*శ్రీవిశ్వావసు నామ సంవత్సరం విశేషాలు*
నూతన తెలుగు సంవత్సరం శ్రీవిశ్వావసు నామ సంవత్సరం నేడు మార్చి 30 ఆదివారం ప్రారంభ మైంది.
ఇది కలియుగం 5,127 సంవత్సరం, 28 మహాయుగం, ఏడవ మన్వతరం , బ్రహ్మ 51 సంవత్సరం లోని మొదటి రోజు. ఇప్పటికి ఈ సృష్టి జరిగి 216 కోట్ల సంవత్సరాల పైనే అయ్యింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ సంవత్సరాల పేర్లు 60 సంవత్సరాల కాల చక్రాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ వస్తాయి.
బ్రహ్మకల్పం ప్రారంభ మైన మొదటి ఉగాది ప్రభవ.
*హిందువుల సంవత్సరాలు ఎలా పుట్టాయి?*
*పేర్ల వెనుక వున్న పురాణ కథనం*
తెలుగు సంవత్సరాలను గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మ మానసపుత్రుడు నారదమహాముని ఓ సారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే.హ, అప్పుడు ఆ 60 మందీ యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువును ప్రార్థించగా, విష్ణువు కరుణించి, నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరశమిచ్చాడట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
*ఆధ్యాత్మిక సంబంధ కథనం*
మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టు తిరిగితే 360 డిగ్రీలు పూర్తి అవుతుంది. కేంద్రం నుంచి గమనిస్తే ముందు 180 డిగ్రీలు, వెనక 180 డిగ్రీలూ అన్నమాట. వెనుక వున్న గతం 180 డిగ్రీలూ గతం. నిలబడిన రేఖ వర్తమానం. ముందున్నవి భవిష్య సూచకాలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల కంటే కలియుగంలో మానవుల ఆయుర్దాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిం దని గుర్తు చేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తి చేసుకొమ్మని, షష్టిపూర్తి ఉత్సవం చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మికచింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నా రన్నమాట.
2025 విశ్వావసు నామ సంవత్సరం. హిందూ సంవత్సరాలలో ఇది 39 ది.
*విశ్వావసు ఎవరు?*
విశ్వావసు 6000 గంధర్వులలో ఒక డు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు, సుందరులు. అప్సరసలతో సహజీవనం చేస్తూ ఉంటారు. విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మ దేవుని నుంచి అమరత్వం సిద్ధింప చేసుకున్నాడు. ఆ తరువాత అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి, ఇంద్రుని క్రోధానికి గురి యైనాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసుని చేతులను, తొడలను శరీరంలో కోసివేశాడు. దానితో విశ్వాసుడు చేతులు, తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వాసుడు ఇంద్రుణ్ని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి, అతనికి రెండు పొడవైన చేతులతో పాటు, పొట్టలోనే భుజించేందుకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు. అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెడుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరు డనే మహాముని తటస్థపడి, ” నీకీ రూపమే శాశ్వతంగా ఉండిపోవు గాక !” అని శపించాడు. అప్పుడు కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని, శాప విముక్తి ఎలాగని అడిగాడు. “ఎప్పుడు రాముడు అడవికి వచ్చి, నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది” అని ముని చెప్పి వెళ్లిపోయాడు.
*విశ్వావసుడి శాప విమోచనం*
శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెదకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా, విచిత్రరూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదు రయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్లు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రా లున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. దీనికే “కబంధహస్తం” అనే నానుడి ఉన్నది. భయకర మైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనను గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకు అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా, రాముడి అతని కోరిక మేరకు అలానే చేస్తాడు. కబంధుడు తన పూర్వగంధర్వ రూపాన్ని సంతరించు కుంటాడు. ఆ విశ్వావసు నామమే హిందూ సంవత్సరాలలో ఒకటి.
శాస్త్రాల ప్రకారం, ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అని అర్థం. అంటే విశ్వం లోని జీవకోటి రాశుల ఆయుష్షుకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం, ‘యుగం’ అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం (ఏడాది) కాగా, ఈ యుగానికి ఆది ఉగాది అవుతుం దని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఉగాది నుంచే వసంత బుుతువు ప్రారంభ మవుతుంది.
పురాణాల ప్రకారం, చైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభ మైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ‘‘ఉగాది’’ఆచరణ లోకి వచ్చిం దని చాలా మంది నమ్ముతారు. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించి నట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది పండుగ వేళ శిశిర బుుతువుకు వీడ్కోలు పలికి, వసంత బుుతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభ మవుతుంది. కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగు వారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభ మవుతుంది. అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు.
ఈ పవిత్ర మైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.
ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో ఉప్పు, మిరియాల పొడి, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, బెల్లం తప్పనిసరిగా వాడతారు. అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు.
🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి