*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*
*332 వ రోజు*
*భూరిశ్రవసుడి కథ*
భూరిశ్రవసుడి మరణం గురించి వన్న ధృతరాష్ట్రుడు " సంజయా! మహా బలవంతుడైన సాత్యకి భూరిశ్రవసుడి చేత ఎందుకు అవమానాల పాలైయ్యాడు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! చంద్ర వంశపు రాజైన యయాతి మహారాజు వలన వచ్చిందే యాదవ కులము. యాదవ కులమున పుట్టి దేవమీఢుని కుమారుడు శూరుడు అతడి కొడుకు వసుదేవుడు. దేవకుడనే రాజు తన కుమార్తె దేవకికి స్వయం వరం ప్రకటించగానే యాదవకుల రాజైన శిని దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం జరపాలని స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి బలవంతంగా తీసుకు పోయాడు. అప్పుడు శినిని ఎవరూ ఎదిరించి నిలువ లేకపోగా సోమదత్తుడు మాత్రం ఎదుర్కొని యుద్ధం చేసాడు. ఇరువురు ఘోరంగా పోరాడిన పిదప శిని సోమదత్తుని ఓడించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చి చంపక వదిలాడు. ఆ అవమాన భారం భరించ లేక సోమదత్తుడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళి శివుని గురించి ఘోర తపమాచరించాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు అప్పటికి శిని, అతడి కుమారుడు చనిపోయారు కనుక శిని మనుమడైన సాత్యకిని ఓడించే కుమారుడిని ప్రసాదించమని అడుగగా శివుడు అందుకు అంగీకరించాడు. శివుని వరప్రభావంతో సోమదత్తుడికి భూరిశ్రవసుడు పుట్టాడు. కనుక భూరిశ్రవసుడి చేతిలో సాత్యకి అవమానం పొందాడు " అని చెప్పాడు.*
*సాత్యకి భీమార్జునులు కర్ణుని ఎదుర్కొనుట*
అలా సాత్యకి చేతిలో భూరిశ్రవసుడు మరణించగానే అర్జునుడు తన రధమును సైంధవుడు ఉన్న వైపుకు పోనిచ్చాడు. సుయోధనుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలైన వారు అర్జునుడిని ఎదుర్కొన్నారు. సాత్యకి కర్ణుని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు పాఛజన్యం పూరించగానే ముందు రోజు కృష్ణుడు చెప్పినట్లే దారుకుడు రథం సిద్ధం చేసి తీసుకు వచ్చి వారి ముందు నిలిపాడు. ఆ రధము గరుఢ ధ్వజముతో, శైల్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము, అను హయములు కట్టి ఉన్నాయి. శ్రీకృష్ణుడు సాత్యకితో " తమ్ముడా ! ఆ రథము ఎక్కి కర్ణునితో యుద్ధము చేయి " అన్నాడు. సాత్యకి ఆ రధమును అధిరోహించి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇది ఆశ్చర్యంగా చూస్తున్న అర్జునుడి చూసి శ్రీకృష్ణుడు " ఆర్జునా! తరువాత ఆశ్చర్యపడవచ్చు ముందు సైంధవుడిని కనిపెట్టు " అన్నాడు.అర్జునుడు సాత్యకి ఎలా అని అడుగగా కృష్ణుడు " సాత్యకి కర్ణులు ఒకరికి ఒకరు తీసిపోరు. సాత్యకిని నా చక్రరక్షకులు రక్షిస్తారు. వారి సంగతి విడిచి సైంధవుని వెదుకుట మన కర్తవ్యం " అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో సాత్యకి కర్ణుని శరీరం తూట్లు పడేలా కొట్టి, రధము విరుగ కొట్టి కేతమును తుంచు, రధాశ్వములను చంపి, సారధిని చంపాడు. అది శ్రీకృష్ణుని రధము కనుక దారుకుడు దానిలో సమృద్ధిగా ఆయుధములు పెట్టాడు కనుక సాత్యకి కర్ణుని అతడి సేనను తరిమి తరిమి కొట్టాడు. నీ కుమారులు వేరొక రధమును తీసుకు వచ్చి కర్ణుడి ముందు నిలిపారు. కర్ణుడు ఆ రధము ఎక్కి సాత్యకిని ఎదుర్కొన్నాడు. కర్ణుడి చేత అవమానం పొందిన భీముడు తల వంచుకుని అర్జునుడి వద్దకు వచ్చి కర్ణుడు అన్న మాటలన్నీ చెప్పి " తమ్ముడూ ! నేను వెంటనే కర్ణుడికి తగిన గుణపాఠం చెప్పాలి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! నిన్ను అనడం నన్ను అన్నట్లే కనుక నేను వెంటనే వెళ్ళి కర్ణుని మదం అణుస్తాను " అన్నాడు. శ్రీకృష్ణుడు కర్ణుడి ఎదుట రథం నిలపగానే అర్జునుడు " ఏరా కర్ణా! మా అన్నయ్య భీమసేనుడిని తూలనాడతావా! భీమసేనుడు తరిమినప్పుడు సిగ్గు లేకుండా వెనక్కు పరిగెత్తావే అప్పుడు నిన్ను ఎవరైనా తిట్టారా ! యుద్ధంలో ఒక సారి ఓడుట ఒక సారి గెలుచుట సహజము కాదా ! ఒక్క సారి భీమసేనుడి మీద పైచేయి కాగానే ఇంత గర్వమా ! ఇప్పుడు సాత్యకి చేతిలో నీవు ఓడి పోలేదా ! ఎంతటి విశారదులకైనా గెలుపోటములు సహజం నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మా చేతులో ఎన్ని సార్లు ఓడిపోయావు నేను లేనప్పుడు నా కుమారుని అభిమన్యుని అందరు కలసి చంపారు. ఇప్పుడు నేను నీ కుమారుని వృషసేనుడిని నీ కళ్ళ ముందే చంపుతాను నిన్నే కాదు నిన్న నా కుమారుడిని అధర్మంగా చంపిన అందరినీ ఏం చేస్తానో చూస్తూ ఉండండి " అంటూ కర్ణుడిని తరిమాడు. అప్పుడు కౌరవసేన అర్జునుడిని ఎదుర్కొంది. పోరు ఘోరం అయింది. పొద్దు వాలసాగింది.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి