25, అక్టోబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *24.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*


*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*18.17 (పదిహేడవ శ్లోకము)*


*మౌనానీహానిలాయామా దండా వాగ్దేహచేతసామ్|*


*న హ్యేతే యస్య సంత్యంగ వేణుభిర్న భవేద్యతిః॥12929॥*


ఉద్ధవా! మౌనము వాక్కునకు సంబంధించిన దండము, కామన (కోర్కెల) దేహమునకు సంబంధించిన దండము. ప్రాణాయామము మనస్సునకు సంబంధించిన దండము. ఈ మూడుదండములును లేకుండా కేవలము వెదురు కర్రలను ధరించినవాడు యతి కాజాలడు.


*18.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*భిక్షాం చతుర్షు వర్ణేషు విగర్హ్యాన్ వర్జయంశ్చరేత్|*


*సప్తాగారానసంకౢప్తాంస్తుష్యేల్లబ్ధేన తావతా॥12930॥*


సన్న్యాసి నిందితులను, పతితులను వర్జించి (స్వవర్ణములనుండి పతనమైనవారిని, గోఘాతకులను వర్జింపవలెను), నాలుగు వర్ణములవారి గృహములనుండియు భిక్షను స్వీకరింపవచ్చును. 


*'పూర్వవర్ణేషు భిక్షాయాః అలాభే ఉత్తరోత్తర వర్ణానుమతిః' ఇతి కేచిత్ వ్యాచక్షతే - ప్రాణాత్యయదశాయమేవ వర్ణాంతర భిక్షానుమతిః ఇతియుక్తమ్* (వీరరాఘవీయ వ్యాఖ్య)


ఏడు గృహముల నుండియే భిక్షను గైకొనవలెను. ఆ ఏడు గృహములును ముందుగా నిర్దేశింపబడకూడదు. భిక్షతో లభించినదానితోడనే సంతృప్తి చెందవలెను.


*18.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*బహిర్జలాశయం గత్వా తత్రోపస్పృశ్య వాగ్యతః|*


*విభజ్య పావితం శేషం భుంజీతాశేషమాహృతమ్॥12931॥*


పిమ్మట సన్న్యాసి గ్రామమునకు వెలుపలగల జలాశయము కడకు వెళ్ళి, కాళ్ళను, చేతులను కడుగుకొని ఆచమించి, భిక్షాన్నములను జలముతో ప్రోక్షించి, మౌనముగా దానిని విభజించి, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలకు సమర్పించిన పిదప, మిగిలినదానిని (రాత్రిపూట కొఱకు మిగల్చక) పూర్తిగా భుజించవలెను.


*18.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఏకశ్చరేన్మహీమేతాం నిఃసంగః సంయతేంద్రియః|*


*ఆత్మక్రీడ ఆత్మరత ఆత్మవాన్ సమదర్శనః॥12932॥*


సన్న్యాసి దేనియందును ఆసక్తి లేనివాడై, జితేంద్రియుడై ఒంటరిగా సంచరింపవలెను. ఆత్మానందరతుడై, ఎట్టి పరిస్థితులలోను తొణకక సమదర్శనుడై యుండవలెను. అనగా అంతటను పరమాత్మనే దర్శించుచు ఉండవలెను.


*18.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*వివిక్తక్షేమశరణో మామద్భావవిమలాశయః|*


*ఆత్మానం చింతయేదేకమభేదేన మయా మునిః॥12933॥*


అతడు నిర్జనమైన నిర్భయ (క్రూరమృగములవలన ప్రమాదము లేనట్టి) పవిత్ర ప్రదేశమున నివసింపవలెను. అతని హృదయము నిర్మలమై, నా భావముతో (భగవద్భావనతో) నిండియుండలెను. తన ఆత్మను నాకంటె వేరుగాగాక అభేదభావముతో ధ్యానించు చుండవలెను.


*18.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*అన్వీక్షేతాత్మనో బంధం మోక్షం చ జ్ఞాననిష్ఠయా|*


*బంధ ఇంద్రియవిక్షేపో మోక్ష ఏషాం చ సంయమః॥12934॥*


'ఇంద్రియములకు వశమై యుండుట బంధహేతువు, సంయమనమే మోక్షదాయకము' అను తత్త్వవిచారముచేసి, సన్న్యాసి బంధములకు అతీతమైన మోక్షము కొరకు చింతించుచుండవలెను.


*18.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తస్మాన్నియమ్య షడ్వర్గం మద్భావేన చరేన్మునిః|*


*విరక్తః క్షుద్రకామేభ్యో లబ్ధ్వాఽఽత్మని సుఖం మహత్॥12935॥*


అందువలన అతడు మనస్సును, పంచజ్ఞానేంద్రియములను (షడ్వర్గమును) అదుపులో నుంచుకొనవలయును. విరక్తుడై క్షుద్రభోగములకు దూరముగా ఉండవలయును. ఆత్మానందమును అనుభవించుచు నా భావముతో (మనస్సులో నన్నే ధ్యానించుచు) చరించుచుండవలెను.


*18.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*పురగ్రామవ్రజాన్ సార్థాన్ భిక్షార్థం ప్రవిశంశ్చరేత్|*


*పుణ్యదేశసరిచ్ఛైలవనాశ్రమవతీం మహీమ్॥12936॥*


నదులు, పర్వతములు, వనములు, ఆశ్రమములుగల పవిత్ర ప్రదేశములలో సంచరించుచుండ వలయును. కేవలము భిక్షకొఱకు మాత్రమే నగరములయందును, గ్రామములయందును, గోష్ఠములుగల ప్రదేశములయందును, సాత్త్వికజనులు నివసించు స్థానములయందును ప్రవేశింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: