1, మార్చి 2025, శనివారం

*"ద" కార త్రయము

 *"ద" కార త్రయము*


సభ్యులకు నమస్కారములు.


మానవులు ఎల్లప్పుడూ   *"ద"* కార త్రయమును దృష్టిలో పెట్టుకొని జీవించాలంటారు పెద్దలు.


మొదటి *ద* దేహ భక్తిని సూచిస్తుంది. రెండవ *ద* దైవ భక్తికి సంకేతము. మూడవ *ద* దేశ భక్తికి ప్రతీక.


మొదటిది *దేహ భక్తి*. శరీరారోగ్యము పట్ల నిరంతర శ్రద్ధ వహించడము. ఏ ధర్మ కార్యము నిర్వహించాలన్నా, మొదట శరీరము స్వస్తతగా ఉండాలి. ఆరోగ్యవంతమైన శరీరములో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. జపానికైనా, తపానికైనా, ప్రాణాయామము, యోగ వ్యాయామము, వ్రతం, ఉద్యోగం ఏది చేయాలన్నా ముందు దేహం ఆరోగ్యంగా, పరిశుద్ధంగా కూడా ఉండాలి.

*శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం*  మహాకవి కాళిదాసు ఉవాచ. చతుర్విధ పురుషార్ధాలలో మొదటిది *ధర్మం*. ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఈ శరీరమే సాధనము.


రెండవ  *"ద'* దైవ భక్తికి నిదర్శనము. శ్రవణము కన్న బోధన గొప్పది. భోధన కన్న సాధన గొప్పది. ఆ సాధనకు కావల్సింది నిశ్చలమైన, నిర్మలమైన మనస్సు. *సర్వం భగవత్ స్వరూపమే* అన్న విశ్వాసాన్ని కల్గి ఉండడమే భక్తి యొక్క ప్రథమ లక్షణము. భక్తి అంటే పువ్వులతో పూజ చేసి ప్రసాదములు పంచుకోవడమే గాక భగవంతుని ఉనికిని అనుభవ సిద్దము చేసుకుని, సర్వాంతర్యామిని  ఎన్నడూ, ఎప్పుడు మరువక, ఎల్లప్పుడూ పరమాత్మకు సాధనా మాత్రులమై, అతని ఆజ్ఞానుసారము నడుచుకోవడము. ఆలా చేయడము వలన భగవంతుని గూర్చిన విస్మృతి కలుగదు. మనకు భగవంతుని అండ, భగవత్ పక్షమునకు చెందినవారమనే మనోధైర్యం మనను ముందుకు నడిపిస్తుంది. *భగవంతుని నిదించే వారిపట్ల ఉపేక్ష కూడదు*.


మూడవ *"ద"* దేశ భక్తికి ఆనవాలు. విజ్ఞులైన సభ్యులకు దేశ భక్తి గురించి అతిగా చెప్పడము దుస్సాహసమే అవుతుంది .

దేశ, కాల, సామాజిక, సాంస్కృతిక అంశాలను నిరంతరము గమనిస్తూ, అప్రమత్తంగా ఉండడమే దేశ భక్తిగా పరిగణిద్దాము.


సూక్ష్మంగా చెప్పుకోవాలంటే, మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే పరాయి పీడన తొలగించుటకు, మన పూర్వీకులు చేసిన గొప్ప త్యాగాలే కారణము. ధన, మాన, ప్రాణ హానిని గూడా లెక్క చేయక  వారు చేసిన  పోరాట ఫలితమే *ఈ స్వాతంత్ర దినము సుదినము* మరియు స్వేచ్ఛాయుత జీవనమునకు నాంది.


*శ్లో! దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యోగో దృష్ట్యా నైవచ నైవచ*. ప్రత్యేకంగా అర్థం విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేని సులువైన శ్లోకం. *దేశ రక్షణకు మించిన ధర్మం, వ్రతం ఏవి లేవు*.


*స్వాతంత్రమనే ఈ సుదినమును మన భవిష్యత్ తరాలకు అందించాలంటే, మళ్ళీ జాతికి హాని కలిగే సూచనలు చూచాయగా కనిపిస్తున్నప్పుడే* ప్రజలందరూ

 (మనము గూడా) అప్రమత్తులై, ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడము  ప్రథమ కర్తవ్యము. 


*ఎప్పుడో, ఎక్కడో జరుగుచున్న  దురాక్రమణ, దుష్టుల దౌర్జన్యము మనకెందుకులే అన్న ఉదాసీన భావన విపరీత పరిణామాలకు దారి తీస్తుంది*.


దేశ క్షేమము, జాతి క్షేమము గురించి బహిరంగంగా మాట్లాడుకోవాలన్నా, చర్చించు కోవాలన్నా బిడియపడే, భయపడే *లౌకిక* మనస్తత్వము *దేశ భక్తి లక్షణాలకు విరుద్ధము*.


"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" సాధారణంగా ఈ వాక్యమును మాత్రమే వాడుతూ ఉంటాము.  పూర్తి శ్లోకము 

*అపి స్వర్ణమయీ లంకా, నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి*. ప్రత్యేకంగా వివరణ అవసరము లేని శ్లోకము.


*స్వర్గము కంటే గొప్పదైన మన మాతృ దేశము గురించిన ఉపద్రవ నివారణ చర్యలు విడనాడక పోవడమే నిజమైన దేశ భక్తికి సంకేతము*.


 అవుతే హిందూ పద నిర్వచనము ఒక సారి పరిశీలిద్దాము *హింసాం దూషయతి ఖండ యతి ఇతి హిందుః* అర్థము:- ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో, అట్టి చర్యలను ఖండించే వాడే హిందువు. కాబట్టి హింస మరియు పాపపు పనులకు తలపడే వారిని అడ్డగిద్దాము. దేశరక్షణ, దేశోద్ధారణ బాధ్యతలను అత్యుత్సాహముతో స్వీకరిద్దాము.  అంతే గాక అన్నివర్గాల సాధు జనులకు రక్షణ కల్పించుట గూడా మానవ ధర్మమే. మహా కవి గురజాడ అప్పారావు గారి గేయములోని ప్రారంభ చరణాలు.. *దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్*.ఆలాగే బంకించంద్ర ఛటర్జీ విరచిత సంస్కృత గీతము..

 *వందే మాతరమును*, 

మనము ఎల్లప్పుడూ మననము చేసుకుందాము. గురు దేవులు రవీంద్ర నాథ్ టాగూరు మనకందించిన *జనగణమన* జాతీయ వాదులందరికి శ్వాస లాంటిది.


ఏతా వాతా నేను సభ్యులకు విన్నవించాలనుకుంటున్న విషయము.. *దేశ భక్తి ఒక భిన్న అంశము కాదు. మన దైనందిన జీవితములో ఒక ప్రధాన అంశము. దేశ కాల పరిస్థితులు బాగుంటేనే దేశ ప్రజలు (మనము వేరు కాదు) గూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు*.


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: