30, జూన్ 2021, బుధవారం

ఏమండీ గారు*

 👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨


     ఏమండీ గారు*

   (భర్త సహాయం..)


         👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨

        

           ఏమోయ్ ఏమీ చేస్తున్నావు.!!.." ఎప్పుడు చూసినా వంట ఇంటిలో, లేదు మొక్కలు నీళ్ళు పోస్తూ ఉంటావు. కాసేపు ఇలా కూర్చుని టీవీ చూడవు పేపర్ చదవవు."


      "బాగుంది నేను పేపర్ చదువుతూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎలా అవుతాయి."


      " సరే నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కదా! రేపు పొద్దున్నుంచి నీకు ఇంటి పనులలో సహాయం చేస్తాను. నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపు. "


*తర్వాతి రోజు*


         "ఏమండీ లేవండి పొద్దున్నే లేచి నాకు పనులలో సహాయం చేస్తా అన్నారు కదా!!.."


         " అబ్బా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసి లేటుగా పడుకున్నా, ఒక్క గంటలో లేస్తాను."


       ఎవరికి తప్పినా ఇల్లాలికి తప్పదుగా!!... లేచి డికాక్షన్ తీసి పాలు పొయ్యమీద పెట్టి బయట ముగ్గు వేసి వచ్చాను.


        మా ఏమండీ గారు లేచి వచ్చారు. 

       హమ్మయ్య లేచారా రండి రండి మొక్కలకి మీరు నీళ్ళు పొయ్యండి, నేను పూజకు పువ్వులు కోసుకుంటాను. "


          " అబ్బా ముందు నీ చేతితో కాఫీ ఇవ్వవే. కాఫీ పడితేనే మిగతా విషయాలు "


          వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నాము, ఇంతలో పేపర్ బాయ్ మొహం మీద పడేటట్టుగా పేపర్ పడేసి పోయాడు. ఇంక ఏముంది కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఏమండీ గారు ఒక గంట వరకూ పిలిచినా పలకరు పేపర్ పట్టుకొని.


           నేను కాస్త మొక్కలకి నీళ్ళు పోసి పువ్వులు కోసుకొని స్నాన పూజాదులు ముగించుకున్నాను.


            వంట ఇంటిలోకి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని. వెనకనే ఏమండీగారు వచ్చి" ఏమిటో ఈరోజు ఫలహారం?? "ఓహో ఇడ్లీనా కాస్త పల్లీ పచ్చడి చేద్దు అదీ కారం కారంగా!.. రెండు వెల్లుల్లి కూడవేయి. అంటూ స్నానానికి వెళ్లారు.


            ఏమండీ, సహాయం చేస్తా అన్నారు కదా! కాస్త వాటర్ ఫిల్టర్ నింపండి అన్నాను.

" ఇదిగో టీవీ లో మెయిన్ న్యూస్ చూసి వచ్చేస్తాను "అని వెళ్లారు… రెండుగంటలు ఏమండీగారు మాయం 😂


           బట్టలు వాషింగ్ మిషన్ లో నుంచి తీసి ఏమండిగారికి ఇచ్చాను కాస్త ఆరెయ్యమని " పక్కింటి వాళ్ళు ఎవరన్నా చూస్తే ఆడంగి వాడు అంటారు. నాకు సిగ్గు బాబు అంటూ తప్పించుకున్నారు. "


          "ఏమండీ కాస్త కూరలు తరిగి ఇస్తారా?? కూరలు చేసేస్తాను.."


       అబ్బా కూరగాయలలో పుచ్చులు, చచ్చులు ఉంటాయి నేను కొయ్యలేను బాబు అంటూ టీవీ లో మునిగి పోయారు.


           భోజనానికి వచ్చినప్పుడు టేబుల్ తుడిచి కంచాలు, మంచి నీళ్ళు పెట్టమన్నాను.


         టేబుల్ క్లీన్ గానే ఉంది. మంచినీళ్లు కిందా, మీద పోసాను అంటావు నువ్వే పెట్టేసుకో అంటూ కుర్చీలో ఛతికిల పడ్డారు.


           "అబ్బా ఏమీ రుచిగా చేస్తావో వంట, వద్దన్నా నాలుగు మెతుకులు ఎక్కువెళ్లి పోతాయి. కాస్త కునుకు తీసి వస్తాను."


          వంట ఇల్లు సద్దుకొని అన్ని తుచుడుచుకొని నడుము వాలుద్దాం అనేసరికి ఏమండీగారు లేచి వచ్చి...ఏమోయ్ ఏమిటో మబ్బులు మబ్బులుగా ఉన్నాయి. టీ తో పాటు రెండు ఉల్లి పకోడా వేస్తావేమిటి??


          పకోడీ తిని టీ తాగి "పద కాసేపు అలా నడిచి వద్దాము అన్నారు."


         రాత్రి….. " ఏమిటో నీవంట అమోఘం ఎంత వద్దన్నా  తిండి ఎక్కువ అయిపోతుంది. రాత్రికి కాస్త జావా కాచి దానిలోకి కొబ్బరి పచ్చడి, చిక్కగా చిలక్కోట్టిన మజ్జిగా చాలు."


         అన్ని సద్దుకొని అలసిన నేను పడుక్కోవడానికి వెళ్తుంటే ఏమిటో "ఎప్పుడు చూసినా నిద్ర అంటావు. కాసేపు నాతో టీవీ చూడవు. నాకు కాస్త ఎమన్నా పని చెప్పమంటే చెప్పవు.


       సరేలే నువ్వు వెళ్ళి పడుక్కో నేను ఈ క్రికెట్ మ్యాచ్ చూసి వస్తాను.. రేపటి నుంచి అయినా నాకు కాస్త పని చెప్పు అన్నారు.


       నాకు ఒక మళ్ళీ రేపు ఎలా ఉంటుందో కళ్ళముందు మెదిలింది. 😂😂


*మిత్రులారా చిన్న సూచన*


*ఈ ప్రపంచంలో ఆడ పని, మగ పని లేవు. మంచి‌పని, చెడ్డ పని మాత్రమే ఉన్నాయి. ఆలుమగలు ఒకరికొకరు అన్యోన్యంగా ఇంటి పనులు పంచుకుంటే ఆ గృహమే స్వర్గసీమ.‌*

*ఒక కుటుంబం ఆనందాల హరివిల్లుగా మారాలంటే రెండు చక్రాలు కలిసి ఒకే మాట, ఒక బాటగా నడవడంతో పాటూ పరస్పర సహకారం కూడా అవసరం. మనల్ని చూసే మన పిల్లలు స్త్రీ, పురుష సమానత్వాన్ని, కష్టాన్ని పంచుకునే తత్వాన్ని అలవరచుకుంటారు. ఈ కథ హాస్యానికే రాసినా, మంచి మార్పు సమాజంలో రావడానికి మన ఇంటి నుండే ప్రయత్నం మొదలుపెట్టాలని మిత్రులందరినీ కోరుతున్నాను. ప్రతి దంపతులూ అన్యోన్యంగా ఆనందంగా ఒకరికొకరు తోడూ నీడగా ఆనందంగా ఆరోగ్యంగా జీవన‌ప్రయాణం సాగించాలని, పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవిత గమనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరం "ఇగో"ను వదులుకుంటే మనందరికీ ఆనందాలు సొంతమవుతాయి....*

కామెంట్‌లు లేవు: