30, జూన్ 2021, బుధవారం

పురాకృతం

 *పురాకృతం..* *(మొదటి భాగం)*


*ఎవరి ఇంట్లోనైనా చిన్నవాళ్లు మరణించడం కూతుర్లు లేచిపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం మొదలైనవి జరిగినప్పుడు మత ప్రచారకులు ఆ ఇంటిని ముట్టడిస్తారు..   "మీ దేవుడు మిమ్ములను సరిగా పట్టించు కోడంలేదు. మామతంలోకి రండి. మేము మీకోసం ప్రార్ధనలు చేస్తాము. మీరేమీ కష్టపడకుండా మాదేముడు అన్నీ సవ్యంగా జరిపే టట్లుగా మేము చూసుకుంటాము" అని చెప్పి మతాలు మార్పిస్తుంటారు... కాస్త పరిశీలిస్తే ఆ మతంలో నైనా ఇవే పరిస్తితు లుంటాయి. ఏదైనా మతం లో మనుషులకు కష్టాలు రావు ..  చావు రాదు .. అనే ఏర్పాటు ఉంటే ప్రచారాలు అర్భాటాలు గట్రా లేకుండా అందరూ పొలో మని ఆ మతంలోకి దూకుతారు కదా. అట్లాటి సమాజమూ అట్లాంటి మతమూ ఎక్కడైనా ఉందా?*


ఒకరి జోలికి సొంటికి పోకుండా శాంతంగా ధర్మంగా బ్రతికే  వాళ్లు,  దరిద్రమూ, కష్టాలూ పడడమూ. వాళ్ళే డబ్బులున్న వాళ్లయితే పిల్లల విషయం లోనో, ఆరోగ్యం విషయం లోనో సమస్యలకు లోనవడమూ ఇట్లాటివి చూస్తుంటాము. చిన్న వాళ్ళు ముందుగా చచ్చి పోవడమూ. వీటి తోపాటు పాపాత్ములు దుర్మార్గులు అని మనం నిర్ణయించు కున్న వాళ్ళు  చాలా సుఖాలు అనుభవిస్తు న్నట్లుగా కనిపించడము చూస్తుంటాము. ఎవడో బాగా తాగి రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి గుద్దితే మన కాళ్లు చేతులు విరగడమూ. దేవుడూ ధర్మమూ అని నమ్మ కాలున్న వాళ్లకు ఇవి కొంచం  ఇబ్బంది కలిగించే అనుభవాలు. మిగతా మతాల గురించి నాకు తెలియదు. హిందూమతంలో దీనికి సంబంధించి ఒక వివరణ ఉన్నది అది తెలియజేస్తున్నాను.


ప్రతి మనిషికి తన పూర్వ జన్మలో చేసుకున్న శుభాశుభ కర్మల ఫలాలను అంటే పాపము పుణ్యము కలిపి సంచితము (పురాకృతం) అని పిలుస్తారు. పురాకృతం అంటే ఇంతకు మునుపు చేసుకున్నది అని అర్థము. సంచితము అంటే కూడ పెట్టుకొని దాచిపెట్టు కున్నది అని అర్థము. ఈ సంచితాన్ని మొత్తంగా ఒకే జన్మలో అనుభవించడానికి వీలు పడదు. ఇందులో ఒక ఇబ్బంది కూడా ఉంది. పాపాల వల్ల పుణ్యాలు పుణ్యాల వల్ల పాపాలు పరస్పరము రద్దు కావు. చక్కెరవ్యాధి ఉన్నవాడు లడ్డూలు తిని అదే మోతాదులో ఆవకాయ, మిరపకాయ బజ్జీలు తిన్నా అవి రెండూ కడుపులోకి వెళ్లి చెడు చేస్తాయే కానీ పరస్పరం కొట్టుకొని రద్దు కావు. పాపపుణ్యాలు కూడా అలాగే. వేటికవే విడివిడిగా అనుభవించాలి. ఈ కారణం వల్ల మనిషి మళ్లీ మళ్లీ జన్మలెత్తాల్సి వస్తుంది.


మనిషి జన్మ ఎత్తినప్పుడు అతని సంచిత పాప  పుణ్యాలు రెండు భాగాలుగా  అవుతుంది.  ఒక భాగం ఆరబ్దము రెండవది అనారబ్దము. ఆరబ్దము అంటే ఈ జన్మలో ఆ మనిషి అనుభవించ వలసిన పుణ్య పాపాల మొత్తము. యత్నము ప్రయత్నము. మోదము ప్రమోదము. శాంతము ప్రశాంతము.  ఆ పదాల లాగే ఆరబ్దాన్నే ప్రారబ్దము అని కూడా అంటారు. కొన్ని పదాలకు "ప్ర" కలిపితే ఇంకాస్త మరికాస్త అనే అర్థం వస్తుంది. ప్రారబ్దాన్ని కర్మ అదృష్టము అని కూడా అంటారు. చెడ్డ వాటికి కర్మ మంచి వాటికి అదృష్టము అని వాడుతూ ఉంటాము.


ఇక రెండోదయిన అనారబ్దము తర్వాతి జన్మలో అనుభవించడానికి మిగిలిపోతుంది. ఈ జన్మలో మనం చేసే శుభాశుభ కర్మల కు మళ్ళీ కొంత పాపము పుణ్యము ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన పాపపుణ్యాలను ఆగామి పాపపుణ్యాలు అంటారు. ఈ ఆగామి వెళ్లి అనారబ్దములో కలుస్తుంది. తర్వాత జన్మకు ఈ రెండూ కలిసిన మొత్తం మళ్ళీ అప్పుడు సంచితం అవుతుంది.


మనం చేసే అన్ని పనులకూ పాపపుణ్యాలు ఏర్పడవు. కర్మలను ఆసక్తితో కానీ కర్తృత్వ భావనతో కానీ చేసినప్పుడే ఆ కర్మలకు ఫలితాలు వస్తాయి. ధర్మబద్ధంగా జీవించడం కోసం చేసే కర్మలకు పాపము రాదు. అధర్మ మైన నిషిద్ధమైన కర్మలకు పాపం వస్తుంది. పుణ్యం కోసం చేసే కర్మలకూ మంచి పనులకూ పుణ్యం వస్తుంది.  ఆసక్తి లేకుండా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా కర్మ చేస్తే ఆ కర్మ కు ఫలితాలు రావు. అందువల్ల కర్మలన్నీ ఈశ్వరార్పణం గా అహంకార మమకారాలను వదిలిపెట్టి చేస్తే వాటివల్ల ఏ పాపము అంటదు. 


*పురాకృత మైన కర్మ ఫలితాన్ని రద్దు చేసుకునే అవకాశం మన మతంలో ఉన్నది..* 


అలా కర్మ రద్దు అవ్వడాన్ని కర్మ క్షయము అంటారు. కర్మ క్షయము జరిగితే జన్మ పరంపర నుంచి బయటపడవచ్చు. 


*పవని నాగ ప్రదీప్.*


కామెంట్‌లు లేవు: