🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 111*
*****
*శ్లో:- వనే రణే శత్రు జలాగ్ని మధ్యే ౹*
*మహార్ణవే పర్వత మస్తకే వా ౹*
*సుప్తం ప్రమత్తం విషం స్థితం వా ౹*
*రక్షన్తి పుణ్యాని పురా కృతాని ౹౹*
*****
*భా:- ధర్మో రక్షతి రక్షితః - అని ఆర్యోక్తి. సత్యమున్నచోట ధర్మము, ధర్మమున్నచోట అర్థము, ఇవన్నీ ఉన్నచోట మోక్షప్రాప్తికి మార్గం సుగమంగా ఉంటుంది. మన పూర్వజన్మ కృతమైన పుణ్యం నిల్వలో ఉన్నట్లయితే మనకెలాంటి ఆపదలు రావు. 1."వనే":- కీకారణ్యంలో చిక్కుకుపోయినా; 2."రణే":- వ్యూహాత్మకమైన రణరంగంలో బందీ అయినా; 3."శత్రు":- శత్రువుల దాడిలో బంధింపబడినా; 4."జల":- ప్రమాదవశాత్తు జల దిగ్బంధంలో కొట్టుకుపోతున్నా, 5."అగ్నిమధ్యే":- ఆకస్మికంగా చుట్టూరా అగ్నికీలలు అలముకొన్నా; 6."మహార్ణవే":- గొప్పదైన సముద్రపు అలలు వేగంగా వచ్చి లాక్కొని పోతున్నా; 7."పర్వతమస్తకే":- కొండ కొమ్మున కేగి, దారి తెన్నెరుగక దిక్కుతోచని పరిస్థితి ఎదురైనా; 8."సుప్తం":- ఒడలు మరచి గాఢ నిద్రలో మునిగినా; 9."ప్రమత్తం":- పూర్తి జాగ్రత్తలో ఉన్మాద స్థితిలో ఉన్నా; 10."విషమస్థితి":- ప్రమాదవశాత్తు అనూహ్యమైన "విపత్కరస్థితుల నెదు రీదుతున్నా-- మనము పూర్వజన్మలో చేసి, నిల్వలో ఉంచుకున్న పుణ్యఫలరాశి మనలను సలక్షణంగా నీడలా వెన్నంటి, ఆ గండం నుండి అమాంతం పట్టుకొని ప్రాణాలతో గట్టెక్కిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. నిన్ను నీవే నమ్మ లేని చిత్రాతి చిత్రమైన స్థితి తారసపడుతుంది. అందుకనే జీవించిన నాలుగు రోజులు సత్య సమ్మతమైన ధర్మాన్ని చేస్తూ, ధర్మబద్ధమైన అర్థాన్ని గడిస్తూ, యోగ్యత, పాత్రత లతో కూడిన దాన ధర్మాలు నిర్వహించాలని, అవే పురాకృత పుణ్యరూపములో రక్షిస్తాయని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి