*నారాయణ నమ్మకం..*
"శరణం ఓ స్వామీ..శ్రీ దత్తాత్రేయ ప్రభో.." అంటూ ఆ శనివారం నాటి రాత్రి పది గంటలవేళ శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద కొందరు భక్తులు భజన చేస్తూ పాడుతూ వున్నారు..మందిరం లో ఉన్న మిగిలిన భక్తులు ఈ భజన కార్యక్రమాన్ని చూస్తూ వున్నారు..
అలా చూస్తున్న భక్తులలో ఉన్న ఒక ఆవిడ ఉన్నట్టుండి "స్వామీ దత్తాత్రేయా.."అంటూ పెద్దగా కేక వేసింది..ఒక్కసారిగా నేల మీద పడిపోయి మెలికలు తిరిగిపోసాగింది..ఆమె భర్తా, కుమారుడు ఆమెను సముదాయిస్తున్నారు..కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు..వాళ్ళిద్దరి చేతులూ విసిరికొడుతూ..ఇంకా పెద్దగా కేకలు పెడుతున్నది..సుమారు రెండు మూడు గంటలపాటు ఆమె ఆవిధంగా ప్రవర్తించి..ఆపై నేల మీద పడి నిద్రపోయింది..ఆమె భర్త, కుమారుడు, తెల్లవార్లూ ఆమె ప్రక్కనే కూర్చుని వున్నారు..
ఆ ఆడమనిషి పేరు శాంతమ్మ..భర్త పేరు నరసింహం..వివాహం జరిగి పాతికేళ్ళయింది..ఇద్దరు పిల్లలు..మొదటి సంతానం ఆడపిల్ల..ఆ పిల్లకూ పెళ్లి చేసి కాపురానికి పంపించారు..రెండవ సంతానం కుమారుడు..ఆ అబ్బాయి పేరు నారాయణ..డిగ్రీ దాకా చదువుకొని, తండ్రికి వ్యవసాయం లో సహాయం చేస్తున్నాడు..అంతవరకూ సాఫీగా సాగిపోతున్న వాళ్ళ సంసారం లో అనుకోని ఇబ్బందులు వచ్చాయి..ఉన్నట్టుండి శాంతమ్మ ప్రవర్తన మారిపోయింది..పిచ్చి పిచ్చిగా కేకలు వేయడం, ఏడవడం..చేతిలో ఉన్న వస్తువులు విసిరి కొట్టడం లాంటి విపరీతపు పనులు చేయసాగింది..భర్తకూ, కుమారుడికి ఏమీ అర్ధం కాలేదు..ఒంగోలు లోని డాక్టర్లకు చూపించారు..ఏవేవో పరీక్షలు చేసి..హిస్టీరియా లాంటి జబ్బు అని తేల్చి..మందులు ఇచ్చి పంపించారు..
"మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు తీసుకెళ్లండి..త్వరగా నయం అవుతుంది.."అని నరసింహం కు ఒకరిద్దరు పెద్దవాళ్ళు సలహా ఇచ్చారు..ఆ సలహాను నరసింహం పెద్దగా పట్టించుకోలేదు..మరో వారం గడిచేసరికి శాంతమ్మ ఆరోగ్యం కూడా క్షీణించసాగింది..కుమారుడితో తాను విన్న విషయాన్ని చెప్పి.."ఏం చేద్దాం.." అనిఅడిగాడు.."నాన్నా..మందులు వాడాము కదా..ఫలితం కనబడలేదు..దేవుణ్ణి నమ్ముకొందాము..రేపే అమ్మను తీసుకొని మొగిలిచెర్ల వెళదాము.." అన్నాడు..ఆవిధంగా ఇద్దరూ నిర్ణయించుకొని, శాంతమ్మ ను తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్దకు వచ్చారు..ఆరోజు శనివారం..ఆరోజు రాత్రే ఈ విధంగా శాంతమ్మ ప్రవర్తించింది..
"స్వామీ నిన్నే నమ్ముకొని, మా అమ్మను తీసుకొని ఇక్కడకు వచ్చాము..కాపాడు తండ్రీ.." అని నారాయణ ఆదివారం ఉదయాన్నే స్వామివారి సమాధి వద్దకు వచ్చి వేడుకున్నాడు..స్వామివారి వెండి పాదుకలు ప్రక్కనే ఉన్న గిన్నె లోని విభూతి తీసుకొని వచ్చి, తన తల్లి నుదుటి మీద రాసాడు..మరుక్షణమే శాంతమ్మ వెఱ్ఱికేక పెట్టింది.."దత్తాత్రేయా నేను పోతున్నాను..".."నేను వెళ్లి పోతున్నాను.." అంటూ పెద్దగా అరిచి, పరిగెత్తింది..మందిరం వెనుక వైపుకు వెళ్లి, ఒక పెద్ద బండరాయిని ఎత్తుకొని, స్వామివారి పల్లకీ తిరిగే మార్గం లోమూడు ప్రదక్షిణాలు చేసి..ఆ బండరాయిని ఒక ప్రక్కకు విసిరేసి..మళ్లీ పరుగెత్తుకుంటూ మంటపం లోకి వచ్చి..సొమ్మసిల్లి పడిపోయింది..తాను విభూతి నుదిటి మీద రాసిన తరువాత, తన తల్లి ఈ విధంగా ప్రవర్తించడం చూసిన నారాయణకు అయోమయంగా ఉంది..భర్త నరసింహానికీ ఏమీ పాలుపోలేదు..
సొమ్మసిల్లి పడిపోయిన శాంతమ్మ మరో అరగంటకు లేచి కూర్చుంది..ఇప్పుడు ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది..మెల్లిగా లేచి, భర్త వద్దకు వచ్చి.."మంచి నిద్ర పట్టిందయ్యా..ఏదో బరువు తగ్గినట్టు ఉంది.." అన్నది..ఆ తండ్రీ కొడుకులు ముందు ఊపిరి పీల్చుకున్నారు..ఆరోజు మరలా శాంతమ్మ ఏ వికారమూ లేకుండా..తనపని తాను చేసుకుంటూ ఉన్నది..ఆ తరువాత నాలుగు రోజుల పాటు శాంతమ్మ మామూలుగానే ఉన్నది..నరసింహానికీ తన భార్య కు తగ్గిపోయిందని నమ్మకం కలిగింది.."నువ్వు చెపినట్లే మీ అమ్మను ఇక్కడికి తీసుకురావడం వల్ల మంచి జరిగింది..స్వామివారు కరుణించారు..వచ్చే ఆదివారం దాకా ఇక్కడే వుండి, స్వామికి పొంగలి పెట్టుకొని మన ఊరుకు పోదాము.." అని కొడుకుతో నరసింహం చెప్పాడు..
ఆ ప్రక్క ఆదివారం నాడు శాంతమ్మ స్వయంగా పొంగలి వండుకొని, గిన్నె నెత్తిన పెట్టుకొని స్వామివారి దర్శనానికి వచ్చింది..తన తల్లిని కాపాడమని మనస్ఫూర్తిగా వేడుకున్న ఆ పిల్లవాడి ప్రార్ధన అతి త్వరగా ఫలించింది..
"మా అమ్మను స్వామివారే కాపాడారు.." అని నారాయణ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడల్లా మాతో చెప్పుకొని, స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు.. నమ్మినవారిని కాపాడటం తన కర్తవ్యం అని సమాధి లో ఉన్న స్వామివారు మరో మారు నిరూపించారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి