*తిరుమల సర్వస్వం 193*
**శ్రీవారి ఆభరణాలు -5*
*అన్యమత భక్తుల కానుకలు*
శ్రీవారి పరమభక్తులైన అన్యమతస్థులు సమర్పించుకున్న మరి కొన్ని ముఖ్యమైన నగలు ఉన్నాయి.
1. గుంటూరుకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే మహమ్మదీయ భక్తుడు సమర్పించిన, శ్రీవారి నిత్యపూజకు వాడే *108 బంగారు పుష్పాలు.*
2 2. ప్రతి బుధవారం జరిగే - *అష్టదళ పాద పద్మారాధన* లో స్వామి వారి అర్చనకు ఉపయోగించే, సయ్యద్ మీరా అనే మరో మహమ్మదీయ భక్తుడు సమర్పించిన 108 బంగారు పద్మాలు.
3. ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్, శ్రీవారి భక్తుడు అయిన థామస్ మన్రో అనే క్రైస్తవ మతస్తుడు సమర్పించుకున్న *'మన్రో గంగాళం'* గా ప్రసిద్ధి చెందిన, *బంగారు గంగాళం.*
నానాటికీ, శ్రీవారి పట్ల భక్తి-విశ్వాసాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో, తదనుగుణంగా కానుకలు కూడా వెల్లవెత్తుతున్నాయి. దాంతో శ్రీవారికి ఒకే రకమైన, 2, 3 లేదా అంతకంటే ఎక్కువ సెట్లున్న ఆభరణాలు ఎన్నో ఉన్నాయి.
ఎనిమిది దశాబ్దాల క్రితం ఆలయ యాజమాన్యం తి.తి.దే. ఆధ్వర్యంలోకి వచ్చినప్పటి నుండి, వారు కూడా తరచుగా శ్రీవారికి అమూల్యమైన ఆభరణాలు చేయిస్తూనే ఉన్నారు. వారు తయారు చేయించిన ఆభూషణాల జాబితాలో ముఖ్యమైనవి:
1. 1940 సంవత్సరంలో వజ్రకిరీటం.
2. 1954వ సం. లో వజ్రాల హారం.
3. 1972వ సంవత్సరంలో వజ్రాల శంఖు చక్రాలు.
4. 1974 లో వజ్రఖచిత కటిహస్తం.
5. 1986 లో వజ్రాల కిరీటం.
ఆనందనిలయ విమానం స్వర్ణమయమని మనకు తెలిసిందే! దాదాపుగా వెయ్యేళ్ళక్రితం నుండే, ఆనందనిలయ గోపురానికి స్వర్ణకవచాన్ని తరచూ మార్చుతూ, దానికి మరిన్ని సొబగులు దిద్దుతున్నారు. అంతే కాకుండా, ఆలయంలోని అనేక ద్వారబంధాలు, తలుపులు, తిరుమామణి మంటపం పైకప్పు, ధ్వజస్తంభం ఇవన్నీ మేలిమి బంగారం పూతపూయబడి, ఎల్లవేళలా స్వర్ణకాంతులీనుతుంటాయి. శ్రీవారికి కనకమహాలక్ష్మితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. చివరికి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దబడిన స్వర్ణరథం కూడా శ్రీవారి స్వంతమే!
శ్రీవారికి స్వర్ణాభరణాలే కాకుండా, వందలకొద్దీ వెండి ఆభరణాలు, బంగారం తాపడం చేయబడ్డ ఇతర లోహపాత్రలు, వెండి వాహనాలు, ఛత్రచామరాలు, ఉయ్యాలలు, శఠగోపురాలు లాంటివెన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు అంతే లేదు. శ్రీనివాసుని కలియుగశోభ, వారి వైకుంఠవైభవానికేమాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఇరులోకాల లోనూ, సర్వకాల సర్వావస్థల యందు శ్రీమహాలక్ష్మి వారినంటిపెట్టుకొనే ఉండటం వల్లనే ఆ లక్ష్మీపతి కోట్లకు పడగలెత్తుతూ ప్రపంచంలోనే సంపన్నమైన దేవునిగా విలసిల్లుతూ, భక్తుల కొంగుబంగారమై ఒప్పారుతున్నాడు.
*ఉత్సవమూర్తుల ఆభరణాలు*
శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఉన్న లెక్కలేనన్ని ఆభరణాలు ఒక ఎత్తయితే, ఉత్సవమూర్తులను అలంకరించే ఆభరణాలు మరో ఎత్తు.
మలయప్పస్వామి వారికి కూడా మూలవిరాట్‌కు ఏమాత్రం తీసిపోనన్ని ఆభరణాలు ఉన్నాయి. ధ్రువబేరం ఆభరణాలు చూడాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, తప్పనిసరిగా ఆనందనిలయం లోనికి ప్రవేశించి, శ్రీవారిని దర్శించుకోవలసిందే! అయితే మలయప్పస్వామి వారు మాత్రం తరచుగా మాడవీధుల్లో విహరిస్తూ, భక్తుల చెంతకే వచ్చి వారి ఆభరణ విశేషాలతో భక్తులకు కనువిందు చేస్తారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి