25, సెప్టెంబర్ 2022, ఆదివారం

జోగులాంబ దేవాలయం - ఆలంపూర్

 జోగులాంబ దేవాలయం - ఆలంపూర్


🔔🔔🔔🔔🔔🔔


శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకటాక్షాలను చూపుతున్నారు.


స్థల పురాణం



అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.


విశిష్టరూపం



పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.


విశిష్ట నిర్మాణం



అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.


ప్రత్యేక పూజలు



శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తుంది. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖయ్లో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.


విశేషరోజులు :



ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలవూబహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు...

కామెంట్‌లు లేవు: