6, జనవరి 2021, బుధవారం

మొగలిచెర్ల

 *నిస్వార్ధపు కోరిక..*


తన చేతిలోని సంచీ ని తీసి ఒక బల్ల మీద పెట్టి, నేరుగా పంపుల వద్దకు వెళ్లి, కాళ్ళూ చేతులూ ముఖమూ కడుక్కొని, తన సంచీ లోంచి తుండుగుడ్డ తీసుకొని, శుభ్రంగా తుడుచుకుని, మళ్లీ ఆ తుండుగుడ్డను జాగ్రత్తగా సంచీలో పెట్టుకొని..మంటపం లోకి వెళ్లి, స్వామివారి సమాధి గదికి ఎదురుగా నిల బడి రెండుచేతులతో నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చాడు..అతని వయసు చూస్తే ముప్పై ఏళ్ళు కూడా ఉన్నట్టులేవు..కొద్దిసేపు మంటపం లోనే కూర్చుని..లేచి మా సిబ్బంది వద్దకు వచ్చాడు..వాళ్ళను ఏదో అడుగుతుంటే..నా వైపు చూపించారు..నేరుగా నేను కూర్చుని ఉన్న బల్ల వద్దకు వచ్చి నిలబడ్డాడు..ఏం కావాలి అన్నట్లుగా అతని వైపు చూసాను..


"నా పేరు సీతారామ్ అండీ..బెంగుళూరు లో ఉద్యోగం చేస్తున్నాను..గత ఆరునెలలుగా ఫేస్బుక్ లో వాట్సాప్ లోని కొన్ని గ్రూపుల్లో ఈ ఆలయం గురించి విశేషాలు వస్తూ ఉన్నాయి..రోజూ చదువుతున్నాను..ఎందుకనో ఒకసారి వెళ్లి చూసివస్తే బాగుంటుంది అని బలంగా అనిపించింది..ఎలాగూ రెండురోజులు సెలవులొచ్చాయి..అందుకని నిన్న నిర్ణయం తీసుకొని, రాత్రి బస్సెక్కి వచ్చేసాను..ఈరోజు ఇక్కడ ఉండి, రేపుదయం తిరిగి వెళ్లిపోతాను..ఈ ఆలయం గురించి, ఈ స్వామివారి గురించి చదివే వున్నాను..స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించుకొని సమాధి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను.." అన్నాడు..


"అలాగే..అక్కడ మా సిబ్బంది వున్నారు..అభిషేకానికి టికెట్ తీసుకొని..బైట పూజాద్రవ్యాలు అమ్మే దుకాణం లో అభిషేకానికి కావాల్సిన సామాన్లు తీసుకొని రండి..మా అర్చకస్వామి అభిషేకం చేస్తారు.." అన్నాను..


సరేనని తలవూపి..టికెట్ కొనుక్కొని, అభిషేకం సామాన్లు తీసుకొని..లోపలికి వచ్చాడు..తన చేతిలో ఉన్న సంచీ లోంచి ఒక పట్టు పంచె..ఉత్తరీయము తీసుకుని, వాటిని సంప్రదాయ రీతిలో ధరించి..ఆపై అభిషేకానికి వెళ్ళాడు..అత్యంత వినయము, భక్తి, శ్రద్ధలతో కూడిన అతని ప్రవర్తన చూస్తుంటే నాకు ముచ్చటేసింది..


స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేయించిన తరువాత..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి భక్తిగా నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చాడు..


"ఈరోజు గురువారం అండీ..ఇప్పుడు రావడమే మంచిదైంది..ఇతర భక్తులెవ్వరూ పెద్దగా లేరు..పంతులు గారు కూడా చాలా శ్రద్ధగా అభిషేకం చేశారు..నాకు తృప్తిగా ఉంది..స్వామివారి సమాధి ని కూడా ప్రశాంతంగా చూడగలిగాను..నా కోరిక చెప్పుకున్నాను.." అన్నాడు..


"మీరు జవాబు చెప్పాలని బలవంతం చేయటం లేదు..మీరు ఏ కోరికతో ఇక్కడికి వచ్చారు.."? అన్నాను..


"అదేమీలేదండీ..నా వయసు 28 సంవత్సరాలు..నేను నా 21వయేటనే ఉద్యోగం లో చేరాను..నేను పనిచేస్తున్న కంపెనీ లో నాతోబాటు మరో ఐదారు వందల మంది పనిచేస్తున్నారు..ఇన్నాళ్లూ అదే కంపెనీ లో వున్నాను..వివాహం చేసుకున్నాను..ఒక పిల్లవాడు పుట్టాడు..నా భార్య నేను పిల్లవాడు హాయిగానే ఉన్నాము..నా వరకూ అంతా బాగానే ఉంది..కానీ కంపెనీ ఇబ్బందుల్లో పడింది..గత ఆరు నెలలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది..నాకున్న అనుభవంతో వేరే చోట ఉద్యోగం వస్తుంది..కానీ మొదటి నుంచీ నన్ను ఆదరించిన కంపెనీ గురించి ప్రార్ధించాలని వచ్చాను..స్వామివారికి గట్టిగా చెప్పుకున్నాను..కొన్ని వందలమంది భవిష్యత్తు ఆధారపడి ఉన్నది స్వామీ..మీరే కాపాడాలి అని కోరుకున్నాను..." అన్నాడు..


నిస్వార్ధంగా ఉన్న అతని కోరిక విన్న తరువాత అతని మీద గౌరవం పెరిగింది..ఆరోజంతా అతను స్వామివారి చరిత్రను పారాయణం చేస్తూ గడిపాడు..ఆ రాత్రికి మంటపం లోనే పడుకున్నాడు..తెల్లవారి లేచి, స్నానాదికాలు ముగించుకొని వచ్చి, మళ్లీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు..


ఐదారు నెలల తరువాత సీతారామ్ ఆలయానికి వచ్చాడు..ఆరోజూ గురువారమే..మళ్లీ పద్దతిగా అభిషేకం చేయించుకొని, స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి, "అన్నివిధాలా బాగుందండి..కంపెనీ మళ్లీ గాడిన పడింది..కొత్త ప్రాజెక్టులూ వచ్చాయి..నేనూ ఒక ప్రాజెక్టు హెడ్ గా  వున్నాను..అందుకే స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను.." అన్నాడు..అతని ముఖం లో చక్కటి ప్రశాంతత ఉంది..


నిస్వార్ధంగా తనతో పాటు ఇతరుల జీవితాలు కూడా బాగుపడాలని కోరుకున్నప్పుడు శ్రీ స్వామివారు కూడా సానుకూలంగా స్పందిస్తారు కదా..అందులో సందేహం ఏముంది?


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: