో మరుగుపడిపోయింది.
అలాగే విజయనగర రాజ్యంలో పలుమార్లు నాటక ప్రదర్శనలు కోట లోపల జరిగినట్లు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఇవి కూడా సంస్కృత నాటకాలే. ఇలాంటి ప్రదర్శనలప్పుడు స్త్రీ పాత్రధారులను లోబరుచుకొని, వారి స్థానంలో శత్రు సేనలు కోటలోకి ప్రవేశించేవని, అందుకే అటువంటి ప్రదర్శనలను తర్వాత నిషేధించారని తెలుగు వారి జానపద కళారూపాలు అనే గ్రంథంలో ఉంది.
అలాగే విజయనగర రాజుల కాలంలోనే హరిహరరాయలు కుమారుడైన విరుపాక్ష రాయలు నారాయణ విలాసం, ఉన్మత్తరాఘవం అనే రెండు నాటకాలు రచించాడు. కానీ వాటినికూడా ఆయన తెలుగులో రాయలేదు. సంస్కృతములోనే రాశాడు. ఆ రోజులలో తెలుగులో సరైన నాటక రచనలు రాని మాట వాస్తవం. కానీ ఎక్కడో పల్లెలలో పాట నాటకాలుగా పేరొందిన యక్షగానాల గురించి ఎవరో శ్రీ కృష్ణదేవరాయల వారి అన్న వీరనరసింహరాయలు చెవిని వేస్తే, ఆయన స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ నాటకాలను చూసి వచ్చేవారట.
క్రీ.శ, 1514 లో కర్నూలు జిల్లా చెరువు బెళగల్లు గ్రామంలో తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన చేగయ్య కుమారుడు నట్టువ నాగయ్యకు రాయలవారు భూమిని కూడా దానమిచ్చారట. 16వ శతాబ్దంలో యక్షగాన నాటకాలకు తంజావూరు రఘునాథనాయకుడి ఆస్ధానంలో దక్కిన గౌరవం అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఆ రోజులలో తంజావూరు మేలటూరు భాగవతులు కోసం వెంకటరామ శాస్త్రి అనే ఆయన అనేక వీధి నాటకాలను రచించి ఇచ్చేవారట. అవి అన్ని ఆయన తెలుగులోనే రాసేవారు.
మేలటూరు భాగవతులు తర్వాత, తెలుగు నేలపై పల్లె నాటకాలను ప్రదర్శించడంలో కొఱవంజి నాటకకర్తలు సఫలమయ్యారు. సంస్కృత నాటకాల్లో విదూషకుడి పాత్ర మాదిరిగానే, తెలుగు యక్షగానాల్లోని కొరవంజి పాత్ర నాటకాన్ని మొత్తం తన భుజంపై వేసుకొని నడిపిస్తుంది. ఒకరకంగా ఎరుకలసానిని ఈ కొరవంజి పాత్ర పోలి ఉంటుంది.
అయితే పలువురు పరిశోధకులు ఇప్పటికీ యక్షగానాలు, వీధినాటకాలు అనేవి అసలు నాటక సంప్రదాయానికి చెందినవే కాదని వాదిస్తుంటారు. కాకపోతే ఒకప్పుడు పల్లె కవులకు మాత్రమే దగ్గరైన యక్షగానాలను ఆ తర్వాత అనేక పద్య కవులు కూడా రాసారు. కోటల్లో ప్రదర్శించారు. 1624 సంవత్సర ప్రాంతంలో కోకుల పాటి కూర్మనాథ కవి మృత్యుంజయ విలాసమనే యక్షగానాన్ని వ్రాశాడు. అది అతి ప్రౌఢంగా వుందని విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత చెంచు నాటకాలు కూడా పల్లె ప్రాంత ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. చాలా నాటక సమాజాలు కూడా పుట్టాయి. తాయికొండ కళాకారులు, కూచిపూడి భాగవతులు బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు.
ఆ తర్వాత తెలుగు నాటకానికి పునర్వైభవం 18, 19 శతాబ్దాలలోనే వచ్చిందని చెప్పుకోవాలి. కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి మొదలైన వారు ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రథములు.
కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రథములు. వడ్డాది సుబ్బరాయుడు లాంటి గొప్ప వ్యక్తులు పద్య నాటకానికి సైతం ప్రాణం పోశారు. 1887లో ప్రకటితమైన గురజాడ అప్పారావుగారి "కన్యాశుల్కం" వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం.కాగా 1894 ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసినవారు కోలాచలం శ్రీనివాసరావుగారు. వీరు అధికంగా చారిత్రక నాటకాలు రచించడం చేత "చారిత్రక నాటక పితామహుడు"గా పేరొందారు
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి