30, జూన్ 2021, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సజీవ సమాధి..మంకుపట్టు..*


1975 వ సంవత్సరం మే నెల ఆఖరివారంలో శ్రీ స్వామివారు తాను సజీవ సమాధి చెందాలని భావిస్తున్నట్లు మా తల్లిదండ్రులైన శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో చెప్పారు..శ్రీ స్వామివారు వెలిబుచ్చిన ఆ అభిప్రాయాన్ని అమ్మా నాన్న ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు..ఆరోజు మొదలు వీలున్నప్పుడల్లా శ్రీ స్వామివారు తన కోరికను బైట పెడుతూనే వున్నారు కానీ..మా తల్లిదండ్రులే కాక, శ్రీ స్వామివారితో అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీ చెక్కా కేశవులు గారు..ఆశ్రమం నిర్మించిన శ్రీ మీరాశెట్టి గారు..శ్రీ మెంటా మస్తాన్ రావు గార్లు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు..


శ్రీ స్వామివారు పదే పదే ఒక మాట అంటుండేవారు.."నాకు సమయం లేదు..నేను వచ్చిన కార్యం పూర్తి కావొస్తోంది..అది పూర్తి అయిన మరుక్షణం నేను ఈ భూమ్మీద ఉండకూడదు..అది దైవ నిర్ణయం..బోధ చేయడానికి నేను సజీవంగా ఉండాల్సిన అవసరం లేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను తీరుస్తుంది..నా సమాధి అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.." అని..


వేసవి సెలవులు అయిపోయి మళ్లీ దసరా నాటికి శ్రీ స్వామివారి నిర్ణయం లో మార్పురాలేదు.. సంక్రాంతికి   శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని వత్తిడి చేయడం ప్రారంభించారు..నా పరోక్షంలో జరిగిన విషయాలను అమ్మా నాన్న గార్ల ద్వారా తెలుసుకుంటూ వున్నాను..1976 వేసవి సెలవులు నాటికి (అప్పటికి నేను ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసి వున్నాను) శ్రీ స్వామివారి సజీవ సమాధి విషయం సమస్యగా మారి..తీవ్ర రూపం దాల్చి ఉంది..అటు శ్రీ స్వామివారు తానొచ్చిన కార్యం పూర్తి కావొచ్చింది కనుక తనను సజీవ సమాధి చేయమని..ఇటు అమ్మా నాన్న ఆయనను ఆ ప్రయత్నం విరమించుకోమని శతవిధాలా బ్రతిమలాడుతూ వున్నారు..కారణం అంతు పట్టలేదు కానీ..శ్రీ స్వామివారు ఒకరకంగా చెప్పాలంటే మంకుపట్టు పట్టి ఉన్నారేమో అనిపించింది..


1976 ఏప్రిల్ నెల మూడవవారం లో నేను శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..శ్రీ స్వామివారు ధ్యానం లో ఉన్న కారణంగా సుమారు రెండు గంటల సేపు వేచి చూసాను.కానీ శ్రీ స్వామివారి దర్శనం కాలేదు..ఉసూరుమంటూ వెనక్కు వచ్చేసాను..ఆ ప్రక్కరోజే మాగాణి కి వెళ్లి రమ్మని నాన్నగారు చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరాను..శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి ఆశ్చర్యకరంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బైట వైపు నిలబడి వున్నారు..


నేను దగ్గరకు వెళ్ళేసరికి..పరీక్షగా చూసి..

"పొద్దున్నే ఇటొచ్చావు..మాగాణికి పోతున్నావా?.." అన్నారు..


అవునన్నాను.."నిన్న మిమ్మల్ని కలుసుకుండామని ఇక్కడిదాకా వచ్చాను..మీరు ధ్యానంలో ఉన్నట్టు వున్నారు..తిరిగి ఇంటికెళ్లిపోయాను.." అన్నాను..


పెద్దగా నవ్వారు..నవ్వి.."కొద్దిరోజుల్లో రోజూ నన్ను చూడొచ్చు.." అంటూ నా భుజం మీద అనునయంగా తట్టారు...నాకు అర్ధం కాలేదు..


(శ్రీ స్వామివారు ఆనాడు అన్న మాటలకు అర్ధం..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి ధర్మకర్త గా బాధ్యతలు చేపట్టిన రోజు తెలిసింది..శ్రీ స్వామివారి సమాధిని ఎప్పుడూ దర్శించుకుంటూనే వున్నాను..)


వెళ్ళొస్తానని చెప్పి మాగాణికి వెళ్ళిపోయాను..తిరిగి సాయంత్రంగా అదే దారిలో నడచి వస్తుంటే..ఆశ్రమం బైట మళ్లీ శ్రీ స్వామివారు నిలుచుని వున్నారు..నన్ను చూసి దగ్గరకు రమ్మని సైగ చేశారు..వెళ్ళాను..


"ఇంకొక వారం పాటు అమ్మా నాన్నలను గానీ..నువ్వు కానీ నా కోసం రావొద్దు.. ధ్యానం లో వుంటాను..ఇంట్లో చెప్పు.." అన్నారు..సరే అని వచ్చేసాను.. 


మరో వారం తరువాత అమ్మా నాన్న శ్రీ స్వామివారిని కలవడానికి వెళ్ళొచ్చారు..శ్రీ స్వామివారి నిర్ణయం లో ఎటువంటీ మార్పూ లేదని అనుకుంటూ వున్నారు..


ఏప్రిల్ 30 వ తేదీ ఉదయం నాన్నగారు స్వామివారి వద్దకు వెళుతూ..."నువ్వూ వస్తావా?" అని నన్నడిగారు.. "వస్తాను".. అన్నాను ఉత్సాహంగా.. అప్పటికి శ్రీ స్వామివారిని నేను చూసి పదిహేను రోజులవుతున్నది..నాన్నగారితో పాటు ఆశ్రమానికి వెళ్ళాను..


నాన్నగారు, నేను శ్రీ స్వామివారు ధ్యానం చేసుకునే గది బైట నిలుచున్నాము..మరో ఐదు నిమిషాల్లోనే శ్రీ స్వామివారు గది తలుపులు తీసుకొని బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి నేను అవాక్కయ్యాను..ఎందుకంటే..శ్రీ స్వామివారు బాగా చిక్కిపోయివున్నారు..ప్రశాంతంగా.. చిరునవ్వుతో... వున్న  శ్రీ స్వామివారి ముఖంలో ఏదో తెలియని అద్భుత వెలుగు కనబడుతోంది..అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం చేసాను..


సజీవ సమాధి గురించి శ్రీ స్వామివారితో నాన్నగారి సంభాషణ..పర్యవసానం..రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ :523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: