5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *5.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఐదవ అధ్యాయము*


*భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*5.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*దేవర్షిభూతాప్తనృణాం పితౄణాం న కింకరో నాయమృణీ చ రాజన్|*


*సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తమ్॥12364॥*


మహారాజా! భగవంతుడు సర్వలోక శరణ్యుడు. ఆ సర్వేశ్వరుని సర్వాత్మనా శరణుజొచ్చినవాడు ఆ స్వామి అనుగ్రహ ప్రభావమున వివిధములగు కర్మబంధముల నుండియు, వాటి వాసనలనుండియు సంపూర్ణముగా ముక్తుడగును. అంతట దేవతలు, ఋషులు, కుటుంబీకులు, మానవులు, సకలప్రాణులు, పితృదేవతలు మున్నగువారి ఋణములనుండి అతడు విముక్తిపొందును. అందువలన అతడు వీరిలో ఎవరికిని కింకరుడు కాడు. ఆ విధముగా అతడు భగవదనుగ్రహమునకు పాత్రుడై పరంధామమునకు చేరును.


*5.42 (నలుబది రెండవ శ్లోకము)*


*స్వపాదమూలం భజతః ప్రియస్య త్యక్తాన్యభావస్య హరిః పరేశః|*


*వికర్మ యచ్చోత్పతితం కథంచిద్ధునోతి సర్వం హృది సన్నివిష్టః॥12365॥*


దేవాదిదేవుడైన ఆ పరమపురుషుని అనన్యభావముతో శరణుపొందిన పరమభక్తునివలన ఎట్టి పాపకృత్యములు ఘటిల్లవు. ఒకవేళ ఎప్పుడైనను అతనివలన పాపకర్మగాని, నిషిద్ధకర్మగాని (అతని సంకల్పములేకుండా) ఘటిల్లినచో సకలప్రాణుల హృదయములలో నివసించు చుండెడి భగవంతుడు అతని పాపవాసనలను అన్నింటిని క్షాళితమొనర్చును. ఆ విధముగా అతనిని పరిశుద్ధుని జేయును.


(తొమ్మిదిమంది యోగీశ్వరులయొక్క చర్చలతోగూడిన ఈ ప్రకరణము శరణాగతితోనే ప్రారంభమయినది. ఈ ప్రకరణముయొక్క ముగింపుగూడ శరణాగతితోనే పూర్తియగుచున్నది. కావున మానవుడు శ్రేయస్సును పొందుటకు భగవంతుని శరణుజొచ్చుటయే సర్వోత్కృష్టసాధనమని స్పష్టమగుచున్నది)


*నారద ఉవాచ*


*5.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ధర్మాన్ భాగవతానిత్థం శ్రుత్వాఽథ మిథిలేశ్వరః|*


*జాయంతేయాన్ మునీన్ ప్రీతః సోపాధ్యాయో హ్యపూజయత్॥12366॥*


*నారదుడు నుడివెను* మిథిలాధిపతియగు నిమిమహారాజు ఈ విధముగ భాగవతధర్మములను సావధానముగావిని మిగుల సంతుష్టుడయ్యెను. పిమ్మట ఆ ప్రభువు తన ఋత్విజులతో, ఆచార్యులతోగూడి జయంతి (ఋషభదేవుని భార్య జయంతి) కుమారులైన ఆ మునీశ్వరులను విధ్యుక్తముగా పూజించెను.


*5.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తతోఽన్తర్దధిరే సిద్ధాః సర్వలోకస్య పశ్యతః|*


*రాజా ధర్మానుపాతిష్ఠన్నవాప పరమాం గతిమ్॥12367॥*


పిమ్మట అక్కడివారు అందరును చూచుచుండగనే ఆ యోగిపుంగవులు అంతర్థానముచెందిరి. నిమిమహారాజు వారి ఉపదేశములను పూర్తిగా అనుష్ఠించి, పరమగతిని పొందెను.


*5.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*త్వమప్యేతాన్ మహాభాగ ధర్మాన్ భాగవతాన్ శ్రుతాన్|*


*ఆస్థితః శ్రద్ధయా యుక్తో నిఃసంగో యాస్యసే పరమ్॥12368॥*


మహాత్మా! వసుదేవా! నీవు వినిన ఈ భాగవతధర్మములను భక్తిశ్రద్ధలతో ఆచరింపుము. అంతట సకలబంధములనుండి విముక్తుడవై పరమపదమును పొందెదవు.


*5.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*యువయోః ఖలు దంపత్యోర్యశసా పూరితం జగత్|*


*పుత్రతామగమద్యద్వాం భగవానీశ్వరో హరిః॥12369॥*


సర్వశక్తిమంతుడైన శ్రీహరి మీకు పుత్రుడుగా జన్మించెను. అందువలన మీ దంపతులయొక్క (దేవకీవసుదేవులయొక్క) యశస్సు జగత్తునందు అంతటను వ్యాపించును.


*5.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*దర్శనాలింగనాలాపైః శయనాసనభోజనైః|*


*ఆత్మా వాం పావితః కృష్ణే పుత్రస్నేహం ప్రకుర్వతోః॥12370॥*


మీరు శ్రీకృష్ణప్రభువును దర్శించుట, అక్కునజేర్చుకొనుట, ముచ్చట్లాడుట, పరుండబెట్టుట, ఆసీనునిగావించుట, భోజనము పెట్టుట మొదలగు క్రియలద్వారా ఆయనపై మీ వాత్సల్యము ప్రదర్శించితిరి. తత్ఫలితముగా మీ హృదయములు పరిశుద్ధములైనవి. మీరు పునీతులైతిరి.


*5.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*వైరేణ యం నృపతయః శిశుపాలపౌండ్రశాల్వాదయో గతివిలాసవిలోకనాద్యైః|*


*ధ్యాయంత ఆకృతధియః శయనాసనాదౌ తత్సామ్యమాపురనురక్తధియాం పునః కిమ్॥12371॥*


వసుదేవా! శిశుపాలుడు, పౌండ్రకుడు, సాల్వుడు మొదలగు రాజులు, తాము పరుండినప్పుడు, కూర్చొనియున్నప్పుడును, తదితర సమయములయందును వైరభావముతో నైనను శ్రీకృష్ణప్రభువు యొక్క గమనమును లీలావైభవములను, విలోకనములు మొదలగువాటిని ధ్యానించిరి. ఫలితముగా వారు సారూప్యమోక్షమును పొందిరి. ఇక మిగుల ప్రేమానురాగములతో ఆ స్వామిని లాలించి పాలించుచుండెడి మీ విషయమును గూర్చి చెప్పనేల?


*5.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*మాపత్యబుద్ధిమకృథాః కృష్ణే సర్వాత్మనీశ్వరే|*


*మాయామనుష్యభావేన గూఢైశ్వర్యే పరేఽవ్యయే॥12372॥*


వసుదేవా! నీవు శ్రీకృష్ణుని మీ పుత్రునిగా మాత్రమే భావింపవలదు. అతడు పరమాత్ముడు, సర్వేశ్వరుడు, కారణాతీతుడు, శాశ్వతుడు. ఆ స్వామి తన దివ్యత్వమును మరుగుపరిచి మాయా మానుష రూపములో అవతరించి, తన లీలలను ప్రదర్శించెను.


*5.50 (ఏబదియవ శ్లోకము)*


*భూభారాసురరాజన్యహంతవే గుప్తయే సతామ్|*


*అవతీర్ణస్య నిర్వృత్యై యశో లోకే వితన్యతే॥12373॥*


శ్రీకృష్ణప్రభువు భూమికి భారముగానున్న అసురప్రవృత్తిగల రాజన్యులను సంహరించుటకును, సత్పురుషులను రక్షించుటకును, అట్లే జీవులకు పరమశాంతిని, ముక్తిని ప్రసాదించుటకును అవతరించిన మహానుభావుడు. ఆయన తన యశోవైభవములను సకలదిశలయందును వ్యాపింపజేసెను.


*శ్రీశుక ఉవాచ*


*5.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*ఏతచ్ఛ్రుత్వా మహాభాగో వసుదేవోఽతివిస్మితః|*


*దేవకీ చ మహాభాగా జహతుర్మోహమాత్మనః॥12374॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! మహాభాగ్యశాలులైన దేవకీవసుదేవులు నారదుడు తెలిపిన భవ్యవచనములను విని ఎంతయు విస్మితులైరి. వారు తమ పుత్రమోహమును త్యజించిరి.


*5.52 (ఏబది రెండవ శ్లోకము)*


*ఇతిహాసమిమం పుణ్యం ధారయేద్యః సమాహితః|*


*స విధూయేహ శమలం బ్రహ్మభూయాయ కల్పతే॥12375॥*


మహారాజా! పరమపవిత్రమైన ఈ ఇతిహాసమును ఏకాగ్ర చిత్తముతో ఆలకించి, దీనిని మనస్సున పదిలపరచుకొనినవారు భగత్ప్రాప్తికి ప్రతిబంధకములైన రాగద్వేషములనుండి ముక్తులై బ్రహ్మపదమును (పరమపదమును) పొందుదురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే పంచమోఽధ్యాయః (5)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవంతుని సేవింపనివారిగతి - భగవంతుని పూజావిధానము* అను

ఐదవ అధ్యాయము (5)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: