31, మే 2023, బుధవారం

గౌహతిలో తిరుపతి

 గౌహతిలో తిరుపతి


పరమాచార్య స్వామివారి అనుగ్రహ విశేషం వల్ల గౌహతిలో ఒక బాలాజీ మందిరం, కంటి ఆసుపత్రి ఏర్పాటు అయ్యాయి.


ఈ పనికోసం భూమి సేకరించే కార్యక్రమం 1991లో మొదలయ్యింది. 1992లో అప్పటి అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హితేశ్వర్ సైకియా కాంచీపురంలో పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు, స్వామివారి చేతుల మీదుగా తీసుకున్న రుద్రాక్ష మాల, పూల కిరీటం అతడిని ULFA టెర్రరిజం నుండి రక్షించింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఒక తట్ట నిండుగా కలకండను ఇచ్చి అతనితో పాటుగా వచ్చిన బ్లాక్ క్యాట్ భద్రతా దళాలకు పంచమని చెప్పారు. సైకియా అస్సాం తిరిగివెళ్ళిన తరువాత పద్దెనిమిది ఎకరాల విస్తారమైన సమతల భూమిని ప్రభుత్వం తరుపున పరమాచార్య స్వామికి సమర్పించారు. దాంతోపాటు, దేవాలయ నిర్మాణం కోసం పడి లక్షల రూపాయల చెక్కును కూడా ఇచ్చారు. ఈ ధర్మం మూలంగా గౌహతిలో దక్షిణ భారత శిల్ప శాస్త్ర అనుగుణంగా ‘పూర్వ తిరుపతి శ్రీ బాలాజీ మందిరం’ ఏర్పాటు అయ్యింది. ఈ మందిరం ఇక్కడి ప్రజలకు ఎంతోదూరం ప్రయాణించి వెళ్ళవలసిన ఆంధ్రదేశంలోని తిరుపతి బాలాజీ దర్శనాన్ని కలిగిస్తోంది.


శ్రీ శంకరదేవ నేత్రాలయ ఆసుపత్రి


పరమాచార్య స్వామివారు సిద్ధి పొందడానికి అయిదు రోజుల ముందు అంటే జనవరి 3, 1994న చెన్నై శంకర నేత్రాలయ స్థాపకులు, అధ్యక్షులు అయిన డా. యస్.యస్ బద్రినాథ్ గారి ప్రోద్బలంతో ఈశాన్య, ఉత్తర భారతీయ టీ ఎస్టేట్ సంస్థల ఆర్థిక సహాయంతో మరియు కొందరు ధనికుల విరాళాలతో, కలకత్తాలో ‘శ్రీ కంచి శంకర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్’ స్థాపించబడింది. 


ఈ ట్రస్టు ప్రారంభించిన రోజునే మొత్తం ముప్పై లక్షల రూపాయల ధనం విరాళంగా వచ్చింది. తరువాత శతాబ్ది వార్షికోత్సవం (11-11-1994) నాడు గౌహతిలోని బెల్టోల(బిల్వస్థల) అన్న ప్రాంతంలో మూడు అంతస్థుల భవనాన్ని లీజుకు తీసుకోవాలని చర్చించుకుంటుండగా, ఆ భావన యజమాని దాన్ని ఆసుపత్రి కోసం విరాళంగా ప్రకటించాడు. నాకు తెలిసి ఇది పరమాచార్య స్వామివారు చూపిన, ఇప్పటికీ చూపుతున్న అద్భుతాలలో ఒకటి. కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహ విశేషం వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందినది అన్న విషయం అతిశయోక్తి కాదు.


ఆది శంకర పరంపరలో వచ్చిన కంచి శంకరాచార్యులు స్థాపించిన కంటి ఆసుపత్రిని ‘శంకర మెడికల్ సెంటర్’ అన్న పేరు మీద కాకుండా, పదిహేనవ శతాబ్దంలో అస్సాంలో నివసించిన కృష్ణ భక్తుడు శ్రీ శంకరదేవ పేరు మీద నడపడానికి కారణం పరమచార్యులే. ఈ విషయం ఇప్పటికి చాలామందికి తెలియదు.


--- ఆర్. చిదంబరేసన్, చెన్నై - 40. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।



#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: