☘️🍁☘️🍁☘️
మనం ఇతరుల ఇష్టాల్ని చూసి కొన్నిసార్లు నవ్వుకుంటాం.
ఇతరుల కోర్కెల్ని చూసి అవి ఎంత అల్పమయినవి అనుకుంటాం.
మన కోరికలు గొప్పవని, మన లక్ష్యాలు సాటి లేనివని విర్రవీగుతాం.
ఉన్నత లక్ష్యాలని గమ్యాలని ఏర్పరచుకోవాలనుకుంటాం.
పదేళ్ళలో ఒకడు పదికోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు.
ఆ పూట గడిస్తే చాలనుకునేవాడు అట్లాంటి ఆలోచన వైపే రాడు.
పదికోట్ల లక్ష్యం పెట్టుకున్నవాడు వందకోట్ల లక్ష్యం పెట్టుకున్నవాణ్ణి చూసి ఈర్ష్యపడతాడు.
ఇతరుల్తో పోల్చుకోవడంలో ఎంత కోల్పోతామో ఇతరుల్ని తక్కువ చెయ్యడంలోనూ అంతే కోల్పోతాము.
ఎవరూ ఆసంగతి గుర్తించరు.
జీవిత గమ్యం అందం, ఆనందం, ప్రశాంతం అని చెబితే పిచ్చివాడనుకుంటారు.
ఒక సముద్ర తీరంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నారు. పరిగెడుతున్నారు.
కిలకిలా నవ్వుతున్నారు, గంతులేశారు.
కాసేపటికి ఇసుకలో కూచున్నారు.
మెల్లగా ఇసుకతో ఆటలాడడం ప్రారంభించారు.
ఇసుకతో కోటను తయారు చేశారు.
ఎవరికి వాళ్ళు సొంత కోటను నిర్మించుకున్నారు.
ఆ కోటలకు ద్వారాలు, బురుజులు తయారు చేశారు.
అవి చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి.
అంతలో ఒకడు “నాదే మంచికోట” అన్నాడు.
రెండో కుర్రాడు “నాది బ్రహ్మాండమయిన కోట!” అన్నాడు.
దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది.
ఒకరిమీద ఒకరికి కోపం వచ్చింది.
జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి పోట్లాట వచ్చింది.
దాంతో మొదటి కుర్రాడు రెండో కుర్రాడి ఇసుక కోటను ఒక్క తన్ను తన్నాడు అది ఒక్కసారిగా కూలిపోయింది.
దాంతో రెండో కుర్రాడికి ఏడుపు వచ్చింది.
మొదటి కుర్రాడి కోట మీద కాలు పెట్టి పచ్చడి పచ్చడి చేశాడు.
రెండు కోటలు ఇసుకలో కలిసిపోయాయి.
తప్పు నీదంటే నీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
చివరికి ఎవరిది అన్యాయమో చెప్పమని రాజు గారి దగ్గరికి వచ్చారు.
ఆ రాజుకు పిల్లలంటే ఇష్టం. అందుకని సమస్యలు వచ్చే పిల్లలు స్వేచ్ఛగా తనవద్దకు రావచ్చని ఆయన చట్టం చేశాడు.
ఆ పిల్లలిద్దరూ రాజు దగ్గరికి వచ్చారు.
రాజు వాళ్ళిద్దరూ తినడానికి తినుబండారాలు తెప్పించాడు.
పిల్లలు తింటూ ఉంటే సమస్య చెప్పమని అడిగాడు.
కోట కూల్చేశాడని ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
రాజుకు నవ్వు వచ్చింది.
ఇసుక కోటలు కూలినందుకు వీళ్ళు ఇంత గొడవపడుతున్నారా!
అని రాజు బిగ్గరగా నవ్వాడు.
దగ్గరే ఉన్న వివేక వంతుడయిన ఒక మంత్రి
“రాజుగారూ! ఈ పిల్లలిద్దరూ ఇసుక కోటల్ని కూల్చేసుకుని గొడవపడుతున్నారని మీరు నవ్వారు.
కానీ ఇక్కడ నవ్వాల్సిన దేముంది.
మీరు రాతి గోడల్ని అంటే రాతికోటల్ని పడగొట్టడానికి, ఆక్రమించడానికి నిద్ర లేకుండా నిరంతర యంత్రాంగంలో గడిపిన రోజులు మరచిపోయారా?
నిజానికి వాటికీ వీటికీ తేడా ఏమైనా ఉందా?
మీరే ఆలోచించండి”
అన్నాడు.
ఆ మాటల్తో రాజుకు కనువిప్పు కలిగింది.
అధికారం కోసం అల్ప స్థాయిలోనయినా, ఉన్నత స్థాయిలోనయినా ఘర్షణలు జరుగుతాయి కదా!
అని తెలుసుకున్నాడు.
🌀🌀🌀🌀🌀🌀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి