25, అక్టోబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *24.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*


*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*18.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*వానప్రస్థాశ్రమపదేష్వభీక్ష్ణం భైక్ష్యమాచరేత్|*


*సంసిధ్యత్యాశ్వసమ్మోహః శుద్ధసత్త్వః శిలాంధసా॥12937॥*


వానప్రస్థులు ఉంఛవృత్తితోడను, వనములలో లభించెడి కందమూలఫలాదులను స్వీకరించుచు జీవించుచుందురు. సన్న్యాసి తఱచుగా వానప్రస్థుల ఆశ్రమములయందే భిక్షను స్వీకరించుచుండవలెను. తత్ప్రభావమున (ఆ సాత్త్వికాహార ప్రభావముచే) సత్త్వ శుద్ధి ఏర్పడును. జిహ్వచాపల్యాది మోహము నశించును.


*18.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*నైతద్వస్తుతయా పశ్యేద్దృశ్యమానం వినశ్యతి|*


*అసక్తచిత్తో విరమేదిహాముత్ర చికీర్షితాత్॥12938॥*


శబ్దాది విషయములతో గూడిన ఈ దృశ్యమాన జగత్తు అంతయు నశించునదియే గావున, దానిని సత్యమని భావింపరాదు. అందువలన సన్న్యాసి దానిపై ఆసక్తిని కలిగియుండరాదు. లౌకిక పారలౌకిక, కామ్యకర్మల నుండియు వైదొలగి విరక్తుడై యుండవలెను.


*18.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*యదేతదాత్మని జగన్మనోవాక్ప్రాణసంహతమ్|*


*సర్వం మాయేతి తర్కేణ స్వస్థస్త్యక్త్వా న తత్స్మరేత్॥12939॥*


వాక్కు మొదలగు కర్మేంద్రియములతోను, మనస్సుతో గూడిన జ్ఞానేంద్రియములతోను, పంచమహాభూతములతో ఒప్పెడి ప్రాణేంద్రియములతో గూడిన ఈ శరీరము మాయయే అని (ప్రకృతి పరిణామాత్మకమే అని) భావించి శరీరమునందు ఆత్మాభిమానమును త్యజింపవలెను. పిమ్మట 'ఆత్మయొక్క నిజస్వరూపము బ్రహ్మాత్మకము' అను భావముతో శాంతుడై యుండవలెను.


*18.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*జ్ఞాననిష్ఠో విరక్తో వా మద్భక్తో వానపేక్షకః|*


*సలింగానాశ్రమాంస్త్యక్త్వా చరేదవిధిగోచరః॥12940॥*


జ్ఞాననిష్ఠుడై, విరక్తుడై, దేనియందును అపేక్షలేని నా భక్తునకు సన్న్యాస చిహ్నములైన దండము మొదలగు వానితో పనిలేదు. అతనికి ఎట్టి విధినిషేధములును ఉండవు. దైవభక్తిప్రపూర్ణుడై యుండుటయే ముఖ్యము.


*18.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*బుధో బాలకవత్క్రీడేత్కుశలో జడవచ్చరేత్|*


*వదేదున్మత్తవద్విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్॥12941॥*


దేహాత్మాభిమానరహితుడైన నా భక్తుడు వివేకియైనను బాలునివలె మానావమానరహితుడై చరింపవలెను. నిపుణుడైనను జడునివలెను, విద్వాంసుడైనను ఉన్మత్తునివలెను, వేదార్థ నిష్ఠుడైనను అజ్ఞునివలెను ప్రవర్తింపవలెను.


*18.30 (ముప్పదియవ శ్లోకము)*


*వేదవాదరతో న స్యాన్న పాఖండీ న హైతుకః|*


*శుష్కవాదవివాదే న కంచిత్పక్షం సమాశ్రయేత్॥12942॥*


నా ఈ భక్తుడు వేదపూర్వ భాగము నందలి కర్మకాండయందు రక్తుడు కారాదు. పాషండుడు (వేదవిరుద్ధమైన ప్రవర్తనగలవాడు) కారాదు. కుతర్కములకు దూరముగా ఉండవలెను. శుష్కములైన వాదవివాదములు జరుగుచున్నప్పుడు ఏ పక్షమునూ వహింపరాదు.


*18.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*నోద్విజేత జనాద్ధీరో జనం చోద్వేజయేన్న తు|*


*అతివాదాంస్తితిక్షేత నావమన్యేత కంచన|*


*దేహముద్దిశ్య పశువద్వైరం కుర్యాన్న కేనచిత్॥12943॥*


భక్తుడు జనులను (ఎవ్వరినీ) ఉద్వేగపరచరాదు, ఎవరివలనను ఉద్వేజితుడు కారాదు. దురుక్తములను (ఎవ్వరైనను నిందించినను) సహింపవలెను. ఎవ్వరినీ అవమానింపరాదు. తన శరీరసుఖముకొరకు ఇతరులపై అసూయపడరాదు. దేహాభిమానముతో పశువువలె ఎవరినీ ద్వేషింపకూడదు. అనగా అందరిపట్ల భగవద్ బుద్ధిని కలిగియుండవలెను.


*18.32 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఏక ఏవ పరో హ్యాత్మా భూతేష్వాత్మన్యవస్థితః|*


*యథేందురుదపాత్రేషు భూతాన్యేకాత్మకాని చ॥12944॥*


చంద్రుని బింబము వివిధ పాత్రలలో వేర్వేరుగా కనబడుచున్నను చంద్రుడు ఒక్కడే. అట్లే పంచభూతాత్మకములైన వివిధ శరీరములలోను ఆత్మస్వరూపమున వెలుగొందుచున్న పరమాత్మ ఒక్కడే. కనుక ఇతరులను ఎవ్వరిని ద్వేషించిననూ తనను తానే ద్వేషించినట్లగును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: