31, మే 2023, బుధవారం

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-41


ప్రమార్జితేఽ హ మిత్యస్మిన్పదే స్వయమపి ద్రుతమ్‌ 

ప్రమార్జితా భవన్త్యేతే సర్వ ఏవ దురాధయః.


ఈ అహంకారమును సమూలముగ తొలగించి వైచినచో, దుష్టమానసిక పీడలన్నియు స్వయముగనే శీఘ్రముగ తొలగిపోవును. 


1-42


దోషైర్జర్జరతాం యాతి సత్కార్యాదార్య సేవవాత్ 

వాతాన్తః పిచ్ఛలవవచ్చేతశ్చలతి చంచలమ్‌. 


మనస్సు సత్కార్యములను, మహాత్ముల సేవను విడిచి కామాది దోషముల నాశ్రయించి శక్తినిఁ గోల్పోవుచున్నది. మఱియు నెమిలిపింఛపు తుదికొన గాలిలో నూగులాడునట్లు చంచలమై చలించుచున్నది. 


1-43


ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి 

దూరాద్దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా. 


గ్రామమున కుక్క అటునిటు తిరుగులాడునట్లు, కారణము లేకుండగనే మనస్సు వ్యాకులమైన దీనభావమున దూరప్రదేశములందు తిరుగులాడుచుండును.


1-44


న ప్రాప్నోతి క్వచిత్కించిత్ప్రప్తైరపి మహాధనైః 

నాన్తః సంపూర్ణతామేతి కరణ్డక ఇవామ్బుభిః.



చిత్తము ఇటునటు పర్విడినను ఎచటను ఏమియు పొందుటలేదు. మఱియు, నీటిచే రంధ్రములుగల బుట్ట నిండనట్లు, మహాధనములు సంప్రాప్తించినను ఆ చిత్తము లోన సంపూర్ణత్వము నొందుట లేదు. 


1-45


మనో మనన విక్షుబ్ధం దిశో దశ విధావతి మందరాహననోద్ధూతం క్షీరార్ణవపయో యథా.


మందరపర్వతముచే మధింపబడిన క్షీరసముద్రమందలి నీటివలె, విషయాను చింతనముచే భిన్నమైన యీ మనస్సు దశదిశలకు పరుగు లిడుచున్నది. . 


1-46


భోగదూర్వాజ్కురాకాంక్షీ శ్వభ్రపాతమచింతయన్‌ 

మనో హరిణకో బ్రహ్మన్‌ దూరం విపరిధావతి. 


మహాత్మా! భోగములను తృణముల కాంక్షించు మనస్సను లేడి గోతిలో (నరకములో) పడుటనుగూర్చి చింతింపకయే విషయములను గూర్చి దూరముగ పరువు లిడుచున్నది.


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-47


చేతశ్చంచలయా వృత్త్యా చిన్తానిచయచంచురమ్‌ ధృతిం బధ్నాతి నైకత్ర పంజే కేసరీ యథా.


మనస్సు చంచలవృత్తితో గూడుకొని యున్నది. అది అన్యచింతలతో మరింత చంచలమై యున్నది. కావున బోనులో నుంచఁబడిన సింహమువలె అది ఒకచోట కుదుర్కొని యుండుట లేదు. 


1-48


చేతః పతతి కార్యేషు విహగః స్వామిషే ష్వివ

క్షణేన విరతం యాతి బాలః క్రీడనకాదివ.  


పక్షులు మాంసమును జూచిన ఆకాశమునుండి దిగి దానిమీద బడునట్లు, చిత్తము విషయములపై వ్రాలుచున్నది. బాలుడు అటలు దొఱికినపుడు చదువును విడచిపెట్టునట్లు చిరాభ్యస్తములగు ధ్యానాది వ్యాపారములను ఈ మనస్సు క్షణములో విడిచి పెట్టుచున్నది. 


1-49


అప్యబ్ధిపానాన్మహతః సుమేరూన్మూలనాదపి

అపి వహ్న్యశనాత్సాధో విషయశ్చిత్తనిగ్రహః. 


ఓ సాధూ! సముద్రమును పానముచేయుటకంటెను, గొప్పదగు సుమేరు పర్వతమును పెల్లగించుటకంటెను, అగ్నిని భక్షించుటకంటెను చిత్తమును నిగ్రహించుట కష్టతరమైనది.


1-50


చిత్తం కారణమర్థానాం తస్మిన్సతి జగత్త్రయమ్‌ తస్మిన్‌క్షీణే జగత్‌క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః. 


సమస్త పదార్థములకును కారణము చిత్తమే అయియున్నది. అది యుండినచో ముల్లోకములు నుండును. అది క్షీణించినచో జగత్తున్ను క్షీణించును. కాబట్టి అట్టి చిత్తమును ప్రయత్నపూర్వకముగ చికిత్స చేయవలెను. (నిగ్రహించవలెను). 


1-51


చిత్తాదిమాని సుఖదుఃఖ శతాని నూన 

మభ్యాగతాన్యగవరాదివ కాననాని, 

తస్మిన్వివేకవశత స్తనుతాం ప్రయాతే 

మన్యే మునే నిపుణమేవ గలన్తి తాని.


ఓ మునీంద్రా! గొప్ప పర్వతమునుండి యరణ్యము లుద్భవించునట్లు, నిక్కముగ చిత్తమునుండియే యనేక సుఖదుఃఖము లుద్భవించుచున్నవి. మఱియు ఆ చిత్తము వివేకవశమున నెపుడు క్షీణించునో, అపుడు సుఖదుః:ఖము లన్నియు లెస్సగ క్షీణించిపోవునని నేను తలంచుచున్నాను. 


1-52


అన్తర్గ్రథితయా దేహే సర్వదుశ్ఛదయాఽ నయా 

రజ్జ్వేనాశు బలీవర్దస్తృష్ణయా వాహ్యతే జనః,


ముక్కు త్రాటిచే ఎద్దు ఈడ్వబడునట్లు, లోన మనస్సునకు కట్టబడి, త్రెంచుటకు కష్టసాధ్యమైనట్టి తృష్ణ (ఆశ) చే మనుజుడు శీఘ్రముగ నీడ్వబడుచున్నాడు.


*యోగవాసిష్ఠ రత్నాకరము*


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-53


పుత్రమిత్రకలత్రాది తృష్ణయా నిత్యకృష్టయా 

ఖగేష్వివ కిరాత్యేదం జాలం లోకేషు రచ్యతే.  


నిత్యము జనుల నాకర్షించునట్టి తృష్ణ పక్షులకొరకు కిరాతునివలె ప్రపంచమున పుత్ర, మిత్ర, భార్యా, ధనాది రూపమగు వలను జనులందు విస్తరింపజేయుచున్నది. 


1-54


ప్రయచ్ఛతి పరం జాడ్యం పరమాలోకరోధినీ 

మోహం నీహారగహనా తృష్ణా జలదమాలికా. 


మంచుతో గూడిన మేఘముల సమూహము చలిని గలిగించి, సూర్యుని గప్పి వేయునట్లు, మోహముతో గూడిన తృష్ణ అజ్ఞానమును గలిగించి, ఆత్మజ్ఞానమును గప్పివేయుచున్నది. 


1-55


లోకోఽ యమఖిలం దుఃఖం చిన్తయోజ్ఝ తయోజ్ఝతి 

తృష్ణవిషూచికామంత్రశ్చిన్తా త్యాగో హి కథ్యతే. 


చింతా త్యాగముచేతనే జనులు సమస్త దుఃఖములనుండి విడివడుచున్నారు. మఱియు అట్టి చింతాత్యాగమే తృష్ణయను విషూచికను నశింపజేయు మంత్రమని చెప్పబడినది.


1-56


రోగార్తిరంగనా తృష్ణా గంభీరమపి మానవమ్‌ 

ఉత్తానతాం నయన్త్యశు సూర్యాంశవ ఇవాంబుజమ్‌.


రోగబాధ, స్త్రీ, తృష్ణ -- ఈ మూడును గంభీరమైన (ధీరుడగు) మానవుని గూడ సూర్యకిరణములు కమలమునువలె - శీఘ్రముగ వ్యాకుల మొనర్చుచున్నవి. 


1-57


అహో బత మహచ్చిత్రం తృష్ణామపి మహాధియః దుశ్ఛేదామపి కృన్తన్తి వివేకేనామలాసినా.


ఆహా! బహుచిత్రమైన విషయము! గొప్ప బుద్ధిమంతులగు మహాత్ములు ఛేదించుటకు కష్టసాధ్యమైనట్టి ఈ తృష్ణను వివేకమను తమ నిర్మల ఖడ్గముచే ఛేదించివైచుచున్నారు! 


1-58


అపిమేరుసమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్‌ తృణీకరోతి తృష్ణైకా నిమేషేణ నరోత్తనుమ్‌.


మేరువువలె గంభీరుడును, శూరుడును, స్థిరబుద్ధియుతుడును, ప్రజ్ఞావంతుడు నగు ఉత్తమ మనుజుని గూడ తృష్ణ యొక్కటియే నిమిషకాలములో తృణసమానునిగ గావించివైచుచున్నది.


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-59


ఆర్ద్రాంత్ర తంత్రీ గహనో వికారీ పరిపాతవాన్‌ 

దేహః స్ఫురతి సంసారే పోఽ పి దుఃఖాయ కేవలమ్‌. 


తడిసిన ప్రేగులు, నాడులచే భయంకరమైనదియు, అనేక వికారములతో గూడినదియు, క్షణభంగురము నగు దేహ మెయ్యది యీ ప్రపంచమున స్ఫురించుచున్నదో, అదియు కేవలము దుఃఖము కొరకే యగును.


1-60


తాత సంతరణౌర్థేన గృహీతాయాం పునః పునః నావిదేహలతాయాం చ కస్య స్వాదాత్మభావనా.


మునీంద్రా! సంసారమను సముద్రమును దాటుటకై మరల మరల గ్రహింపబడినటువంటి ఈ దేహమను నౌకయం దెవనికి ఆత్మ భావన యుండగలదు? (దేహము ఆత్మ (తాను) కాదనుట). 


1-61


మాంసస్నాయ్వస్థివలితే శరీరపటహేఽ దృఢే మార్జారవదహం తాత తిష్ఠామ్యత్ర గతధ్వనౌ.  


మాహాత్మా! చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలునందున్న పిల్లివలె -  నేను మాంసము, 

నరములు,ఎముకలచే నిర్మింపబడిన అదృఢ శరీరమునందున్నాను. ఇద్దానినుండి బయటపడు ఉపాయవాక్యమును వినే వీలు కలుగుటలేదు.


1-62


త్వక్సుధాలేపమసృణం యత్రసంచారచంచలమ్‌ మనః సదాఖునోత్ఖాతం నేష్టం దేహగృహం మమ. 


ఈ శరీరమను గృహము చర్మమను సున్నము పూయబడియున్నది. మఱియు యంత్రమువలె చలించుచు సంచరించుచున్నది. మనస్సను ఎలుక ఎల్లవేళల ఈ యింటికి కన్నము త్రవ్వుచున్నది. ఇట్టి శరీరమను గృహము నాకిష్టము కాదు. 


1-63


కిం శ్రియా కిం చ రాజ్యేన కిం కాయేన కిమీహితైః

దినైః కతిపయైరేవ కాలః సర్వం నికృన్తతి. 


ధనము (ఐశ్వర్యము)చే గాని, రాజ్యముచేగాని, శరీరముచే గాని, చేష్టలచే గాని, లేక మనోరథములచేగాని యేమి ప్రయోజనము? ఏలయనిన కొలది రోజులలోనే వాని నన్నింటిని కాలము త్రుంచివేయుచున్నది. 


1-64


రక్తమాంసమయస్యాప్య సబాహ్యాభ్యంతరం మునే 

నాశైక ధర్మిణో బ్రూహి కైవ కాయస్య రమ్యతా.  


మునీంద్రా! రక్తమాంసమయ మైనదియు, కేవలము నాశమే ధర్మముగా గలదియునగు ఈ శరీరముయొక్క బాహ్యాభ్యంతరములను విమర్శించి చూచి ఇందు రమ్యత్వ మేమి గలదో వచింపుడు? (ఏమియును లేదని భావము.)


*యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-65


మరణావసరే కాయా జీవం నానుపరన్తియే 

తేషు తాత కృతఘ్నేషు కైవాస్థా వద ధీమతామ్‌. 


మునీశ్వరా! చక్కగ పోషింపబడి, పెంచబడినను మరణకాలమున జీవుని అనుసరింపని యీ కృతఘ్న శరీరమునందు నమ్మక మెవరుంచుదురు? 


1-66


మత్తేభకర్ణాగ్ర చలః కాయో లమ్బాంబు భంగురః

న సంత్యజతి మాం యావత్తావదేనం త్యజామ్యహమ్‌.


మదించిన ఏనుగుయొక్క చెవియొక్క కొనలో వ్రేలాడు నీటిబొట్టువలె క్షణభంగుర మైనదియునగు ఈ శరీరము నన్ను విడిచిపోవుటకు పూర్వమే నేను 

దీనిని విడిచివైచుచున్నాను. 


1-67


భుక్త్వా పీత్వా చిరం కాలం బాలపల్లవ పేలవామ్‌ తనుతామేత్యయత్నేన వినాశమనుధావతి. 


చిరకాలము ఉత్తమ పదార్థములను భుజించినను, త్రాగినను గూడ ఈ శరీరము కోమలపత్రమువలె అప్రయత్నముగనే కృశించి వినాశము వైపునకు పరుగిడుచున్నది.


1-68


దహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః సంసారాబ్దా విహోహ్యాన్తే కించిత్తేషు నరం విదుః. 


కేవలము దహనము కొఱకు యోగ్యము లైనట్టి శరీరములను కట్టెలనేకము లీ సంసారమను సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొకానొక కట్టె మనుజుడని చెప్పబడుచున్నది.


1-69


బద్దాస్థా యే శరీరేషు బద్దాస్థా యే జగత్థ్సితౌ 

తన్మోహమదిరోన్మత్తాన్‌ ధిగ్‌ధిగస్తు పునః పునః. 


ఎవరు శరీరములందును, 

జగత్స్థితి

యందును అవి సత్యములని, చిరకాల ముండునవి యని విశ్వాసము గలిగియుందురో, అజ్ఞానమను కల్లుత్రాగి ఉన్మత్తులైయున్నట్టి జనులకు మరల మరల ధిక్కారమగు గాక! 


1-70


నాహం దేహస్య నో దేహో మమనాఽయమహం తథా 

ఇతి విశ్రాన్తచిత్తా యే తే మునే పురుషోత్తమాః. 


ఓ మునీంద్రా! 'జడమగు ఈ దేహము నేను కాను, నేను దానికి సంబంధించినవాడను కాను, నాకు దేహము లేదు' అని విచారించి ఆత్మయందు విశ్రాంతి నొందువారే మనుజులలో నుత్తములు.

కామెంట్‌లు లేవు: