6, జనవరి 2021, బుధవారం

*శ్రీ లలితా నామ వైభవం-9*

 *శ్రీ లలితా నామ వైభవం-9*

చిదగ్నికుండ

సంభూతా అనగా ప్రభవించినది అని అర్థము. లోకములో ఏ ప్రాణి అయినా అగ్నిలో తన రూపము కోల్పోతుంది. సంభవించే ప్రాణి ఉంటుందా! ఆవిడ పుట్టినది మామూలు అగ్నికుండము కాదు చిదగ్నికుండము. భండాసురుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు అందరూ కలిసి పెద్ద హోమకుండము ఏర్పాటు చేసి, పరమశివుడు తెచ్చిన వాయువును అగ్నిగా నిక్షేపించి, అందులో మామూలు కట్టెలు వెయ్యకుండా తమ శరీరభాగములను హవిస్సులుగా సమర్పిస్తే, దేవతలు భండాసురుని చేత భాధలు పొందుతున్నారని వాడిని నిర్జించడానికి అమ్మవారు ఆ అగ్నిహోత్రము నుంచి పైకి వస్తున్నది. చిదగ్నికుండము అందరిలో ఉంటుంది. అందులోనుంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి అంటే కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళాలి. మనలోనే ఉన్న చిదగ్నికుండము కట్టెలు లేకుండా ఎలా ప్రకాశిస్తున్నది అనగా జ్ఞానమనే అగ్ని ప్రకాశిస్తూ ఉంటుంది. అగ్నికి వేడి ఒక్కటే కాక ప్రకాశము కూడా ఉంటుంది. ప్రకాశము కలిగిన జ్ఞానము, అజ్ఞానమనే చీకటిని తీసేస్తుంది. అజ్ఞానము పోతే మోక్షయోగ్యత కలుగుతుంది. ‘బ్రహ్మసత్యం – జగత్ మిథ్య’ అన్న భావము అనుభవములోకి వస్తే జ్ఞానం. నామరూపములు కనపడుతుంటే మాయ. ఈ మాయను దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహము ఉండాలి. ఇంకొకటి కనపడదు అంతటా ఈశ్వరుడే కనపడతాడు. ఆ ప్రకాశములో అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. చిదగ్నికుండసంభూతా అన్నప్పుడు ఆవిడ ఆవిర్భవిస్తు పైకి వస్తున్న స్వరూప దర్శనము ప్రారంభమయితే దేవతల కార్యము కొరకు రావడము లేదు అన్నది గ్రహించ గలుగుతారు. హాయిగా తిని, హాయిగా తిరిగి, హాయిగా పడుకోవాలని అనుకుంటూ ఎప్పుడూ హాయి హాయి హాయి అనేవాడు మనలోనే ఉన్న భండాసురుడు. ఎప్పుడూ ఈ శరీరముతో తాదాత్మ్యత చెందుతూ దానికి సుఖముగా ఉన్నది చూడాలనుకునే ఈ భండప్రవృత్తిని నశింప చెయ్యడానికి అమ్మవారు వస్తున్నది. రాక్షసులు మన దేహములోనే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనే ఆరుగురు దొంగలు జ్ఞానమనే రత్నమును అపహరించుకుని పోవాలని చూస్తుంటారు. ‘అమ్మా ! ఈ రాక్షస బాధ పడలేకపోతున్నాను. నువ్వే రక్షించి సత్వగుణమును ప్రవేశ పెట్టాలి’ అని శరణాగతి చేసే భక్తులలో ఆవిర్భవించి వారిని తన మార్గములో తిప్పుకుంటుంది. దేవకార్యము అంటే లోపల ఉన్న మంచి లక్షణములను రక్షించి చెడ్డ లక్షణములను పోగొడుతుంది. అలా రక్షించే సౌజన్యమే దేవకార్యసముద్యత.


*శ్రీ మాత్రే నమః*

కామెంట్‌లు లేవు: