5, సెప్టెంబర్ 2021, ఆదివారం

వినాయక చవితి సందేశాలు వినాయక చవితి సందేశాలు

 ॐ వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 1


"తుండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమన్


మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చుాపులు మందహాసమున్


కొండొక గుజ్జురూపమును కోరిన విద్యల కెల్ల నొజ్జయై


యుండెడి పార్వతీతనయ! యోయి గణాధిప! నీకు మ్రొక్కెదన్"


 -- తుండము,ఏకదంతము,పెద్ద బొజ్జ,బాగా మ్రోగే గజ్జలు, విచిత్రమైన చూపులు-నవ్వు,మరుగుజ్జు రూపమూ గల ఓ పార్వతీ తనయా! గణాధిపా! నేను ఏ విద్య కావాలనుకొంటే దాన్ని నాకు బోధించేవాడా! నీకు మ్రొక్కుతున్నానయ్యా!అనుగ్రహించు!


---------------------------------------------------------


వివరణ


1. ముఖము - ఆహారము - ఇబ్బంది


 *తుండం,ఒకే దంతం,గాదెతో సమానమైన పెద్దబొజ్జా, పొట్టిచేయీ కలిగిన వాడు.


ఆహారం విషయంలో —


*తినేందుకు తొండం అడ్డం,


*పోనీ ఏదోవిధంగా ఆహారం తీసుకుందామంటే,ఆ ఒక్క దంతమూ అడ్డం.


*నెమ్మదిగా తిందామంటే,ఎక్కువ నిలువచేయదగిన పెద్ద పొట్ట.


2. నాట్యం - అసౌకర్యం


* కాళ్ళు పొడుగువి కానందున, గజ్జలు మాత్రం శీఘ్రంగా ధ్వనిస్తూ ఉంటాయి.


* ఆ ధ్వనికి అనుగుణంగా చూడడానికి మెల్లని చూపులు ఒక అడ్డంకి.


*ఆకర్షణీయమైన నవ్వు కాక, మంద(అజ్ఞాని వెర్రి)హాసము(నవ్వు).


3. రూపము - అందవిహీనం


* అదొకతీరు మరుగుజ్జు ( కొండొక గుజ్జురూపము).


           ఇలా పరిహాసం చేయదగిన విధంగా ఉన్న తన పుత్రుణ్ణి లోకంలో అందఱూ పూజించేలా, "కోరిన విద్యల కెల్ల ఒజ్జ" గా జ్ఞానప్రదాతను చేసింది జగన్మాత పార్వతీదేవి. 

          అందుకనే "వినాయకుడు" - "పార్వతీ తనయ!" అని మనచేత పిలిపించుకుంటున్నాడు.

          అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేది విద్యే కదా!


4. విద్యా ప్రదాత


ఎవరు ఏ చదువు కావాలని కోరుకుంటే,వారికి ఆ చదువులన్నింటినీ ఇచ్చే ఉపాధ్యాయుడు ( కోరిన విద్యల కెల్ల ఒజ్జ).


-------------------------------------------------------


విశేషం


* విద్య పొందాలంటే,మనకి దాన్ని అందించగలిగే వానికి,

అ)విషయ పరిజ్ఞానం కలిగియుండాలి.

ఆ)దాన్ని బోధించే సంకల్పం ఉండాలి.

ఇ)అర్ఠమయ్యేలాగు చెప్పగలగాలి.


* బాహ్య సౌందర్యం( ఉదా॥ అష్టావక్రుడు) ఎలా ఉన్నా, అంతస్సౌందర్యం ముఖ్యం.


* కళల ప్రాధాన్యతకన్నా, పశుపతి పుత్రుడుగా,అజ్ఞానాంధకారాన్ని తొలగించి,జ్ఞానాన్ని అందజేయగలడు "వినాయకుడు"



ఒజ్జ:


గురువు - ఉపాధ్యాయుడు - ఆచార్యుడు

       -------------------------------------------


1. గురువు


గురుర్బన్ధురబన్ధూనాం గురుశ్చక్షు రచక్షుషామ్ I

గురుః పితాచ మాతాచ సర్వేషా న్యాయాయవర్తినామ్ II


----బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు.కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు.గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు.న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు "గురువు"


2. ఉపాధ్యాయుడు


ఏకదేశం తు వేదస్య వేదాఙ్గాన్యపి వా పునః I

యో2ధ్యాపయతి వృత్యర్థమ్ ఉపాధ్యాయస్య ఉచ్యతే II


----వృత్యర్థం వేదాన్నీ వేదాంగాలనీ ఎవరైతే అధ్యాపనం (బోధన) చేస్తారో వారు "ఉపాధ్యాయులు"


3. ఆచార్యుడు


ఆచినోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి I

స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే II


----కేవలం శాస్తార్థాలను బోధించడమే కాక, తాను వాటిని ఆచరిస్తూ, సమాజ హితం కోసం ఆదర్శంగా ఆచరింప చేసేవాడు "ఆచార్యుడు"


--------------------------------------------------------


               రామాయణం శర్మ

                    భద్రాచలం

కామెంట్‌లు లేవు: