జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి ఆశీస్సులతో ......
ఆది శంకరులు, వారి మొదటి ప్రయాణం కేరళలోని కాలడి నుండి ప్రారంభమై కాలినడకన మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డు వరకు దాదాపు 1700 కిలోమీటర్ల ప్రయాణము సాగింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు ఎక్స్‌ప్రెస్ హైవేలు కలిగిన ఈ రోజులలో అయితే, రోడ్డు మార్గం ద్వారా వాహనంపై ప్రయాణించడానికి దాదాపు 36 గంటల సమయం పడుతుంది. దట్టమైన అడవుల గుండా నడిచిన ఆ ప్రయాణం, శ్రీ శంకరుని కాలంలో ఎంత సమయం పట్టిందో ఒక్క సారి ఆలోచించాలి. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని, హైందవ ధర్మాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంత వేత్త ఆది శంకరాచార్యులు.
నర్మదా నది ఒడ్డున, శ్రీ శంకరులు తొలుత తమ గురువైన శ్రీ గోవింద భగవత్పాదుల దర్శనం పొంది, గురువుల నుండి పరంపరాగత క్రమ సన్యాసం స్వీకరించి, వారి వద్ద శాస్త్రాలను అభ్యసించినారు. పన్నెండేళ్ల వయస్సులోనే, వారు అన్ని శాస్త్రములను అధ్యయనం గావించి, ఉపనిషత్తులలో ప్రకటించిన విధంగా అద్వైత సిద్ధాంతం లో నిమగ్నమైనారు. పదహారేళ్ల వయస్సులో, వారు బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీతలకు భాష్యాలు వ్రాసినారు. వీటిని ప్రస్థానత్రయం అని పిలుస్తారు. వేదాంత, పురాణేతి హాసాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడే అనేక ప్రకరణ గ్రంధములను, మరియు మనిషిని భక్తి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడే వివిధ స్తోత్రములను రచించినారు.
భక్తులను అనుగ్రహించడానికి విష్ణువు, శివుడు, అమ్మవారు మొదలైన వివిధ రూపాలలో వ్యక్తమయ్యే పరమాత్మ ఒక్కడే అన్న వేదాంత సూత్రాన్ని ఉటంకిస్తూ, బలపరుస్తూ, సమాజంలోని వివిధ వర్గాలను ఏకం చేయడానికి శ్రీ శంకరాచార్యుల వారు కృషి చేసినారు.
మన దేశం నలువైపులా మూడుసార్లు, కాలినడకన ప్రయాణించి, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిచోటా ప్రచారం చేశినారు. ధర్మం మరియు వేదాంత సూత్రములను సదా ప్రజలకు అందుబాటలో వుంచడానికి మరియు అద్వైత వేదాంత వ్యాప్తికి అనుగుణంగా వారు భారతదేశంలోని నలుదిశల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠములను స్థాపించినారు. మఠ-ఆమ్నాయ స్తోత్రంలో ఇలా చెప్పబడింది:
చతుర్దిక్షు ప్రసిద్ధాసు ప్రసిద్ధ్యర్థం స్వనామతః ।
చతురోsథ్ మఠాన్ కృత్వా శిష్యాంశస్థాపయద్విభుః |॥ 1 ॥
చకార సంజ్ఞామాచార్యశ్చతురాం నామభేదతః ।
క్షేత్రం చ దేవతాం చైవ శక్తిం తీర్థం పృథక్పృథక్ ॥ 2 ॥
దక్షిణమున శృంగేరిలో శారదా పీఠమున తమ శిష్యులైన శ్రీ సురేశ్వరాచార్యులను, పశ్చిమమున ద్వారకా క్షేత్రములో కాళికా పీఠమున శ్రీ పద్మ పాదాచార్యులను, తూర్పున జగన్నాథ క్షేత్రములో గోవర్ధన పీఠమున శ్రీ హస్తామలకాచార్యులను, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిష పీఠమున శ్రీ తోటాకాచార్యులను అధిపతులుగా నియమించినారు. వారు పీఠమును, పీఠాధి దేవతను, తీర్థమును మరియు ప్రతి పీఠమునకు మహా-వాక్యాన్ని కూడా నిర్ణయించినారు. (ఇంకా వుంది)
శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ పాహిమాం….దాసోహం శృంగగిరి నాథ ...
సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి