11, మార్చి 2022, శుక్రవారం

*ధర్మ నిష్ఠ*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*ధర్మ నిష్ఠ* 


రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది?      రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?


కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు.


నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత "ధర్మాచరణం".


ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’ అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి.


ఇందులోని విచిత్రమేమిటంటే  ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.


తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక   "అస్త్ర శస్త్రాలను"   కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.


అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.


*ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  | |*

 

*అని ఉపనిషద్వాక్యం.*


ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము ,   వేదశాస్త్రముల అధ్యనము,    శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట,  అంతరింద్రియ నిగ్రహము,  దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే.


దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు.  మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.


కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు.


అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు.  కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".


 ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు.

కామెంట్‌లు లేవు: