6, జనవరి 2021, బుధవారం

🌹శ్రీ మద్ రామాయణావతరణము 🌹

   

ఉ.  ఓరి ! నిషాధ  ! నీవిటుల

             నుర్వి కిరాత కుచేష్ట బూనియున్

      కూరిమితోడ క్రౌOచములు

             కూడియు  నుండగ  నొక్కదానినిన్

      క్రూరశరమ్ముతో భువిని

             కూలగ గొట్టియు జంపినావు , నీ

      నేరత కారణంబునను

             నీవిక బ్రతుకవు పెద్దకాలమున్        18 


తే.  క్రౌంచ పక్షుల దుస్థితి  గాంచి మౌని

      శోక మందున మునిగియు  శ్లోక మొకటి

      అప్రయత్నంబుగా జెప్పి యద్భుతముగ

      మరల  యద్దాని దలచెను మానసమున    19 


తే.  అంత వాల్మీకి  యత్యంత  సంతసమున

      శ్లోక సరళిని  దలచియు  స్ఫూర్తి నొంది

      యంతరమ్మున  నిర్ణయ మరయ పొంది

      పలికె నీరీతి శిష్యుతో  పరవశమున            20 


మంజరీ ద్విపద..

       ఘన శిష్య !  నీ విది గమనించి నావ !

       నా నోట వెలువద్ద  నవ వాక్యములను

       యక్షర సమములై  యలరారి   మిగుల

       నాల్గు పాదములుగా  నయముగా  నుండె

       లయ బద్ధముగ నుండి లాలిత్య మొప్పి

       ఘన వాద్య యుక్తమౌ గానంబు తోడ

       పాడుట కనువుగా పరికించ నుండె

       ఛందస్సు గూడియు చక్కగా నున్న

       యియ్యది "శ్లోక " మే యెంచి  గాంచంగ

       ఇందులో సందేహ మిసుమంత లేదు .      21 


సీ. వాల్మీకి యారీతి వచియించ శిష్యుడు

              పరవశ మొందెను పలుకులకును

    " మా నిషాద " యనెడి మధుర శ్లోకమ్మును

             మననంబు చేసెను మరియు మరియు

     ప్రాచేతసుండంత పావన జలముల

             స్నానము గావించి సంధ్య వార్చె

     అంత భరద్వాజు  డత్యంత శ్రద్ధతో

             సలిలంబు గైకొనె కలశమందు

తే. తపసి వాల్మీకి  తదుపరి తన్మయమున

     తనదు శ్లోకమ్ము  మనమున తలచు కొనుచు

     శిష్య వర్గంబుతోడను శీఘ్ర ముగను

     యాశ్రమము జేరె యాగమ క్రియల జరుప     22

కామెంట్‌లు లేవు: