30, జూన్ 2021, బుధవారం

13.ఋచీక మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*13.ఋచీక మహర్షి* 

 ఆకాలంలో కృతవీర్యుడు అనే మహారాజు భృగువంశంలో బ్రాహ్మణుల్ని కులగురువులుగా పెట్టుకుని వాళ్ళకి చాలా సంపదలిచ్చాడు . ఆయన పిల్లలకి ఈ కారణంగా భృగువంశంలో బ్రాహ్మణుల మీద ఈర్ష్య వుండేది . అందుకని భృగువుల్ని చాలా కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు . ఆడవాళ్లని కూడా తరిమి తరిమి కొట్టారు . అప్రవాన మహర్షి భార్య ఋచి గర్భవతి . ఆమె ప్రాణభయంతో పారిపోతూ వున్న సమయంలోనే ఒక గొప్ప తేజస్సునిండిన కొడుకును ప్రసవించింది . ఆ తేజస్సుకి రాజకుమారులకి కళ్లుపోయాయి . వాళ్ళ మీద దయతో వాళ్లకి కళ్ళు వచ్చేలా చెయ్యమని కొడుకుకి చెప్పింది ఋచి . రాజకుమారులు క్షమించమని అడిగి వెళ్ళిపోయారు . పేరు ఔర్వుడు . ఔర్వుడు పెళ్ళి చేసుకోకుండా తన తపశ్శక్తితో ఒక కొడుకుని , ఒక కూతుర్ని పొందాడు . ఆ కొడుకే మన ఋచీక మహర్షి 


ఋచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు . ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు . పాపం గాధిరాజుగారికి ఋచీక మహర్షికి తన కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యాలంటే బాధగా అనిపించింది . కాని ఏం చేస్తాడు ? మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి వుంటాడనుకుని ఎందుకయినా మంచిదని ఒక షరతు పెట్టాడు . మహర్షీ ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం వున్నవీ , నల్లని చెవులు , తెల్లని శరీరాలు వున్న వెయ్యి గుర్రాలు తీసుకురా . అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు . ఋషీక మహర్షి సరేనని వెళ్ళిపోయాడు . ఋచీక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి , తిరిగి , అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు . వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పాడు . వరుణదేవుడు ఋచీక మహర్షికి నమస్కారం చేసి , కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా ! అని చెప్పి ' తురంగతీర్థం'లో స్నానం చేయించి వెయ్యి గుర్రాలు ఇచ్చి పంపాడు .  వెయ్యి గుర్రాలు తీసుకుని గాధి మహారాజు కిచ్చి అతని కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు ఋచీక మహర్షి .


ఋచీక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్ని దేవుడికి ఆహుతి చెయ్యడానికి తయారు చేసిన అన్నం ఋచీక మహర్షి తన భార్యల చేత తినిపించాలనుకున్నాడు . “ స్వామీ ! నా తల్లికి కూడ ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి . ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది . ఋచీక మహర్షి ఇద్దరికి విడిగా పెట్టి పండ్లు మొదలయినవి తెచ్చుకోడానికి అడవికి వెళ్ళాడు . అప్పుడు సత్యవతి తల్లి సత్యవతితో అంటుంది , అమ్మా ! నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకు ఇచ్చిన అన్నం మీద పవిత్రమయిన మంత్రజలం చల్లాడు . నా అన్నం మీద మామూలు మంత్రజలం చల్లాడు . అందుకే మనం ఇద్దరం మార్చుకుందాం అని అన్నం మార్చుకుని తినేశారు . ఋచీక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని , నేను చెప్పినట్లు కాకుండ మార్చుకుని తిన్నారు . నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు , నీ తల్లికి వేదాంతవేది , మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నాడు . సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకుంది . ఋచీక మహర్షి జరగవల్సింది జరిగిపోతుంది . ఇది దైవ నిర్ణయం ఇంక చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు .


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు , ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు . ఋచీక మహర్షి సంసారం వదిలి పెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు . వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీరూపంలో ఉండేలా వరం ఇచ్చాడు . ఆ నదే కౌశికీ నది . గొప్ప పుణ్య తీర్థంగా పేరు పొందింది . చదివేశారా .... ఋచీక మహర్షి గురించి ! పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్ని అనర్ధాలు జరిగిపోతాయో చదివారు కదా ! 

*13.ఋచీక మహర్షి*



*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

కామెంట్‌లు లేవు: