11, డిసెంబర్ 2021, శనివారం

మల్లెచెట్టు మహావృక్షమైతుందా !

 మల్లెచెట్టు మహావృక్షమైతుందా !

.....................................................................


సోమన దాక్షారామ సమీపంలోని వేములవాడ అగ్రహారంలో జీవించేవాడు. ఇతను సకలశాస్త్రపారంగతుడు, పండితుడు కాని పూటగడవని నిరుపేద. అతనిభార్య ఉత్తమఇల్లాలు భారతరామాయణాలు శివపురాణాలు చదువుకొంది.ఈమెకు సంగీతంలో ప్రవేశంవుంది. విధిబలీయమైనది.సంతానయోగం లేకనే చిన్నవయసులోనే సోమన అనారోగ్యంపాలై మరణించాడు.భర్త మరణాంతరం భార్య ఉదరపోషణార్థం సాటిబ్రాహ్మణులలో ఇండ్లలో పిల్లలకు రామాయణభారతభాగవత శివపురాణ ఇతిహాసాలను చెప్పుకొంటూ వారికి పాటలు పద్యాలు నేర్పిస్తూ వుండేది.


ఒకసారి శివరాత్రిపర్వదినాన వేములవాడ గ్రామమహిళలు కొందరు దాక్షారామంలోని భీమేశ్వరస్వామిని దర్శించుకోటానికి వెళ్ళారు.సోమన భార్య కూడా వారితోపాటు భీమేశ్వరదర్శనానికి వెళ్లింది. ముత్తయిదువులలో కొందరు సోమనభార్య వయసువారు, కాని నిస్సంతులు తమకు సంతానం కలగాలని వారు పార్వతీనాథుని వేడుకొన్నారు. సోమనభార్యను చూచి నువ్వు కూడా ఏదైనా వరం కోరుకోమని సరదాగా ఆటపట్టించారు. నాక్కూడా కడుపుపండితే పుట్టెడు నీళ్ళతో దీపారాధాన చేయిస్తానని మొక్కుకొంది. ఆమె కోరిక విని భర్తలేని నీకు పిల్లలెలా కలుగుతారని అందరూ పక్కున నవ్వారు. సోమనభార్య కూడా నవ్వింది. ఊరికి వెళ్లిన తరువాత ఎవరి సంసారంలో వారు పడి తాము భీమేశ్వరదేవుని కోరిన కోర్కెలు మరచిపోయారు.


కాని దేవుడి మహిమలు విచిత్రమైనవి. కొన్నాళ్ళకు సోమనభార్యకు చూలు నిలిచింది. ముండ యాగటైందని ఇంట్లోవారు ఊర్లోవారు బుగ్గలు నొక్కుకున్నారు. ఆమెమాత్రం వేములవాడ భీమలింగేశ్వరుని మీద భారంవేసి ఏం జరిగితే అదే జరగనీ అని ఊరకనే వుండిపోయింది. ఒక శుభముహుర్తాన పండంటి మగబిడ్దకు జన్మనిచ్చింది.దాంతో అగ్రహారీకులలో కొందరు ఆమెను దూరం పెట్టేశారు. అయినా ఆమె వెరవక బాలుడిని పెంచసాగింది.వేములవాడ భీమేశ్వరదేవర వరప్రసాదం కాబట్టి బాలునికి భీమన అనేపేరు పెట్టింది.


బాలుడు పెరిగి పెద్దవాడు కాసాగాడు. తల్లి దగ్గరే విద్యాబుద్ధులు నేర్చుకోసాగాడు. భీమన ఒకరోజున తోటి పిల్లలతో ఆడుకొనేటందుకు వీధిలోకి వెళ్ళాడు. నీకు నాన్నలేడు నువ్ ముండకొడుకంటూ భీమనను ఎగతాళిచేశారు. భీమనకు ఏడుపొచ్చింది, తండ్రెవరో తెలుసుకోవాలని తల్లిదగ్గరకు పరుగిడిపోయాడు. తన తండ్రెవరంటూ తల్లిని నిలదీశాడు.


తల్లికి ఏం చెప్పాలో తోచక, వేములవాడ భీమేశ్వర నీతండ్రని చెప్పింది. భీమన క్షణం ఆలస్యం చేయకుండా భీమేశ్వరాలయం చేరి, శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని నాన్నానాన్నా అంటూ గట్టిగా పిలవసాగాడు. అలా ఎంతసేపు పిలిచాడో కాని భక్తవరశంకరుడు బాలుని ముందు ప్రత్యక్షమై నాయనా నీవు నా వరప్రసాదవి. ఈ సంగతి అందరికి చెప్పు ఇకనుండి నిన్ను ఎవరు అనరు. నీకు చక్కని నోటివాక్కును ప్రసాదిస్తున్న నిన్ను ఎగతాళి చేసిన వారిపట్ల నువ్ ఏమంటే అది ఫలిస్తుందంటూ చెప్పి, అంతేకాదు ఇకనుండి నువ్వాడిందే ఆట నువ్ పాడిందేపాట ఆవుతుందంటూఆశీర్వదించాడు. భీమన నాటినుండి భీమేశ్వరుడిగా మారిపోయాడు.


బాలుడు సంతోషంతో ఊరిని చేరుకొన్నాడు. ఊర్లో బ్రాహ్మణ అన్నసంతర్పణ జరుగుతోంది. ఆకలిగా వుంటే వెళ్ళి బంతిలో కూచోబోయాడు. వడ్డించేవారు ఛీదరించుకొని విధవ కొడుకును ఎవడ్రా లోపలికి రానించిందంటూ కేకలు వేశారు.భీమనకు కోపం వచ్చింది, పందిరిలోని అన్నమంతా సున్నం, అప్పాలు - కప్పలు కావాలంటూ శపించాడు. అంతే విస్తరాకులలోని అన్నం సున్నంగాను అత్తిరసాలు/అప్పాలు కప్పలుగాను మారిపోయాయి. అన్నసంతర్పణ నిర్వాహంకులు లబోదిబోమన్నారు. భీమనతో క్షమాపణలు అడిగారు, భీమన శాంతించి సున్నమంతా అన్నంగాను, కప్పలన్ని అప్పాలుగాను మారాలని కోరుకొన్నాడు. అవన్ని అంతలోనే అన్నంగాను అప్పాలుగా మారిపోయాయి. వారా బాలుడిని అన్నబంతిలో కూర్చోబెట్టి అతనికేమేమి కావాలో అన్ని దగ్గరుండి వడ్డించారు.


ఆ బాలుడు పెరిగిపెద్దవాడైనాడు, తండ్రిలాగా సకలశాస్త్రాలు నేర్చి సంస్కృతాంధ్రభాషలలో గొప్పకవిగా రాణించాడు. నోటి వాక్కుతో ఎన్నో అద్భుతాలు చూపాడు.


ఒకసారి భీమలింగకవి రాజైన చొక్కభూపాలుని అస్థానానికి వెళ్ళాడు. రాజుతోపాటుగా ఉద్యానవనంలో విహరించాడు. రాజు ఒక తిన్నెపై కూర్చుని ఒక కాలును మల్లెచెట్టు కొమ్మపై వుంచి కూర్చున్నాడు. మహాకవి నీ నోటిమాట ఫలిస్తుందని అందరూ అంటారుగా ఏది ఈ మల్లెచెట్టును మహావృక్షంగా మార్చుచూద్దామన్నాడు. రాజు తనను తనను పరీక్షించాలని అనుకొంటున్నాడని భీమలింగకవి కింది పద్యాన్ని ఆశువుగా చెప్పాడు.


శా॥ ఆనీతాభ్యుపదానళృంఖలపదాభ్యాలంబితస్తంభమా !

నేనే వేములవాడ భీమకవినేనిజిత్రకూటంబులో

భూనవ్యాపితపల్లవోద్భవమహాపష్పోపగుచ్చంబులన్

నానాపక్వఫలప్రదాయి వగుమా నాకల్పవృక్షాకృతిన్.


అంతే చూస్తుండగానే ఆ మల్లెచెట్టు శాఖోపశాఖలుగా పెరిగి, మహవృక్షమైపోయింది. ఆ చెట్టు మొదట్లో రాజు కాలు ఇరుక్కుపోయింది. రాజు బాధతో అల్లాడిపోయి, ఆ పెద్దచెట్టును మామూలు మల్లెచెట్టుగా చేయమని కవిని ప్రార్థించాడు.


భీమకవి చిరునవ్వుతో కింది పద్యం చెప్పాడు.


ఉ॥

శంభువరప్రసాదకవిసంఘవరేణ్యుఁడ నైన నావచో

గుంభన చేయ నెంతొ యనుకూలత నొంది తనూనభావనన్

గుంభినజొక్క నామనృపకుంజరుపందిటిమల్లెసాలకున్

స్తంభమురీతి నీతనువుఁ దాలిచి యెప్పటియట్ల యుండుమా!


అశ్ఛర్యంగా అంత పెద్దచెట్టు పద్యం పూర్తైయ్యేలోపుగా పూర్వపు మల్లెచెట్టుగా మారిపోయింది. రాజు బ్రతుకు జీవుడా అంటూ మల్లెపొదలోనుండి కాలును బయటకు తీసేసుకొని కవికి నమస్కరించాడు.

.................................................................................. జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: