*25.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*
*వానప్రస్థ - సన్న్యాసాశ్రమముల ధర్మములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*18.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*అలబ్ధ్వా న విషీదేత కాలే కాలేఽశనం క్వచిత్|*
*లబ్ధ్వా న హృష్యేద్ధృతిమానుభయం దైవతంత్రితమ్॥12945॥*
ఎప్పుడైనను ఆహారము లభింపకున్నను సన్న్యాసి దుఃఖపడరాదు. అట్లే నిత్యము భిక్షలభించుచున్నను పొంగిపోరాదు. భిక్షప్రాప్తించుట, ప్రాప్తించకుండుట అను రెండును దైవికములు. కావున అన్ని పరిస్థితులలో ధైర్యముగా (తొణకక) ఉండవలెను.
*18.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*ఆహారార్థం సమీహేత యుక్తం తత్ప్రాణధారణమ్|*
*తత్త్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే॥12946॥*
సన్న్యాసి ప్రాణరక్షణకై ఆహారముకొరకు (భిక్షకొఱకు) శ్రమపడియైనను యత్నింపవలెను. తత్త్వజ్ఞాన సముపార్జనకొఱకు ప్రాణములు ఉండితీరవలెను. తత్త్వజ్ఞానమువలన మోక్షము లభించును.
*18.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*యదృచ్ఛయోపపన్నాన్నమద్యాచ్ఛ్రేష్ఠముతాపరమ్|*
*తథా వాసస్తథా శయ్యాం ప్రాప్తం ప్రాప్తం భజేన్మునిః॥12947॥*
సన్న్యాసి దైవికముగా లభించిన భిక్షాన్నము శ్రేష్ఠమైనదియైనను, కాకున్నను దానినే భుజించి తృప్తిపడవలెను. అట్లే వస్త్రముగాని, శయ్యగాని దొరకినదానితో తృప్తి చెందవలెను. అవి శ్రేష్ఠములైనను, తదితరములైనను పట్టించుకొనరాదు.
*18.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*శౌచమాచమనం స్నానం న తు చోదనయా చరేత్|*
*అన్యాంశ్చ నియమాంజ్ఞానీ యథాహం లీలయేశ్వరః॥12948॥*
జ్ఞాని *శౌచ-ఆచమన-స్నానాది కర్మలను* ఇవి విధ్యుక్తములు - అను భావనతోగాక సహజముగా చేయవలెను. ఇతర నియమములనుగూడ విధివచనములకు అధీనుడుగాక నావలె లీలగా ఆచరింపవలెను.
*18.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*న హి తస్య వికల్పాఖ్యా యా చ మద్వీక్షయా హతా|*
*ఆదేహాంతాత్క్వచిత్ఖ్యాతిస్తతః సంపద్యతే మయా॥12949॥*
జ్ఞాని పరమాత్ముడనైన నన్నే సర్వత్ర దర్శించుచుండును. కనుక అతనిలో వైకల్పికమగు నానాత్వభ్రమకు తావేలేదు. ఒకవేళ దేహావసాన సమయమునందు శారీరక క్లేశముల కారణముగా అట్టి ప్రతీతి కలిగినను నా సాక్షాత్కారము కలిగినందున దేహము నశించినప్పుడు అతడు నన్నే చేరును.
*18.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*దుఃఖోదర్కేషు కామేషు జాతనిర్వేద ఆత్మవాన్|*
*అజిజ్ఞాసితమద్ధర్మో గురుం మునిముపవ్రజేత్॥12950॥*
*18.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*తావత్పరిచరేద్భక్తః శ్రద్ధావాననసూయకః|*
*యావద్బ్రహ్మ విజానీయాన్మామేవ గురుమాదృతః॥12951॥*
ఉద్ధవా! జితేంద్రియుడు 'సాంసారిక భోగములయొక్క పర్వవసాన ఫలములు అన్నియును దుఃఖకారకములే' అని నిశ్చయించుకొని విరక్తుడగును. కానీ, వాటినుండి బయటపడి, నన్ను చేరెడి ఉపాయము అతనికి తెలియనప్పుడు, మనన శీలుడు, బ్రహ్మనిష్ఠాపరుడు ఐన గురువును ఆశ్రయింపవలెను. అతడు గురువునెడ దృఢమైన భక్తిశ్రద్ధలు, విశ్వాసము కలిగియుండవలెను. ఆయనలో ఎట్టిదోషములనూ ఎన్నరాదు.అనగా మానవ సహజమైన దోషదృష్టితో ఆయనను చూడరాదు. బ్రహ్మజ్ఞానము కలుగునంతవరకును ఆయనను నన్నుగా (దైవముగా) భావించి, సాదరముగా సేవింపవలెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి