31, మే 2023, బుధవారం

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 76*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 76*


యుద్ధానికి సంబంధించిన ఆందోళనలేవీ లేకుండా నందులు, జీవసిద్ధి, భద్రభట, బాగురాయణాదులు తాపీగా ప్రశాంతంగా ఫలహారాలు ఆరగిస్తున్నారు. రాక్షసామాత్యుని అడుగుల చప్పుడు విని కొందరు తలెత్తి చూసి మరల పలహారాలు ఆరగించడంలో మునిగిపోయారేగానీ అతని రాకరు పట్టించుకున్న వాళ్లు, పలకరించిన వాళ్లు లేరు. 


రాక్షసునికి చాలా బాధ కలిగింది. ఆ అవమానంతో తల కొట్టేసినట్లయ్యింది. ఇదివరకు రాక్షసుడు కనిపిస్తే చాలు, నందులు లేచి ఎదురు వెళ్లి పలకరించి గౌరవించే వాళ్ళు. మరి యిప్పుడో... ?


'వెనక్కి తిరిగి వెళ్లిపోదామా ?' అనుకున్నాడు రాక్షసుడు. కానీ మహాపద్మనందుడికి తాను ఇచ్చిన మాటజ్ఞప్తికి వచ్చీ, తానే రాజ్యానికి ప్రధానామాత్యుడు అవడం చేతనూ, ఆ అవమానాన్ని బలవంతంగా గొంతులో దిగమింగుకుంటూ ఖాళీగా ఉన్న ఆసనం మీద చతికిల పడ్డాడు. 


జీవసిద్ధి పలహారాన్ని ముగించి తలెత్తి చూస్తూ 

"ఆ ! వచ్చారా రాక్షసామాత్యా ! మీ కోసమే ఎదురుచూస్తున్నాము" అని నవ్వి "చంద్రగుప్త మౌర్యుడు రణభేరి మ్రోగిస్తూ హెచ్చరిక లేఖ పంపించాడు... మగధ సామ్రాజ్యం తన తండ్రి మహానందుల వారిదట... వారసత్వంగా తనకి సంక్రమిస్తుందట... నందుల మీద బుడతడు యుద్ధం ప్రకటించాడు ... యుద్ధం ..." అని ఫక్కున పగలబడి నవ్వాడు. అందరూ అతని నవ్వుతో శృతి కలిపారు. 


వాళ్ల ప్రవర్తన రాక్షసునికి చిర్రేత్తించింది. అయినా సమయం కాదు కనుక మౌనం వీడలేదు. జీవసిద్ధి మందహాసం చేసి "బూ బుడతడి తోడుగా ఇద్దరు మహాబలులు తరలివస్తున్నారట... ఒకడు అలెగ్జాండర్ దెబ్బకి దుంపనాశనమైపోయిన పురుషోత్తముడట ... మరొకడు, ఒకప్పుడు నందుల దాటికి తాళలేక తోకముడిచి స్నేహం చేసుకున్న కృతఘ్నుడు పర్వతకుడట ... ఆ ! రానివ్వండి చూద్దాం ..." అన్నాడు వ్యంగంగా. మళ్లీ అందరూ నవ్వారు. 


రాక్షసుడు అగ్రహాన్ని లోలోపలే అణచుకుంటూ "ఇప్పుడైనా మనం యుద్ధ సన్నాహాలు చేసుకోవాలి. మగధకి నలువైపులా వున్న మన సామంత దుర్గాధీశులకు ఇక్కడి నుంచి అదనపు బలగాలు పంపించి, శత్రువులు మగధపొలిమేరల్లో అడుగుపెట్టగానే, అక్కడే..." అంటున్నాడు. 


"ఎందుకూ, డబ్బు దండగ..." మధ్యలో అడ్డుపడ్డాడు జీవసిద్ధి. 


రాక్షసుడు ఆగ్రహంతో అతడివైపు కొరకొర చూసాడు. 


జీవసిద్ధి చాలా నిర్లక్ష్యంగా "మగధకి నాలుగు దిక్కుల నుంచీ మార్గాలున్నాయి. శత్రువులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో మనకు తెలియదు. మన దగ్గరున్న సైనిక బలగాలను నాలుగువైపులకీ తలా కాస్త పంపించి పాటలీపుత్రాన్ని బలహీనపర్చుకుంటామా ? పైగా ఇలా బలగాలను అటూ ఇటూ తరలించడానికి బోలెడంత డబ్బు ఖర్చు..." అన్నాడు. 


రాక్షసుడు ఉక్రోషంగా చూస్తూ "అందుకని .... ?" ప్రశ్నించాడు. 


జీవసిద్ధి ఏమాత్రం తొణక్కుండా శత్రువుల లక్ష్యం పాటలీపుత్రం. వాళ్ళు ఏ మార్గంలో వచ్చినా ఇక్కడికే వస్తారు. కనుక మన బలగాలన్నీ ఇక్కడే వుంచుతాం. ఇక్కడే శత్రువుల మీది దాడి చేస్తాం. ఇందువల్ల డబ్బు, ఖర్చు తగ్గుతుందని, అందువలన బలగాలని అటూ ఇటూ తిప్పాల్సిన అవసరం ఉండదని... ప్రభువులూ, మంత్రులూ, సేనానులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మేమూ సరెనన్నాం ... " అని చెప్పాడు. 


"అవును. ఈ వ్యూహమే మాకూ నచ్చింది. దీనినే ఆమోదిస్తున్నాం. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం" అని చెప్పి లేచి, తమ్ముళ్ళతో కలిసి వెళ్లిపోయాడు సుకల్పనందుడు. జీవసిద్ధి వాళ్ళని అనుసరించాడు. మంత్రులు, సేనానులు ఎవరి దారిన వాళ్ళు జారుకున్నారు. 


రాక్షసుడొక్కడే....  ఒంటరిగా మిగిలిపోయాడు వ్యధతో. అవమానంతో... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: