5, సెప్టెంబర్ 2021, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*990వ నామ మంత్రము* 5.9.2021


*ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః*


చిరకాలాభ్యాసాతిశయముచే తెలియబడు తల్లికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అభ్యాసాతిశయజ్ఞాతా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే తాము చేయు సాధనలో పరిపూర్ణత ఏర్పడి తరింతురు.


నిత్యము నిద్రనుండి లేచినది మొదలు మరల నిద్రపోవు వరకూ, జీవితకాలమంతయునూ వేదాంతవిచారణ చేయుటయే అభ్యాసము. ఇది వేదవిహితము. ఆ విధమైన అభ్యాసము వలన అందులో ఉండే రహస్యాలు అవగాహనకు వచ్చి ఆత్మసాక్షాత్కారము లభించును. ఏదైనా విషయము పదే పదే వినుటవలన, ఆ విషయము మనసుకు అత్తుకుపోతుంది. అలాగే పరమేశ్వరి స్తోత్రములు గాని, పురాణవిషయములుగాని మరల మరల అభ్యాసము మాదిరిగా పారాయణ చేయుటచే, ఆ తల్లి గురించి తెలియుటయే గాక, పుణ్యకర్మఫలము సంప్రాప్తించును. స్తోత్రముగాని, మంత్రజపముగాని ఆవృత్తిగా చేయుటనే అభ్యాసాతిశయము అని అందురు. బ్రహ్మాండ పురాణములో 'పరమేశ్వరి కేవలధ్యానముచే తెలిదగినది అనియు, జ్ఞానమే శరీరముగాను, ఆత్మగాను తేజరిల్లుచున్నది' అని గలదు. ఆ తల్లి విలసిల్లునదే హృదయమందలి దహరాకాశమునందు. జీవేశ్వరైక్యమును చిరకాలము అనుష్ఠించుటవలనను, ఆత్మైక్యము వలనను ఆ తల్లిని మనోనేత్రములందు తెలియగలము గనకనే ఆ పరమేశ్వరి *అభ్యాసాతిశయజ్ఞాతా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: