31, మే 2023, బుధవారం

మనస్తత్వానుశీలనము

 శుభోదయం🙏

           చొప్పకట్ల.


విశ్వనాథ  వైలక్షణ్యము

శ్రీచంద్రశేఖర్.చీరాల.


విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షము ఒక విధంగా ఏకపాత్రాభినయమని చెప్పవచ్చు.  వారే రాముడు, వారే సీత, వారే లక్ష్మణుడు ఇత్యాది.  రాముని వైరాగ్యము, జానకి దుఃఖము, లక్ష్మణుని భక్తి ప్రపత్తులు, హనూమంతుని వివేచన, రావణుని ఔద్ధత్యము అన్నీ విశ్వనాథ వారు అనుభవించి వ్రాసినవే. తెలుగు సాహిత్యంలో  ఇంతగా వ్యక్తిత్వ ముద్ర ఉన్న కావ్యం మరొకటి లేదేమో.


(1)


ఆంజనేయునితో సీత తన దుఃఖము వెళ్లబుచ్చుతున్నపుడు వాల్మీకి రామాయణం, సుందర కాండ లో ఒక శ్లోకమున్పది.


మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః

సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ.


" నిస్సందేహంగా నేను చేసిన పాపమేదో ఉండి ఉంటుంది,  అందువలననే సమర్థులై, శత్రుంజయులై కూడా రామ లక్ష్మణులు నన్ను పట్టించుకోవడం లేదు"


శోకమగ్న యైన సీత తనను తాను నిందించుకోవడం సహజమే. ఈ శ్లోకం ఆధారంగా విశ్వనాథ ఏడు రసప్లావితమైన పద్యాలలో సీత హృదయాన్ని ఆవిష్కరించారు. అందులో కొన్ని. 


మెడలో తాళిని గట్టె, వామపదమున్ మెట్టెన్ కరస్వీకృతిన్

గడకన్ జేసె నటంచు నే చనువుచే కంజాక్షు రామున్ తడం

బడి యే పల్చని యూహ జేసితినొ యా పాపంబు నేనందెదన్ 

కడు నన్నున్ క్షమియింపవే రఘుపతీ! కల్యాణ వారాన్నిధీ!


నన్ను పరిణయమాడినాడు కదా, భర్త యన్న చనువుతో ఎపుడైనా మర్యాదా లోపము చేసినానో, ఆ తప్పును రాముడు క్షమించుగాక!


తన తండ్రుల్ బహుమేధయజ్వ లదె బ్రాతా! బ్రహ్మ విజ్ఙానులెం

దును నా తండ్రు లటంచు నా యెద నదే ద్రోహంబు భావించి యుం

టినొ యా పాపము వచ్చి యిప్పటికి నంటెన్నన్ను నీ రీతిగా

కడు నన్నున్ క్షమియింపవే రఘుపతీ! కల్యాణ వారాన్నిధీ!


తన తండ్రులు యాజ్ఙికులు, కర్మ నిష్ఠులు, మా తండ్రులు జ్ఙానమార్గము నవలంబించిన వారు,  బ్రహ్మ నిష్ఠులు అన్న అహంభావమెప్పుడైనా కలిగినదేమో, రామా! ఆ పాపమును క్షమింపుము.

తండ్రులు అనడం వంశ పారంపర్యము సూచిస్తున్నది.


ఏకతమున్న యప్డు పతియే తమిచేత మదీయ పాదముల్ 

చేకొని స్వీయ పాదముల జేర్పగ యూరక యుంటి దుష్ట కా

మాకృతి చేత నేను, నది యంతయు ప్రేమ యటంచు నెంచి సా

ధ్వీకృతి మాలితిన్ రఘుపతీ! క్షమియింపవె జానకీపతీ!


ఏకాంతములో నీవు నాపాదములను నీ పాదములపై చేర్చుకోగా, అది ప్రేయోభావమని ఊరకున్నాను,  కాని (నీకు కాలు తగిలించిన) ఆ దోషమును క్షమింపుము!


ఓ స్వామీ హృదంతరాంతరమునందున్నావు నాథుండవై

యేనో ఘాసతతిన్ సుదర్శనపు బర్హిన్ నీవు ముట్టింతు వ

జ్ఙానంబంతయు భక్తి నందకమునన్ సైరింతు నీ యందు నా

ప్రాణంబుల్ నిలబెట్టితిన్ రఘుపతీ!  పాలింపవే శ్రీపతీ!


నీవు నా అంతరంగమున సుస్థిరుడవై ఉన్నావు. నీ దర్శన మాత్రము చేత పాపములు దహించుకొని పోవును, నీ ఫైని భక్తి  సంతోష కారకమై అజ్ఞానమును నశింపజేయును. నీ కొరకై జీవించి ఉన్నాను. నన్ను రక్షింపుము! ఇది సామాన్యార్థము.


హృదయాంతరాంతరము - మనో బుద్ధ్యహంకారములకు చిహ్నమైన హృదయమునకు, శుద్ధ చైతన్యమునకు మధ్యనున్న సంధి - మాయావరణము - లో చైతన్య ప్రతీక యైన స్వామిని నిలుపుకొని ఉన్నాను. రాముడు విష్ణు రూపమేనన్న ధ్వని. సుదర్శన చక్రము యొక్క  జ్వాల (బర్హి = అగ్ని)  పాపములన్న గడ్డి వామును తగల బెట్టును, భక్తి నందకమన్న ఖడ్గముతో అజ్ఞానమును సంహరించును (సైరించు = సహించు, లోగొను). నీయందు నా ప్రాణంబుల్ నిలబెట్టితిన్ - ఆత్మ సమర్పణము.


ఇది విశ్వనాథ వారి స్వరము. ఒక సీతాదేవికే కాదు, అందరికీ చెల్లినది.


ఒక ప్రసిద్ధ పండితుడు, విశ్వనాథ వారి అభిమానియే, ఏన + ఓఘ, ఏనోఘ, ఓఘ అంటే సమూహమే కదా, మళ్ళీ సతతి అనడంలో పునరుక్తి దోషమున్నది అన్నారు. కాని అది సరి కాదు. ఏనో ఘాసతతి = ఏనః + ఘాసతతి అని విడదీయాలి, పాపములన్న గడ్డి మోపు. పునరుక్తి లేదు.


జ్ఙానాకారులు నీవు నీ యనుజుడున్ సైరించి నాకోసమ

జ్ఙానుల్గా నయి మాయలేడి వెనకన్ జన్నారు ప్రేమంబునన్

తానా చెల్లెలి భర్త వట్టి మరియాదం జేసి, యా తప్పు  నా

తోనే పోవలెనా ప్రభూ,  రఘుపతీ! తోడౌదువా, మత్ఫతీ!


రామ లక్ష్మణులు జ్ఞానాకారులు -  తెలిసి తెలిసి కేవలం తన ముచ్చట తీర్చడానికై మాయలేడి వెంట వెళ్ళినారు. తానా చెల్లెలి భర్త వట్టి మరియాదన్ జేసి - పూర్వము సీత లక్ష్మణుని నిందించడం ధ్వని మాత్రంగా ఉంది, తన దుర్భాషలను భరించి కూడా తన పైని మర్యాద తో, లక్ష్మణుడు మాయలేడి వెనక వెళ్లిన రాముని వెదుకుతూ  వెళ్లినాడని. ఆ తప్పు నాతోనే పోవలెనా  - నాకింత శిక్ష యా. తోడౌదువా - సహకరించెదవా, రక్షింపుము అన్న వేదన.


హృదయవిదారక స్థితిలో జానకి ఊహాజనితమైన దోషములు కూడా తనపై ఆపాదించుకొంటున్నది, ఒక్క  మాయలేడి విషయంలో తప్ప. ఇది  మనస్తత్వానుశీలనము. ప్రధానమైనది ప్రార్థనాపూర్వక దైన్యము. సంభాషణ ఆంజనేయునితో, కాని స్వయంగా రామునికి నివేదించినట్లుండడము తల్లీన స్థితిని సూచిస్తున్నది.

కామెంట్‌లు లేవు: