మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*వెలుగు రేఖలు..*
1976 వ సంవత్సరం లో శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే నాటికి మొగలిచెర్ల గ్రామానికి కానీ..శ్రీ స్వామివారి ఆశ్రమానికి కానీ విద్యుత్ సౌకర్యం లేదు..కిరోసిన్ తో వెలిగే లాంతర్లే అప్పటి దీపాలు..మా నాన్నగారు శ్రీ పవని శ్రీధరరావు గారు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కలిగించాలని ఒకటే తపన పడేవారు..జిల్లా అధికారులను కలిశారు..రాజకీయంగా కూడా ప్రయత్నం చేశారు..సుమారు నాలుగేళ్ల తరువాత ఆయన ప్రయత్నాలు ఫలించి..ముందు మొగలిచెర్ల గ్రామానికి..తరువాత అతి కొద్దిరోజుల్లోనే శ్రీ స్వామివారి మందిరానికి విద్యుత్ సౌకర్యం ఏర్పడింది..
2004 వ సంవత్సరం లో నేను బాధ్యతలు తీసుకునే నాటికి..శ్రీ స్వామివారి మందిరం వద్ద తరచూ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతూ ఉండేది..ఒక్కసారి అంతరాయం ఏర్పడితే..మళ్లీ పునరుద్ధరించడానికి కొన్ని గంటల సమయం పట్టేది.. మేము సబ్ స్టేషన్ కు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా..ఫలితం మాత్రం వుండేది కాదు..ఒక్కొక్కసారి రాత్రి పూట సరఫరా ఆగిపోయేది..ఆ రాత్రంతా మందిరమూ..మందిరం వద్దనున్న అర్చక స్వాముల గృహాలూ..ఇతర వసతి సముదాయాలూ పూర్తిగా ఏవో గుడ్డి దీపాల వెలుగులో ఉండిపోవాల్సి వచ్చేది..
"స్వామీ!..ఈ కరెంట్ కష్టాలు కడతేర్చు తండ్రీ..అల్లాడిపోతున్నాము.." అని మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి సమాధి వద్ద మొర పెట్టుకున్నాను..
నా వేదన శ్రీ స్వామివారికి అర్ధమైందో ఏమో..రెండురోజుల తరువాత..విద్యుత్ శాఖలో విజిలెన్స్ లో పనిచేసే అధికారి గారు..సబ్ స్టేషన్ కు పరిశీలన కోసం వచ్చారు..సాయంత్రం దాకా అక్కడే ఉండి.."ఇక్కడికి దగ్గరలో దత్తక్షేత్రం వున్నదని విన్నాను..నేను రాత్రికి ఆ క్షేత్రం లో నిద్ర చేయాలని నిర్ణయించుకున్నాను..ఏర్పాట్లు చేయండి.." అన్నారు..అక్కడున్న సిబ్బంది నాకు ఫోన్ చేసి..ఇలా తమ అధికారి గారు మందిరానికి వస్తున్నారని..రాత్రికి అక్కడే ఉంటారని చెప్పారు..
ఆరోజు రాత్రికి ఆ అధికారి గారు శ్రీ స్వామివారి మందిర మంటపం లోనే చాప వేసుకొని పడుకున్నారు..సుమారు రాత్రి 10 గంటలప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయింది..తెల్లవారిన దాకా పునరుద్ధరణ జరుగలేదు..ఆ రాత్రంతా ఆ అధికారి గారు చీకటి లోనే గడపాల్సి వచ్చింది..ఆయనకు విషయం అర్ధమైంది..తెల్లవారి సబ్ స్టేషన్ కు వెళ్లి..మందిరానికి నిరంతరమూ విద్యుత్ సరఫరా చేయాలంటే..ఏమి చేయాలో ఆలోచించి..ఒక పరిష్కారం కనుక్కుని..దానిని అమలుచేయమని సిబ్బందికి చెప్పారు...
తిరిగి వెళ్లిపోతూ..నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..అంతటి దత్తక్షేత్రం అలా గుడ్డి దీపాల వెలుగులో ఉండటం నచ్చలేదండీ..అతి త్వరలో ఆ క్షేత్రానికి నిరంతర విద్యుత్ సప్లై వచ్చే ఏర్పాటు చేయిస్తాను..మీ వద్దకు మా సిబ్బంది వస్తారు..వారితో మాట్లాడి..మీరు నిర్ణయం తీసుకోండి.." అన్నారు..నిరంతరమూ విద్యుత్ ఉంటుందంటే..అంతకంటే సంతోషం మరేముంటుంది?..
ఆ ప్రక్కరోజే..సబ్ స్టేషన్ నుంచి లైన్ మాన్ వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక అవకాశం వచ్చిందండీ..మన స్వామివారి మందిరానికి సమీపం లో 24 గంటలూ కరెంట్ వుండే లైన్ ఉన్నది..దానికి కానీ మందిరాన్ని అనుసంధానం చేస్తే..ఇక ఇబ్బంది ఉండదు..కాకుంటే లైన్ వేయడానికి మీరు ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించాలి.."అన్నారు..సరే అన్నాను..అనుకున్న విధంగానే పది పదిహేను రోజుల్లో శ్రీ స్వామివారి మందిరానికి నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పడింది..
అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..ప్రతి చిన్నవిషయం లోనూ శ్రీ స్వామివారి కృప ఎలా ప్రసరిస్తూ ఉంటుందో అని..కాకుంటే..ఆ అధికారి గారు వచ్చిన రోజే..అంతరాయం కలగడం..ఆయన ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకోవడం..కాలయాపన లేకుండా అమలు కావడం..అన్నీ చక చకా జరిగిపోవడం..ఇదంతా..ఏదో మాయ లా ఉన్నదే అని..అది మాయ కాదు..శ్రీ స్వామివారి నిర్ణయం..అంతే!..
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి