ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
-----------------------
4. ఆర్థిక,వాణిజ్య విషయాలు
ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ గుండెకాయ వంటిది.
సుఖసంతోషాలతో కూడిన ప్రజాజీవనం అనేది ఆ దేశ
- భౌతిక వనరుల లభ్యతా, వాటిని ఉపయోగించుకొనే తీరుపైనా,
- ఆర్థిక విధానాలమీదా ఆధారపడి ఉంటుంది.
రామాయణం - ఆర్ధిక, వాణిజ్య సంబంధాలు
శ్రీమద్రామాయణంలో ఈ విషయానికి సంబంధించి,
- ప్రధానంగా అయోధ్య భూ సంపద వినియోగం,
- నిల్వలు,
- పశుసంపద,
- వివిధ ప్రాంతాలమధ్య పంపిణీకి చెందిన వ్యాపార వ్యవస్థ వంటి విషయాలపై సరియైన దృష్టి,
- విదేశీ వాణిజ్య ఆదాయమూ,
- ప్రజల సుఖసంపదలకి దారితీస్తుందని చూపుతూ,
ఆదర్శ ఆర్థిక సమాజాన్ని అందిస్తుంది.
అ) సహజ వనరులు
అయోధ్య
- నదీ జలాల సౌకర్యంతో,
- కేవలం వర్షంమీద మాత్రమే ఆధారపడనిదీ/పంటలు పండించేదీ/ చక్కగా దున్నిన భూములు గలదీ,
- సస్య శ్యామలమూ,
- వివిధ ఖనిజ సంపదలకు కాణాచీ,
- బావులలో నీరు చెఱకు రసంవలే ఉండేదీ అయోధ్య.
ఆ) వనరుల వినియోగ ఫలం
అయోధ్య
- పశు సమృద్ధి కలదీ,
- చక్కని నివాసాలు ఏర్పరచుకున్న జనులతో నిండినదీ,
- సర్వసమృద్ధమై ఆనందిస్తున్నదీ,
- హింసలేనిదైన రాజ్యం.
- ప్రతీ ఇంటా ధాన్య సమృద్ధి కలిగినదీ,
ఇ) నిల్వలు
దుర్గాలు అన్నిటా ధనధాన్యాలు వగైరా కావలసినంత నిల్వలు ఉండేవి - అనే విషయం ద్వారా పాలకుల "ముందుచూపు" కనబడుతుంది.
ఈ) వ్యవసాయం - వ్యాపారం - సంపద
జనులందరూ కృషి గోరక్షణాలపై ఆధారపడియుంటారు.
క్రయ విక్రయాది వ్యాపారాలవృద్ధి వలననే దేశం సుఖసంతోషాలతో వర్ధిల్లింది.
వ్యాపారులకెదురైన ఆపదలని నివారించి రాజులు రక్షించేవారని పేర్కొనబడింది.
అటువంటి సమయంలో వ్యవసాయ, పశుపాలన, వాణిజ్యం మొదలైన వృత్తులతో జీవించే వ్యాపారులు - రాజుకు అనుకూలురై, ప్రీతిపాత్రులై యుండేవారట.
అయోధ్యలో రాజూ, వ్యాపారులూ ధర్మబద్ధులని చెప్పడం ద్వారా, దోపిడీవ్వవస్థ లేదని తెలుస్తుంది.
ఉ) ఆదాయ - వ్యయాలు
రాజ్యాదాయం పుష్కలంగా ఉండాలి.
ప్రజలనుంచీ వారి ఆదాయంలో ఆరవవంతు పన్నుగా వసూలుచేసి, ప్రజలను రక్షించాలి.
కోశానికి చెందిన ధనమూ, ఆదాయానికి లోబడి పరిమిత వ్యయమూ చేయాలి.
ఖజానా చేరిన ధనం అపాత్రులకై వినియోగించకూడదు.
కోశాగారమందలి ధనం సక్రమంగా వినియోగించాలని విశదపరచబడింది.
ఊ) విదేశీ వ్యాపారం
క్రయవిక్రయాదులకై ఏతెంచెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అయోధ్య క్రిక్కిరిసి ఉండేదనే విషయం - విదేశీ వాణిజ్యం గూర్చి తెలుపుతుంది.
ఋ) నిర్మూలించబడిన పేదరికం
ఆకలితో అలమటించేవారు ఒక్కరుకూడాలేక,
అందఱూ తనివితీరా భుజించేవారై,
అతిథి అభ్యాగతులను ఆదరిస్తూండేవారట.
ఋూ) వ్యక్తిగత సంపద
గృహస్థులలో ఏ ఒక్కరూ సంపన్నుడుకానివాడుకానీ,
గో - అశ్వ - ధన - ధాన్య సమృద్ధి లేనివాడుగానీ,
తన సంపదకు తగినట్లుగా భాగములను అనుభవింపనివాడుగానీ, లేనేలేరట.
భూమి నుంచీ పంటనీ, ఖనిజాలనీ,
పశు సంపద నుంచీ పాడినీ,
వాణిజ్యం, పన్నుల వసూలు నుంచీ దేశాభివృద్ధినీ కలిగి,
సక్రమ పంపిణీ వ్యవస్థ ద్వారా వాటిని ప్రజలు సుఖసంతోషాలతో, ధర్మబద్ధంగా అనుభవించే
- ఆదర్శ ఆర్థిక వాణిజ్య విధానం అయోధ్యలో ఉండేదని తెలుస్తుంది.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి