6, జనవరి 2021, బుధవారం

118-మంద్రగీత

 *🌷118-మంద్రగీత🌷*

🕉🌞🌎🌙🌟🚩


 *క్షేత్రము-క్షేత్రజ్ఞుడు*


*15. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము వివరింపబడినవి. జ్ఞేయము లేక తెలియదగినది అను దానిని వివరింతును. దానిని జ్ఞానముగా పొందినవాడు అమృత స్వరూపుడగును. ఇచ్చట దానికది జ్ఞాన స్వరూపమై జీవికి జ్ఞేయముగా ఉండును. జీవి దానిని సమీపించిన కొలది అది జ్ఞానమగును. అప్పటికి జీవి కూడా జ్ఞానమగును.*



*ఆది అనగా ఎట్టిది? నిద్ర నుండి మేల్కాంచుట వంటిది. మెలుకువతో సర్వము దృశ్యమానమగును. దీనినే ఆది అందురు. ఇది చూచువానికి ఆది గాని, దర్శింపబడు తత్వమునకు కాదు. కనుక జ్ఞేయము ఆది లేనిది. దాని పరిమితి కూడా జ్ఞాత యొక్క పరిమితియే. కనుక, జ్ఞేయము పరము లేక పరిమితి లేనిది. ఇది కొలతలకు అతీతము కనుకను, ద్రష్ట కొలతలు కలవాడు కనుకను వాని కది జ్ఞేయముగా భాసించును. సృష్టి అంతయు ద్రష్టకు జ్ఞేయము. దానికది బ్రహ్మము. బ్రహ్మమనగా వ్యాపన శీలము. అదియే జ్ఞాతగా కూడ వ్యాపించినది గనుక బ్రహ్మమనబడును.*



*ద్రష్ట దృష్టిలో దానికి అస్తిత్వమున్నది. సొంతముగా దానికి అస్తిత్వము లేదు. ద్రష్టకు దృశ్యమంతయు ఉండుట, లేకుండుట అనువాని నడుమ ఉండును. నిద్ర నుండి మేల్కాంచినప్పటి నుండి మనకు సృష్టి యున్నది. మరల నిద్రించిన వెనుక మనకది లేదు. కనుక మేల్కాంచుట ఆది, నిద్రించుట అంతము. మేల్కాంచుట అస్తిత్వము. నిద్రించుట అసత్. అనగా లేకుండుట. ఈ స్థితులు జ్ఞాతకు గనుక జ్ఞేయమునకు ఉండవు. మనము నిద్రించునప్పుడు మన చుట్టునున్న ప్రపంచము న+అసత్=నాసత్ (లేకుండుట లేదు) అనుస్థితిలో ఉన్నది. ఈ సృష్టి మొత్తమునకు జ్ఞేయమగు పరబ్రహ్మము, అట్లే సత్ (అస్తిత్వం), అసత్ (అభావము), నాసత్ అను స్థితులకు అతీతముగా ఉన్నది, దీనిని జ్ఞేయము అందురు.*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: