తులాపురుషదానం చేసేస్తారా ఏమిటి ? అలాగైతే ఎలా చేయాలో తెలుసుకోండి.
.....................................................
దానాలలో పదిరకాల దానాలు, షోడషమహా (16) దానాలున్నాయని మొన్నీమధ్యనే మీరు తెలుసుకొన్నారు కదా. షోడషమహాదానాల గురించి సంపూర్ణ వివరాలు పంపమని కొందరు జిజ్ఞాసతో అడిగారు వారి కోసం....
(1) తులాపురుషదానం > తుల అంటే తక్కెడ, త్రాసని పురుష అంటే వ్యక్తి అర్థమంతే. కాని పురుషుడంటే కేవలం మగవాడని కాదు. ఉద్యోగం పురుషలక్షణమంటే కేవలం మగవారు మాత్రమే కొలువులు చేయాలని కాదు. ఇక్కడ పురుష అనేమాటకు మనిషని, ఉద్యోగమనే మాటకు పని అని అర్థము చేసుకోవాలి.
ఇక తులాపురుషదానమంటే పుట్టిన రోజున, శత్రువుపై విజయం సాధించినరోజున, సంతానం కలిగినపుడు, పరలోకంలోని అమ్మానాన్నల, పితృదేవతల పుణ్యంకోసం, ఇంకా దేవుడు తాను కోరిన కోర్కెలు తీర్చినరోజున దేవాలయంలోని తులాభార మండపంలోనున్న కోరికలు తీరినవ్యక్తి తక్కెడలో ఒక సిబ్చెలో కూర్చుని మరొక సిబ్బెలో తనశక్తికొద్ది బంగారు ఆభరణాలో, బంగారు నాణ్యాలో*, వెండి ఆభరాలో, ఇంకా ఇప్పటి నాణేలను** కరెన్సిలనో,బియ్యం, బేడలు, బెల్లం,చక్కెర, పుస్తకాలు, నూతనవస్త్రాలు మొదలైనవి తనబరువుతో తూచి దేవుడికో పేదలకో దానం చెయ్యడం.
దీనినే తులాపురుషదానం అంటారు.తిరుమల మలయప్పస్వామి గుడిలో తులాభార కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి.
ప్రతిప్రాచీన దేవాలయంలోనూ పొడుగైన ఊయల మండపాలుంటాయి. కొందరు ఈ మంటపాలనే తులాభార మంటపాలని కూడా అంటారు.
* నాణేలను ( Coins) చాలా మంది నాణ్యాలని పలుకుతుంటారు. నాణ్యము అంటే మేలైనదని అర్థం కాబట్టి
** నాణెము, నాణేములు అని పలకాలి. మీరు పలకరు, పలకలేరు ఎందుకంటే ఆంగ్లమోజులోపడి హండ్రెడ్ రుపీస్ కు చేంజ్ వుందా అని అడుగుతారు.అలా అడిగినప్పుడల్లా తెలుగుతల్లి గుండెలో గుణపం గుచ్చినవారమైతాం.
ఆంగ్లంలో మాట్లాడి తెలుగుతల్లిని క్రూరహింసకు గురి చేస్తారో, తెలుగులోనే మాట్లాడి ఆమెను సంతోషింపచేస్తారో మీ ఇష్టం.
(2) హిరణ్యగర్భదానం > 75 చేతివేళ్ళ పొడవు, 48 చేతివేళ్ళ వెడల్పుతో ఒక బంగారు కుండను చేయించి, తిలలు కుప్పగా పోసి ఆ కుండను ఆ కుప్పపైనుంచాలి. దాత ఆ బంగారుకుండకు ఉత్తరాభిముఖంగా దాత ఆసీనుడై, చేతులలో బ్రహ్మ, ధర్మరాజు బంగారు విగ్రహాలు పట్టుకొని 5 సార్లు తలను మోకాళ్ళపై వుంచి ఊపిరి బిగబట్టి పైకి లేపాలి. ఇలా చేయడం వలన మాతృగర్భంలోని పిండాన్ని అనుసరించడమైతుంది.
తరువాత పురోహితుడు గర్భదాన పుంసవన సీమంత, యవన మంత్రములు చదువును. దాత కుండతోపాటు ప్రక్కకువచ్చును. పిమ్మట అన్నప్రాసన సంస్కారం జరుపుతారు. దాత హిరణ్యగర్భాన్ని (బంగారుకుండ) ఉద్దేశిస్తూ నేను తల్లిగర్భనుండి మర్త్యుడై జన్మించినాను, ఇపుడు హిరణ్యగర్భమున జనించినట్లైంది, అంటే నాకు దేవత్వం లభించిందని చెప్పి బంగారు ఆసనముపై కూర్చుని "దేవన్వత్వా'' అనే మంత్రాన్ని జపిస్తూ బంగారుకుండకు అభిషేకం చేసి, దానిని పురోహితునికో, గురువుకో, బ్రాహ్మణుడికో లేదా పేద మాలమాదిగలకో దానం చేస్తాడు.
(3) బ్రహ్మండదానం > బ్రహ్మండదానమంటే ఏమిటో తెలియదని నాకు మొన్ననే మనవి చేసుకొన్నా. ఐనా నా స్వబుద్ధికి తోచింది వివరిస్తా. అది ఒప్పయిన, తప్పయిన కావచ్చును.
" సమగ్రహారాన్ దతతోగ్రహారదానం కియద్యస్య వదాన్యమౌలే:
కింవా బ్రహ్మత్యఖిల విశ్వచక్ర బ్రహ్మాంశ దాతు: కిమ దేయస్తు"
పై శ్లోకంలో 1505 ACE లో ఇమ్మడిదేవరాయలు బ్రహ్మండ దానాన్ని చేశాడు. శాసనశ్లోకంలో అగ్రహార ప్రస్తావనలున్నాయి కనుక బ్రహ్మండమంటే అగ్రహారదానమని నా భావన.
పైగా బ్రహ్మండమంటే విశాలవిశ్వం, భూమి అనికూడా అర్థము కదా ! కాబట్టి శాస్త్రోక్తంగా భూమిని దానం చేయడమని నా అభిప్రాయం.
(4) కల్పవృక్షదానం > బంగారుతో ఒక చెట్టును తయారుచేసి పూజాధి కార్యక్రమాలు నిర్వహించి అర్హులకు దానం చేసి పాపవిముక్తం కావడమనుకొంటాను. బంగారుతో నిర్మించిన వృక్షం కనుక కల్పవృక్షమైంది.
(5) సహస్రధేనుదానం > సహస్ర అంటే వేయి, ధేను అంటే గోవు. వేయి గోవులను దానం చేయడం.నా ప్రకారం వేయి + పదహారు > వేయిన్ని పదహారు కనకగోవులను తయారు చేయించి, పీఠముపై వాటిని అధిష్టింపచేసి, సచేల స్నానానంతరం పూజప్రార్థన హోమాది కార్యక్రమాలు నిర్వహించి వాటికి క్షిరాభిషేకం చేయించి 1016మంది బ్రాహ్మణపురోహితశుద్ర చండాలురకు ఆ బంగారుగోవులను దానం చేయడం.
(6) హిరణ్యకామధేనుమహాదానం > హిరణ్యమంటే బంగారం.ధేనువంటే గోవు. ఇది కూడా ఇంచుమించు పైదానిలాంటిదేనని నా అభిప్రాయం. కాకపోతే పూజాదిక్రతువులు వేరువేరుగా వుండవచ్చును.
(7) హిరణ్యాశ్వ > బంగారుతో చేసిన ఉత్తమాశ్వాలను దానం చేయడం. యుద్ధసమయంలో గుర్రం పాత్ర ఎంతో ముఖ్యమైనది. పోరులో తనకు చెందిన ఉత్తమ అశ్వాన్ని కోల్పోయినపుడు ఏ రాజో మహమండలేశ్వరుడో, దండనాయకుడో ఆ గుర్రానికి కూడా ఉత్తమగతులు సంప్రాప్తించాలని చేసే దానమని నా ఊహ.
(8) హిరణ్యరథదానం > బంగారంతో దేవుడి రథాన్ని తయారుచేయించి, దానిని ఊరేగించి తన ఇలవేలుపు కొలువుదీరిన దేవాలయానికి దానం చేయడమేమోనని నా అభిప్రాయం.
(మిగతా ఎనిమిది దానాలగురించి తరువాత)
............................................................................................................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి