12, మే 2021, బుధవారం

అసురాంతకం


అసురాంతకం" కథ*

                🌷🌷🌷


“ *చేతనా*!”


“ యెస్! హు ఈజ్ స్పీకింగ్? “..... అమెరికాలో ఉన్న తనకు ఇంత అర్ధరాత్రి పూట ఎవరా... కాల్ చేస్తున్నారు... అనుకుంటూ... కించిత్ ఆదుర్దాతో.. 


“ ఎవరండి? చెప్పండి!”... అంది. మనసులో లక్ష సందేహాలు! 


“ చేతనా! నేను దినేష్ మెహతాను!  దయాకర్ కొలీగ్ ను! నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.  దయాకర్ లాంటి ధైర్యవంతుడు, ఎఫీషియంట్ పోలీస్ ఆఫీసర్.... ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకుంటాడని... ఇలాంటి ట్రాజిక్ ఎండ్ మీట్ అవుతాడని కలలో కూడా. ఊహించ లేకపోతున్నాం. మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్....  అట్టుడిగి పోతోంది ఈ వార్తవిని. “...... ఆమెను ప్రిపేర్ చేస్తూ నిదానంగా చెప్తున్నాడు అతను. 


అతన్ని మధ్యలో ఆపి...” ఏమయింది దయాకర్ కు! ట్రాజిక్ ఎండ్ ఏమిటి?....ఓ మై గాడ్..”... ఆమె హిస్టీరిక్ గా అరిచింది. 


ఆరోజు ఉదయమే ఎనిమిది గంటలకు... తన స్వగృహంలో ఆమె భర్త దినకర్... తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడని... ఎలాంటి సూసైడ్ నోట్ లేదని... గత రెండునెలలుగా వివిధ లైగింకవేధింపుల కేసుల్లో అతనిపై జరుగుతున్న ఎంక్వయిరీకి మనస్థాపం చెంది... అలాంటి చర్యకు పూనుకున్నాడని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని... ఆ సమయంలో వయోవృద్ధురాలయిన అతని తల్లి తప్పా మరెవరూ లేరని... ఆమె ఆరోగ్యదృష్ట్యా ఆమెకు తామింకా తెలుపలేదని... దినేష్ మాటల సారాంశం! 


అంత్యక్రియల కోసం ఆమె , పిల్లలు రావలసి ఉంటుందని కూడా చెప్పి... తన ప్రగాఢ సానుభూతి ప్రకటించి పెట్టేసాడు అతను! 


స్థాణువై పోయింది చేతన. అచేతనంగా... బుర్రలో విన్న విషయాలేవీ ...రిజస్టర్ అవ్వనట్టు కూర్చుంది. కొడుకును లేపి చెప్పాలన్న ప్రాధమిక విషయం కూడా ఆమె మనసుకు తట్టలేదు!  


ఆమె బుర్రకు వెంటనే తట్టిన మొట్టమొదటి వ్యక్తి... తన అత్తగారు! 


“ అమ్మమ్మ! అయ్యో! అమ్మమ్మ ఒక్కతీ ఉందా ఆ ఇంట్లో! ఎలా తట్టుకోగలదు... కొడుకు మరణం! ఈ వయసులో ఇంత దుఃఖం తీసుకోగలదా"  అమ్మకు ఫోన్ చెయ్యాలి.  కీర్తనకు కూడా! అమ్మమ్మ దగ్గరే ఉండమని”... 


విచిత్రంగా ఆమె భర్త మరణానికి విలపించడం లేదు. కేవలం ఆశ్చర్యపోతోంది అంతే! అతనిలోని దుర్మార్గం, చపలత్వం, స్త్రీలోలత చూసింది కానీ... అంత సులువుగా లోకాన్ని వదిలేయగల మొండి ధైర్యాన్నీ, దుడుకుతనాన్నీ ఎప్పుడూ చూడలేదు. 


ఈలోపున కొడుకుకు వార్త అందినట్టుంది.  గాభరాగా కిందకు ... తల్లిగదిలోకి పరుగెత్తుకు వచ్చాడు! ఫోన్ పట్టుకుని రాయిలా కూర్చుండిపోయిన తల్లి తలను ..తన గుండెలకు ఆనించుకున్నాడు.  అతని చెంపల వెంట కన్నీటిధారలు... తండ్రిదుర్మరణాన్ని తలుచుకుంటూ! 


“అమ్మా! కీర్తన ఫోన్ చేసి చెప్పింది! ఇప్పుడే ఏజెంట్ కు చెప్పి టికెట్స్ బుక్ చేయిస్తా!రేపు మొదటి ఫ్లయిట్ కల్లా ఇండియా బయలుదేరుతాం”. పరిస్థితిని చేతుల్లోకి తీసుకుంటున్న కొడుకు కేసి బేలగా చూసి... సరేనన్నట్టు తలూపింది చేతన! 


ఆ అబ్బాయికి బాగా తెలుసు... తల్లి మనసులో రగులుతున్న అగ్నిపర్వతాలన్నీ! ఎటువంటి సాంత్వనాపూర్వక మాటలు, సానుభూతి చూపించకుండానే మౌనంగా నిష్క్రమించాడు! 


ఇంతలో ఆమె తల్లి నుండి ఫోన్ వచ్చింది! ఆవిడ అనబోయే మాటలన్నీ ఆమెకు తెలుసు. ఎత్తాలనిపించకపోయినా... ఆపకుండా చేస్తున్న ఆవిడకు జవాబివ్వకపోతే... జరిగే రచ్చకు భయపడి.. కాల్ తీసుకుంది. 


“ఏం తల్లీ! ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా...ఆఖరికి నా తమ్ముడు ప్రాణాలు తీసుకున్నాకా! ఏరోజూ వాడికి సపోర్ట్ గా ఉన్నావు గనక! చిన్నతనంలోనే “తమ్ముడికిచ్చి పెళ్ళిచేసేసావని”.. కొన్నాళ్ళు నా మీద ఏడుపు.  నీకు ఆ ముసల్ది మా అమ్మ వత్తాసు! సరే చదువన్నావు.  లా వెలగబెట్టావు.  వాడు కిమ్మనలేదు.  ఇష్టం లేని కాపురమంటూనే...పిల్లల్నీ కన్నావు!  వాడి హోదాలన్నీ అనుభవించావు.  ఇంతోటి దిక్కుమాలిన లా ప్రాక్టీసుతో... వాడి మీద కేసులు పెట్టిస్తావా! కోర్టుకెళ్ళి సాక్ష్యాలు చెప్తావా, మొగుడికి విరుద్ధంగా! మనిషివా... పశువ్వా! చంపేసావు కదే నా తమ్ముడ్ని అన్యాయంగా...” అక్కడ గుండెలు బాదుకుంటున్నట్టు ఉంది.... ఆ కోపం, ఆక్రోశం... చేతన చెవులకు కర్ణకఠోరంగా వినబడుతోంది. 


“ఆస్థులు పోకోడదు... పైగా తమ్ముడు ఐపీఎస్.” అంటూ పదిహేనేళ్ళ తనకు పాతికేళ్ళ పైబడ్డ దయాకర్ నిచ్చి పెళ్ళిచేసిన అహంకారి. తాపట్టిన కుందేలుకు మూడేకాళ్ళంటూ... తన ప్రతీపంతం నెగ్గించుకునే తల్లి అంటే చేతనకు మహాభయం.  ఒకరకంగా కంపరం కూడా! 


అచ్చం తన తల్లిలాగే... మూర్ఖత్వం, భోగలాలసత్వం , విలాసాలూ, తలబిరుసుతనం వంటి అన్ని లక్షణాలూ పుణికి పుచ్చుకుని, తన తల్లి తర్ఫీదులో మరింత దిగజారుడుతనం అలవర్చుకున్న తన కూతురు కీర్తన అన్నా అంతే! పాకుడురాళ్ళ మీద నడుస్తూ.. పట్టుతప్పుతున్నా, ఆ తప్పుడు నడకలకే కట్టుబడి... జీవితంలో అధోముఖంగా జారిపోతున్న కూతురి గురించి ఆమెకేమీ ఆశల్లేవు! 


ఎందుకంటే కీర్తనకు ...తన తండ్రి దయాకర్ అడుగుల జాడలే ఆదర్శాలు! కన్నతండ్రి మరణిస్తే... సంతాపసూచకంగా నయినా తల్లితో ఒక సాంత్వనవచనం పలకాలనే ఇంగితం కూడా లేదు ఆ కూతురికి! 


చేతన జీవితంలో వెలుగునింపి, ఆమె ఆశల్నీ, ఆశయాల్నీ వెలిగించి... అర్ధం చేసుకుని...గౌరవించేవారు ఆమె అమ్మమ్మ... ఆమె తండ్రి రాఘవరావు.. ఆమె కొడుకు, శుభకర్.. మాత్రమే! 


భారత్ కు బయలుదేరిన విమానంలో కూడా చేతనను వెంటాడుతున్నవి దయాకర్ తో పంచుకున్న క్షణాలే! స్మృతుల్లా లేవవి.  వెంటాడే నీడల్లా ఉన్నాయి!  తోడేలు అతను!  క్రూరత్వం, మోసపుజిత్తులు, కుతంత్రం, అతని నైజం! 


పొడవైన మనిషి... కురచైన శీలం! మనోహరమైన అతని నవ్వు వెనకాల, తరచి చూస్తే స్పష్టంగా కనిపించే మాయాజాలం!  అధికారం, దండం చేతికిచ్చిన ఉన్నతమైన పదవి.   దయాదాక్షిణ్యాలను తుంగలో తొక్కి... విచ్చలవిడిగా.. లంచాలతో తడిసిన చేతులు! 


ధనికుల పాలిట, తమ హక్కుల రక్షకుడు! డబ్బులు రాలని చోట నరరూప రాక్షసుడు! అవసరాలు ఉన్న సర్వులకూ ఆప్తుడు!  “ఆమె ఆలోచనల లంకెలు తెంపుతూ... కొడుకు పలకరించాడు! 


“ కాసేపు కళ్ళు మూసుకో అమ్మా! అక్కడికెళ్ళాకా నీకస్సలు విశ్రాంతి ఉండదు. చాలా సంఘర్షణ ఉంటుంది! 

“కొడుకు కేసి అభావంగా చూస్తూ... “శుభకర్! భర్త దుర్మార్గుడయినపుడు... అతని వలన ఒక అమాయకురాలు అన్యాయంగా ప్రాణం పోగొట్టుకుంటే.... నేను ఎదురుతిరగడం తప్పా! ఎంత వయసురా అపర్ణది... మన కీర్తన వయసుది కదా! కూతురులాంటి ఆడపిల్లను చేరదీసి లోకం చూడనీకుండా, బంధించి...ఆ పిల్ల భవిష్యత్తు నాశనం చేసి... చివరకు చంపేస్తాడా!  ఆ పిల్ల ఉసురు కొన్నితరాలు మన కుటుంబానికి శాపమై కూర్చోదూ!  ఇదే పని తన కూతురికి జరిగితే...? అది అడిగాననే కదా.. పశువును బాదినట్టు బాదాడు...” ఎంత గొంతు తగ్గించినా... ఆమె మాటల తీవ్రత వలన చుట్టుపక్కల ఎవరైనా వింటారేమోనని.. “ హుష్ అమ్మా! అవన్నీ ఇప్పుడెందుకు.  పడుకో! “... అని తల్లిని చిన్నగా గదమాయించాడు శుభకర్! ఆమె చూపు మళ్ళీ కిటికీలోంచి మేఘాలను ఆశ్రయించింది! 


అపర్ణ ఒక్కతేనా! ఎంత మంది అమ్మాయిలతో ఆడుకున్నాడో!  “నువ్వు సవ్యంగా ఉంటే... వాడు బయట చిరుతిళ్ళు ఎందుకు వెతుక్కుంటాడు?  అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కు తినానివ్వదు.. అన్న చందాన ఉంది నీ యేడుపు! అయినా నీతో సాత్వికంగానే ఉంటాడుగా! నెత్తిన పెట్టుకునే మొగుడులో రంధ్రాన్వేషణ చేసేదాన్ని నిన్నే చూసా” అంటూ తన తమ్ముడి వికృతచేష్టలు సమర్ధిస్తూ, కూతుర్ని ఈసడించే తన తల్లిని చూసాకా,  మాతృత్వపు నిజాయితీ మీదే నమ్మకం పోయింది చేతనకు! 


“ భవాని”.....ఆమె కళ్ళారా చూసింది ఆ ఘటన. 

ఒక తీరప్రాంతంలో బినామీ పేరిట వారికొక  గెస్ట్ హౌస్ ఉంది.  కజిన్ పెళ్ళికని వచ్చిన వారిద్దరూ.. పెద్దతుఫాను రావడంతో  నాలుగురోజులు చిక్కడిపోయారు!  ఆమె పెళ్ళివారింట.... దయాకర్ గెస్ట్ హౌస్ లో!  అక్కడ జరిగే కార్యక్రమాలు ఊహించగలదు కనుక ఆమె అక్కడ అడుగు కూడా పెట్టదు.  కానీ ఆరోజు వెళ్ళక తప్పలేదు! 


ఎడతెరిపి లేకుండా సముద్రతీరపు నగరాన్ని ఊపేస్తున్న అల్పపీడన ప్రభావం మరో హుడ్ హుడ్ ను తలపిస్తోంది.  కిటికీలోంచి తుఫాన్ భీభత్సాన్ని చూస్తోంది చేతన! 


అంత విధ్వంసం జరుగుతుంటే  మరి ఎలా రాగలిగిందో తెలీదు,  గుమ్మంలో "భవానీ".... గెస్ట్ హౌజ్ లో పనిచేసే అమ్మాయి, తన రెండుచేతుల్లో అడ్డంగా “ నాలుగేళ్ళ పిల్లాడిని”ని పెట్టుకుని....! 


అస్థవ్యస్థమైన ఆకారంతో, కన్నీటి కాటుకచారల కళ్లు విస్ఫులింగాలు వెదజల్లుతుంటే... విరబోసుకున్న జుట్టు గాలికెగురుతూ.. కలకత్తా కాళీలా ఉంది భవానీ! 


"బేవార్స్ ఎదవా! దుర్మార్గుడా! ఇడిగోరా నీ కొడుకు! అచ్చంగా నీకే పుట్టిన కొడుకు.  నా చిన్నబాబు! నీ దౌర్జన్యం వలన సమాధయిపోయాడు. చచ్చిపోయాడు నాబాబు"... పిల్లాడి శవాన్ని గాలిలోకి ఊపుతూ..పట్టలేని దుఃఖంతో కదిలిపోతోంది ఆమె! 


"ఏమయింది భవానీ? ఏంటిదంతా?"...ఆ శోకతప్త మాతృమూర్తిని చూసి తల్లడిల్లిపోయింది చేతన! 

“అమ్మా ! ఐదేళ్లయింది ఈ గెష్టు అవుస్ లో పని కుదిరి. అయ్యగారు నన్ను చేరదీసారు.  ఈ పిల్లాడు మీ యాయనగారి బిడ్డ.  నేనే ఎప్పుడూ చెప్పలేదు.... తరిమేస్తారని! 

నిన్న పొద్దున్నే ..బాబును అంగన్వాడీలో దించి ఇక్కడికొచ్చా! మధ్యాన్నం.. "నేనెళ్లాలయ్యగారూ" అంటే ఈయన నన్ను బలవంతంగా ఉంచీసారు.  ఏడ్సుకుంటూనే ఉన్నా!  ఈరోజు సాయంత్రం నాలుగింటికి ప్రాణాలకు తెగించి బయటపడ్డా.  బీచీ రోడ్డు మీద పడుతూ, లేస్తూ, డేక్కుంటూ పోతున్నా. కొండల మీంచి చెట్టకొమ్మలొచ్చి పడిపోతున్నాయి.  పోలీసోళ్లు చూసి జీపెక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు.  యేసిన తాళం యేసినట్టే ఉంది.  మళ్లీ అంగన్వాడీకి పరిగెట్టా.  రేకు కింద సచ్చిపోయి బాబు!"... గొల్లున ఏడుస్తోంది భవాని! 


దయాకర్ లో చలనం లేదు, కనీస కనికరం కూడా లేదు. గదిలోకి వెళ్ళాడు.  రివాల్వర్ తెచ్చుకొచ్చాడు. “ పోతావా! చంపీసి పాతిపెట్టేయాలా!”.... అతని కఠినత్వం చూసి.. అన్నేళ్ళు భార్యగా సహజీవనం చేస్తున్న చేతనకే వెన్ను వణికింది! ఆ క్షణం ఆమెచేతిలో ఆయుధం ఉంటే ఆమె ఏ హత్యలు చేసుండేదో, ఆమెకే తెలీదు! 


ఒక న్యాయశాస్త్రపట్టా చేతిలో పెట్టుకుని, స్త్రీలహక్కుల కోసం ఎన్నో న్యాయపోరాటాలు చేస్తూ, ఎందరో అభాగినుల, వంచితుల తరుఫున వాదించి న్యాయపరమైన పరిష్కారాలు చూపించి, అత్యాచార నిందితులకు శిక్షలు పడేలా చేసి, వుమెన్స్ రైట్స్ ట్రిబ్యునల్ లో ఉన్నతపదవి నలంకరించి, సత్వరగతిని స్త్రీల సమస్యలు పరిష్కరించిన ... చేతన ముందు సవాలుగా తన భర్త....ఒక అభాగ్యురాలి జీవితంతో ఆడుకుంటూ! అసమర్ధతతో... తనక్కడ మౌనసాక్షిగా నిలబబడి! 


ఆ తరువాత భవానీకి న్యాయం చెయ్యడం కొరకై ఆమె ఆచూకీ కోసం చాలా ప్రయత్నించింది చేతన. అయితే భవానీ అన్న వ్యక్తిని జనాభాలెక్కల్లోంచే శాస్వతంగా తప్పించారన్న వార్త కాస్త ఆలస్యంగా తెలిసింది. 


దయాకర్ తో మరి బ్రతుకు కొనసాగింపు దుర్భరంగా తోచి పిల్లాడితో బయటకొచ్చి... ఐదేళ్ళు వేరుగా ఉంది చేతన. ఊహ తెలిసిన కూతురు ... అందలాలు వదిలి రానంది. నైతిక పతనానికి పునాదిరాయి వేసుకుంది! 


అమ్మమ్మ అనారోగ్యం... తండ్రి రికమెండేషన్.. ఆమెను తిరిగి దయాకర్ వద్దకు తిరిగి తెప్పించినా, పగిలిన పింగాణీకి అతుకుపెట్టిన చందమే అయింది వారి కాపురం! 


సమాంతర రేఖల్లా ఒకరి జీవితాలను మరొకరు స్పృశించకుండా  సాగుతున్న ఆ కుటుంబంలో “అపర్ణ” రాక సంచలనం అయింది. 


అపర్ణ... కీర్తన క్లాస్ మేట్! ప్రయివేట్  కాలేజ్ లో, మూడవయేడు ఎంబీబీఎస్ చదువుతోంది.  తండ్రి హఠాన్మరణంతో... ఆర్ధిక సంక్షోభంలో పడింది. 

ఈ క్షణానికి కూడా .... ఆరోజు తమింట్లో జరిగిన డైనింగ్ టేబిల్ సంభాషణలు, చేతన బుర్రలో పచ్చిగానే ఉన్నాయి! 


“అప్పూ! చూడూ ...ఈ కార్న్ ఫ్లేక్ కు నీ పెదవులను వదలాలని లేనట్టుంది.  చూడు, ఎలా అంటుకుని పోయిందో!” అంటూ దయాకర్ సుతారంగా తన వేలికొసను ఆమె పెదవులకు తాకించి... తన కపట మెస్మరైజింగ్ నవ్వు నవ్వుతూ... ఆమె కళ్ళలోకి చూస్తుంటే... ఆ అమ్మాయి... సిగ్గులమొగ్గై పోయినట్టు మెలికలు తిరిగిపోతూ, అతని చెయ్యి పట్టుకుని ఆపుతూ..” కమాన్ అంకుల్! యూ నాటీ!” అంటూ ఆంగ్లంలో అలరిస్తుంటే, ఒళ్ళు కంపరంతో ఊగిపోయింది చేతనకు! 


“కాల్ మీ దయా.. అప్పూ! ఫీల్ ఫ్రీ టు ఆస్క్ వాటెవర్ యు వాంట్”... అంటూ దయాకర్ హింట్ ఇస్తుంటే... కీర్తన పెద్దగా నవ్వుతూ” దేర్ యు ఆర్ డేడీ! యు ఆర్ టోటల్లీ అబ్సెస్డ్ విత్ అప్పూ! “ హే అప్పూ! యువర్ డే వజ్ మేడ్... మా డాడీ అన్నీ చూసుకుంటాడు. హీ ఈజ్ మై హీరో...” అంటూ కన్నతల్లి, సమక్షంలో ... ఎలాంటి జంకూగొంకూ లేకుండా... సిగ్గూయెగ్గూ లేకుండా... స్నేహితురాలిని ప్రోత్సహిస్తూ, తండ్రికి మార్గం సుగమం చేస్తున్న కూతురి అనైతికత... చేతనను మానసికంగా నిర్విణ్ణురాలినే చేసింది. 


రెండేళ్ళు అపర్ణ జాడే లేదు! 


ఈలోపున ఎవరినో ప్రేమించానూ, పెళ్ళి చెయ్యండని ....ఒక బెంగాలీ అబ్బాయిని తెచ్చి చూపించింది కీర్తన.  చదువు మీద శ్రద్ధలేకుండా... ఎలాంటి పాజిటివ్ జీవితలక్ష్యం లేని కీర్తనకు పెళ్ళికి తొందరేమొచ్చిందో అర్ధం కాలేదు చేతనకు.  కీర్తనకు నచ్చచెప్పబోయి భంగపడింది. దయాకర్ మాత్రం... తన అంతస్థుకు తగినవాడినే చూసుకుందని సంతోషించి... భారీగా కట్నకానుకలిచ్చి.. పెళ్ళి చేసి కూతుర్ని వదిలించుకున్నాడు. 


తల్లిఛాయలో పెరిగిన శుభకర్ ... దయాకర్ దృష్టిలో ...తన వంశాన్ని ముందుకు తీసుకుని పోయేవాడు మాత్రమే! ఆసక్తిలేదు అతనిపై... ఆపేక్షా లేదు! 


రెండు నెలల క్రితం... ఒకరోజు చేతన హైకోర్ట్ లో పని చూసుకుని ... ఇంటికి బయలుదేరి వెళ్తున్న వేళలో... ఫోన్ కాల్! ఎవరిదో అపరిచిత నంబర్! ఎత్తగానే.... ఎవరో అమ్మాయి పెద్దగా ఏడుస్తూ..! “ఆంటీ అపర్ణను.  నేను చాలా ప్రమాదంలో ఉన్నా, మీరు తప్ప ఎవ్వరూ నన్ను కాపాడలేరు!..”... ఇంకా ఏదో మాట్లాడుతోంది... కానీ ఆ అమ్మాయి గొంతుకు అక్కడి ట్రాఫిక్ రొదలో కలిసిపోయి ... ఏమీ వినిపించడం లేదు. పెట్టేసి తిరిగి కాల్ చెయ్యబోయింది... కానీ అది అన్ లిస్టెడ్ శాటిలైట్ ఫోన్! 


ఆ ఫోన్ నంబర్ కనుక్కోడానికి విశ్వప్రయత్నాలు చేసింది. చేతన తండ్రిగారు కూడా ప్రయత్నించారు!  చివరి ప్రయత్నంగా... అపర్ణ వివరాలకోసం కీర్తనను సంప్రదించింది!  తల్లి మీద ముందు నుండీ విముఖత్వమున్న కీర్తన ... పొడిపొడిగా మాట్లాడి... అపర్ణ వివరాలు తనకు తెలియవని చెప్పి పెట్టేసింది. 


కీర్తనతో మాట్లాడిన అరగంటకు దయాకర్, అతని ఇన్నోవాలో బయటకు వెళ్ళిపోయాడు! 


మూడురోజుల తరువాత .... మురిక్కాలువలో తేలింది ఐదు నెలల గర్భవతి అపర్ణ... శవమై! 


ఆ వార్త విని పిచ్చెక్కిపోయింది చేతనకు.  తన అసమర్ధత మీద అసహ్యం వేసింది. అపర్ణకు న్యాయం చెయ్యకపోతే.... తను మళ్ళీ నల్లకోటు వేసుకోకూడదని నిర్ణయించుకుంది!  ప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నియమించుకుని... అపర్ణ గురించి వివరాలు సేకరించసాగింది. 


అపర్ణ మెడిసిన్ మధ్యలోనే  మానేసిందని... ఆమె తల్లి ఆమెను చూసి రెండేళ్ళయిందని,  “ముంబయిలో మోడలింగ్ చేస్తున్నానని “...డబ్బు పంపుతోందని... చాలా అరుదుగా కాల్ చేసేదని... ఈమధ్య అదీ లేదని చెప్పడం విని, చేతన మనసు రకరకాల అనుమానాలూ... సందిగ్దాలతో నిండిపోయింది! ఆమె మనసూ... మేధస్సూ.. ఒకేఒక వ్యక్తివేపు సూచిస్తున్నాయి.  “దయాకర్”! 


చేతన పనిని సులువు చేస్తూ... ఒకబ్బాయి.. తాను అపర్ణ ఉండే పెంట్ హౌజ్ కింద ఉంటానని... అపర్ణ రాసిన ఉత్తరమని... ఎట్టి పరిస్థితులలో కూడా పోలీసులకు ఇవ్వొద్దని చెప్పి మాయమైపోయాడు! 


ఆ ఉత్తరమంతా... ఓ దయనీయమైన గాధ! ఒక ఆడపిల్ల... చదువు కోసం... తప్పటడుగు వేసయినా... ముందుకు సాగాలని చేసిన సాహసం, ఆమెను ఏ విధంగా ఓ పంజరపు నరకకూపంలోకి తోసిందో, ఎలాంటి అకృత్యాలకు, లైంగికహింసకూ, బెదిరింపులకూ...ఒక ఖాకీ చేతిలో ఆమె గురయిందో.... గర్భ విచ్ఛిత్తికి వీలుకాక తన జీవితం ఏ రకమైన ప్రమాదపుటంచులకు చేరిందో, హృదయవిదారకంగా రాసింది. 


అపర్ణ ఇచ్చిన అన్ని ఆధారాలతో.... దయాకర్ అరాచకాలకు స్వస్థి చెప్పదలచుకుంది చేతన. మీడియా సాయం తీసుకుంది. తను అజ్ఞాతంగానే ఉంటూ... కేస్ హియరింగ్ కు రాగానే... అపర్ణ తల్లితో... దయాకర్ ను దోషిగా నిరూపించే, ఆధారాలన్నీ బయటపెట్టించింది. 


కేస్ చివరిదశకు రావడంతోనే దయాకర్ కు ఈ కేస్ వెనుక చేతన హస్తం ఉందని అనుమానం రావడమేంటి.... కొడుకు శుభకర్ దగ్గరకు, అమెరికా వెళ్ళిపోయింది! ఇదిగో ఇలా మళ్ళీ స్వదేశంలో అడుగుపెడుతూ!        


కుటంబం నుండి పెద్ద ఒత్తిడి లేకపోవడంతో... దయాకర్ ఆత్మహత్య ఎంక్వయిరీ... ఒక ఫార్మాలటీ లాగ ముగిసిపోయింది.  చేతన మనసు ప్రశాంతంగా ఉంది. 


ఆమెకు అత్యంత ప్రీతిపాత్రురాలు, ఆదర్శమూ అయిన తన అమ్మమ్మ మంచం మీద.. పాదాల దరి కూర్చుంది.  నారాయణ తైలం తీసుకుని, ఆమె దుర్బలమైన పాదాలకు మృదువుగా రాయసాగింది. 


ఆ వృద్ధురాలు చేతనను తన దగ్గరగా కూర్చోమని పిలిచింది.  కేవలం చేతనకు మాత్రమే వినిపించేట్టు,” అమ్మలూ!  నేనే దయాని చంపేసాను”..... అంది! ఒక్కసారి చేతనకు పక్కలో బాంబు పడ్డట్టయింది. అపనమ్మకంగా చూసింది ! 


ముసలమ్మగారు గొంతు సవరించుకుంటూ “ ఆ రాత్రి... ఇంట్లో పార్టీ జరిగింది. పెద్దవాళ్ళెవరో వచ్చారు. కేసు నీరు కార్చడానికి బేరాలు జరుగుతున్నాయి!  నా నర్సును పంపించేసాడు దయా! అన్నీ సెటిల్ చేసుకుని వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేడ మీదకు వెళ్ళా.  అతికష్టం మీద.  ఆఖరి మాటగా తల్లిమాట వింటాడేమోనని!  తప్పతాగి పడున్నాడు.  పక్కనే అపర్ణ ఫోటో పడి ఉంది... పూర్తిగా ఛిద్రమై! వాడింక మారడు! రూఢీగా తెలిసిపోయింది. అలాంటి కలుపుమొక్కను కన్న పాపానికి నేనే దానిని పీకేసి... పాప ప్రక్షాళన చెయ్యాలనుకున్నా! 

పక్కనే లోడెడ్ పిస్టల్ ఉంది. నా చేతికి వూలు గ్లవ్స్ ఉన్నాయి! వాడి పుర్రచేతి వాటం గుర్తొచ్చి... ఎడమ కణత మీద పెట్టి... ఒక్క నొక్కు నొక్కా! నరకాసుర వధ జరిగిపోయింది.  వాడి ఎడం చేతిలో పిస్టల్ పెట్టేసి... కిందకొచ్చి నాలుగు నిద్రమాత్రలు వేసుకుని పడుకుండిపోయాను. బాధంటావా... బాధుండదా! ఎంత చెడ్డా కొడుకు”.... ఆవిడ వెక్కివెక్కి ఏడుస్తోంది. 


అమ్మమ్మను లేపి... తన చేతులతో చుట్టేసింది చేతన ఆర్తితో... ఓదార్పుతో! కాసేపటికి దుఃఖతీవ్రత తగ్గి ఆవిడ శాంతించారు! పూర్తి నిర్మోహత్వం , వైరాగ్యం ఆవహించాయి ఆ పెద్దామెకు!  అదే “ సత్యభామమ్మగారికి”! . 

అమ్మగా ... ప్రేమతో పెంచి, అనురాగాన్ని పంచి, మంచి నేర్పేది అమ్మ!

తప్పటడుగుల వేళ తడబాటు పడకుండా నడక నేర్పేది అమ్మ! తప్పుటడుగు వేయ తప్పని చెప్పెడి న్యాయమూర్తి అమ్మ.  దుష్టబుద్ధిని త్రునుమ, సత్యభామగ మారి దండించు దండమూ అమ్మే! 


అమ్మ ప్రేమను పొందుదాము! క్రోధాన్ని కాదు! 

మాతృమూర్తులకు శతకోటి వందనాలతో... జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన అమ్మకు ప్రేమతో... శశి, చిన్నమ్మాయి!

కామెంట్‌లు లేవు: