5, సెప్టెంబర్ 2021, ఆదివారం

*రేపే పోలాల అమావాస్య

 *రేపే పోలాల అమావాస్య!*


శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు "పోలాల అమావాస్య" వ్రతం ఆచరిస్తారు. ఇది ప్రాంతాచారం. గృహాచారం ఉన్నవారు చేసే వ్రతం.


పోలాల అమావాస్య పూజా విధానం:


పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. (కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.)

తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).అనంతరం ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి.


సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు, గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు. 


ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.


మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.

కామెంట్‌లు లేవు: