6, జనవరి 2021, బుధవారం

దెబ్బకు దెబ్బ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*దెబ్బకు దెబ్బ*


(పర్షియన్ జానపద కథ}



అనగా అనగా బాగ్దాదు నగరంలో అబూసలీం, సుల్తాన్ అహ్మద్ అనే ఇద్దరు మిత్రులు ప్రక్కప్రక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. అబూకు దైవభక్తి ఎక్కువ. తనకు ఎలాంటి కష్టం వచ్చినా బిగ్గరగా నమాజు చేసి భగవంతుడికి మొరపెట్టుకునేవాడు. సుల్తాన్ అహ్మద్ కు తన మిత్రుని ఈ ప్రవర్తనని చూస్తే ఎగతాళిగా ఉండేది. ఎలాగైనా అబూనుంచి ఈ అలవాటును దూరం చెయ్యాలని అతను తగిన సమయంకోసం వేచి చూడసాగాడు.


ఒకసారి అబు ఎప్పటిమాదిరే బిగ్గరగా నమాజు చేసి, దేవునితో తన కష్టాలు మొరపెట్టుకున్నాడు- "సంపాదన తక్కువౌతున్నది, ఖర్చులు చూస్తే పెరిగిపోతున్నాయి- ఎలాగైనా కాపాడే భారం నీదే" అని. ప్రక్క ఇంట్లోంచి వింటున్న సుల్తాన్ అహ్మద్ కు ఇదే తగిన సమయం అనిపించింది. ఒక సంచీలో కొన్ని బంగారు నాణాలు వేసి, మూటగట్టి, వాటిని గబుక్కున నమాజు చేస్తున్న అబూసలీం ఒళ్ళో పడేట్లు గిరాటు వేశాడు.


కళ్ళు తెరిచి చూసిన అబూసలీం తన ఒళ్ళో పడ్డ సంచీని తెరిచి చూశాడు. బంగారు నాణాలు! ఇది ఎవరి తుంటరిపనో అబూకు వెంటనే అర్థం అయ్యింది. అయినా 'ఇది అల్లా తనకిచ్చిన కానుక' అనుకొని, అతను దాన్ని తీసుకొని సంతోషంగా ఇంట్లోకి పరుగుతీశాడు.


కొంచెం సేపు గడిచిందో‌లేదో, సుల్తాన్ అహ్మద్ ప్రత్యక్షం అయ్యాడు. అబుకు అతను ఎందుకొచ్చాడో అర్థం అయ్యింది. అయినా ఏమీ తెలీనట్లు, "ఈరోజు చమత్కారం ఒకటి జరిగింది సుల్తాన్, నేను అటు నమాజ్ చేసి లేచానో-లేదో, ఇటు అల్లా నా మొర విని, నాకు ఈ బంగారు నాణాల సంచీని ప్రదానం చేశాడు!" అన్నాడు సంచీని చూపిస్తూ.


"అది అల్లా ఇచ్చిన డబ్బు కాదు! నీ‌ పిచ్చి వదిలిద్దామని, నేనే వాటిని నీమీదికి విసిరాను" అన్నాడు సుల్తాన్ అహ్మద్, ఇకిలిస్తూ.


"అదెలా అవుతుంది? అల్లా నాకిచ్చిన డబ్బు నాదే అవుతుంది" అన్నాడు అబూసలీం, గడుసుగా. ఇది వేరేవైపుకు మళ్ళుతున్నదని అర్థమైంది సుల్తాన్ అహ్మద్ కు. "ఇదిగో, చెబుతున్నాను- అది అల్లా డబ్బు కాదు. నీదీ కాదు. అది నా డబ్బు. మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వకపోతే న్యాయం కోసం ఖాజీ దగ్గరికి పోవాల్సివస్తుంది- ఏమనుకుంటున్నావో, ఏమో!" అన్నాడు కోపంగా.


"నాకేం భయం? నా డబ్బు నాదే. దాన్నెవరూ నానుండి లాక్కోలేరు- ఖాజీ అయినా సరే" అన్నాడు అబూ మొండిగా.


"సరే, అయితే పద, ఖాజీ దగ్గరికి నడు!" అన్నాడు సుల్తాన్ అహ్మద్, చికాకుగా.


"వద్దామనే ఉంది, కానీ‌ నాకు మంచి బట్టలే లేవాయె, బయటికెలా వచ్చేది?" అన్నాడు అబూ.


సుల్తాన్ అహ్మద్ తన ఇంట్లోంచి ఒక జత బట్టలు తెచ్చి ఇచ్చాడు, "ఇక బయలుదేరు" అని.


అబు వాటిని వేసుకున్నాడు, కానీ‌ కదల్లేదు- "టోపీ లేనిదే మర్యాదస్తులు బయటికెలా వస్తారు?" అని. సుల్తాన్ అహ్మద్ మళ్ళీ తన ఇంట్లోంచే టోపీ తెచ్చి ఇచ్చాడు.


అయినా కదల్లేదు అబు. "చెప్పుల్లేవు" అని.


సుల్తాన్ అహ్మద్ విసుక్కుంటూ చెప్పులు తెచ్చి ఇచ్చాడు.


"మరి గుర్రం?" అన్నాడు అబు.


"గుర్రంకూడా నేనే తెచ్చివ్వాలా?" అని విసుక్కున్నాడు సుల్తాన్ అహ్మద్.


"తప్పదు మరి, నాకు గుర్రం లేదు- నేనెలా వస్తాను, ఖాజీ దగ్గరికి?" అన్నాడు అబు.


అబుకో గుర్రాన్ని తెచ్చిపెట్టక తప్పలేదు సుల్తాన్ అహ్మదుకు .


అప్పుడుగాని అబు కదల్లేదు. ఇక ఇద్దరూ ఖాజీ దగ్గరికి వెళ్ళగానే, అబు తన డబ్బు తీసుకొని ఇవ్వట్లేదని ఫిర్యాదు చేశాడు సుల్తాన్ అహ్మద్.


"అయ్యా, వీడు నా మిత్రుడే- ఆరోగ్యం సరిగా లేదు పాపం. ఈ డబ్బు తనదంటున్నాడు, సరే- మరి నేను వేసుకున్న బట్టలూ, నేను పెట్టుకున్న టోపీ, ఈ చెప్పులూ, నేనెక్కిన ఈ గుర్రమూ- ఇవన్నీ ఎవరివో అడగండి" అని అబు ఊదాడు మర్యాదగా, ఖాజీ చెవిలో .


"ఏమోయ్, మరి ఇతనెక్కిన ఈ గుర్రం ఎవరిది?" అన్నాడు ఖాజీ.


"నాదే" అన్నాడు సుల్తాన్ అహ్మద్.


"ఇతను వేసుకున్న చెప్పులు?"


"నావే" అన్నాడు సుల్తాన్ అహ్మద్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక.


"మరి ఇతను పెట్టుకున్న టోపీ?"


"అదీ నాదే" చెప్పాడు సుల్తాన్ అహ్మద్.


"ఓహో, ఔనా, మరి ఇతను వేసుకున్న బట్టలు?"


"అవీ నావే"


ఖాజీ అతని వైపు జాలిగా చూశాడు. ఆపైన ఆయన అబు వైపు చూశాడు.


"మరి అదేనండి, నేను అన్నది" అన్నాడు అబు, వినయం నటిస్తూ.


ఖాజీ కేసు కొట్టేశాడు. "మీ మిత్రుడిని ఎవరైనా మంచి మానసిక వైద్యుడికి చూపించు" అని అబుకు సలహా ఇస్తూ.


ఇద్దరూ ఇల్లు చేరాక, అబు తన మిత్రుని వస్తువుల్ని అన్నిటినీ వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. సుల్తాన్ అహ్మద్ డబ్బు సంచీతో సహా.


ఆపైన సుల్తాన్ అహ్మద్ ఏనాడూ అబుకు పాఠం చెప్పేందుకు ప్రయత్నించలేదు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కామెంట్‌లు లేవు: