🙏శ్రీమద్భగవద్గీత🙏
🙏శ్రీమద్భగవద్గీత🙏
4వ అధ్యాయము
జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।
యదా-యదా — ఎప్పుడెప్పుడైతే; హి — నిజముగా; ధర్మస్య — ధర్మము యొక్క ; గ్లానిః — క్షీణత; భవతి — సంభవించునో; భారత — అర్జునా, భరత వంశీయుడా; అభ్యుత్థానమ్ — పెరుగుట; అధర్మస్య — అధర్మము యొక్క; తదా — అప్పుడు; ఆత్మానం — నన్ను; సృజామి — సృజింతును (ప్రకటించుకుందును); అహం — నేను.
భావము 4.7: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.
వివరణ:
ధర్మము అంటే నిజానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి పురోగతికి సహకరించే, విహిత కర్మలే; దీనికి విరుద్ధమే అధర్మం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్త, నిర్వహణాధికారి అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకొని, దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. ఈ అవతారం ‘Avatar’ అన్న పదం సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి తీసుకోబడింది, ఇప్పటికాలంలో దీనిని సాధారణంగా కంప్యూటర్ లో జనుల చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు. కానీ, ఈ భాష్యం లో ఈ పదాన్ని, దాని యొక్క నిజమైన అర్థం లో, అంటే భగవంతుని అవతారమును సూచించటానికే వాడుదాము. శ్రీమద్భాగవతం లో ఇటువంటి ఇరవై నాలుగు అవతారముల గురించి చెప్పబడింది. కానీ, భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి.
జన్మకర్మాభిధానాని సంతి మేఽoగ సహస్రశః
న శక్యంతే ఽనుసంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి హి (భాగవతం 10.51.36)
🙏శ్రీమద్భగవద్గీత🙏
4వ అధ్యాయము
జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।
పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.
భావము 4.8: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.
వివరణ:
పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని దగ్గరగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.
సాధు జనులను రక్షించుట కొరకు. పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.
దుష్టులను సంహరించుట కొరకు. భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం ఏమున్నది?
ధర్మాన్ని స్థాపించుట కొరకు. అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. దేవుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తనే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.
మరయితే, ఈ శ్లోకం లో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.
జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరం. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది మరియు ఎంతో మధురమైనది.
ఈ విధంగా, 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీ లో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుశ్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమనోహరంగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. రామ చంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:
రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ
"తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్దరించుకున్నారు." కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :
ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తి లో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.
దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించి రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దేవతలు కాబట్టి మరెవ్వరి వలన సంహరింపబడలేరు. కాబట్టి, దేవుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే కదా.
ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకం లో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.
ఇది, ఈ శ్లోకం యొక్క అసలైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.
"అనాది కాలం నుండి ఉన్న అనంతమైన దేవుని అవతారములను ఎవరూ గణించలేరు.". క్రింద చెప్పబడినట్టు, ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి:
1. ఆవేశావతారములు – ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టటం; మరియు ఆ జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం. నారద ముని ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ. బుద్ధుడు కూడా ఒక ఆవేశావతార ఉదాహరణ.
2. ప్రాభవావతారములు – ఇవి భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులను ప్రదర్శించిన అవతారములు. ప్రాభవావతారములు కూడా రెండు రకాలు.
a) దేవుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమయి, తన కార్యాన్ని పూర్తిచేసి, వెళ్లిపోయేవి. హంసావతారము దీనికి ఒక ఉదాహరణ, దీనిలో కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.
b) భూలోకంలో చాల ఏళ్లు ఉండే అవతారాలు. పద్దెనిమిది పురాణాలను మరియు మహాభారతాన్ని వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతార రూపమే.
3. వైభవావతారములు – తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము లు వైభావావతారముల ఉదాహరణలు.
4. పరావస్థావతారములు – భగవంతుడు తన సర్వ మహోన్నత శక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి. శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, నృసింహావతారము - పరావస్థావతారముల ఉదాహరణలు.
ఈ వర్గీకరణ వల్ల, ఏదో ఒక అవతారం మరో అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు. తనే ఒక అవతారమైన వేద వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు: సర్వే పూర్ణాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరమాత్మనః (పద్మ పురాణం), “భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి. అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితైనవి.” కాబట్టి మనము ఒక అవతారము ఎక్కువది ఇంకో అవతారము తక్కువది అని తేడా చూపకూడదు. ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి. కాబట్టి పై వర్గీకరణ చేయబడింది.
5వ అధ్యాయము
కర్మ సన్న్యాస యోగము
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।
యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో ఏకమై; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధి తో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మ ను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.
భావము 5.7: పరిశుద్ధ మైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతి ప్రాణిలో ఆత్మల పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో లో చిక్కుకోరు.
వివరణ: వైదిక వాఙ్మయం లో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్ధాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికి ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్దాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.
ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధి తో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు; అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణ లోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్దతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి