31, మే 2023, బుధవారం

రామాయణం

🍀15.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


          *వాల్మీకి రామాయణం:*

                 *15 వ  భాగం:*

                    ➖➖➖✍️


*అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో ‘త్రిశంకు’ అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు.* 


*”నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు” అన్నాడు వశిష్ఠుడు.* 


*అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు.* 


*”మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగేపనికా”దన్నారు ఆ నూరుగురు కుమారులు.*


*”అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను” అన్నాడు ఆ త్రిశంకుడు.* 


*”నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావ”ని శపించారు.*


*మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.*


*వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి... “మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి, ‘వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు’ అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండ”ని చెప్పాడు.* 


*విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు.   తరువాత ఆయన కొడుకులు వచ్చి… “వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, ‘యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రాన’న్నాడు” అని చెప్పారు.*


*విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడ”ని శపించాడు.*


*అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితో త్రిశంకుడిని పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన...*


*”త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||”*


*”త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు” అని, “తలక్రిందులుగా కిందకిపో!” అన్నాడు.* 


*ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు.*


*కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.*


*”మహానుభావా! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరినీ స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు!” అన్నారు.* 


*”మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు” అని వరం ఇచ్చారు దేవతలు.* 


*శాంతించిన విశ్వామిత్రుడు “సరే” అన్నాడు.*


*తనకి ఇక్కడ మనశ్శాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. *✍️

రేపు... 16వ భాగం...!

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

   *ఈ మార్గం ఎటు వెళ్తుంది ?*

                 ➖➖➖✍️


_ఈ అర్ధ శాతాబ్దంలో 1957-59 సంవత్సరాలు చెన్నై నగర చరిత్రలో సువర్ణ కాలం. అన్ని నెలలపాటు, మాంస నేత్రాలతో దర్శించినంతనే ఈ కలియుగంలో కూడా ఆశీర్వదించే అవతారమూర్తి, తత్వశ్రేష్టులు మహాపెరియవా అని ప్రపంచం మొత్తం వినుతించే కంచి స్వామి చెన్నైలో మకాం చేశారు. ముఖ్యంగా మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో తన సన్యాస యువరాజు జయేంద్ర సరస్వతి స్వామి వారితో పాటు విడిది చేస్తూ, ఆ దివ్య చరణాలతో ట్రిప్లికేన్, నుంగంబాక్కం, తొండైయార్ పేట్, మాంబళం వంటి ఎన్నో చోట్లను పావనం చేస్తూ, ఒకప్పుడు పండి ఎండిపోయిన ధర్మ పంటను మరలా పండిస్తూ అనుగ్రహం చేశారు._


_ఒకరోజు ఉదయం మాంబళంలోని శివ-విష్ణు దేవాలయం నుండి తిరువాన్మియూర్ లో, శివుడు మరుందీశ్వరునిగా - స్వస్థత చేకూర్చే దేవుడు, అమ్మవారు త్రిపురసుందరి దేవిగా వెలసిన ఆలయానికి మహాస్వామివారు పాదయాత్రను ప్రారంభించారు._


_మహాస్వామి వారితో వెళ్తున్న భక్తులలో నేను కూడా ఉన్నాను. స్వామివారి పాదయాత్రలో ఇద్దరు ముగ్గురు రక్షకభటులు కూడా ఉన్నారు._


_కొద్ది దూరం నడచిన తరువాత ఎదురుగుండా వస్తున్న ఒక వ్యక్తి స్వామివారిని అడ్డగించడానికి నిలబడ్డాడు. అహంకారంతో చెప్పులు విప్పకుండా, నిర్లక్ష్యంగా నిలబడి ఉన్నాడు. అతను స్వామివారిని తాకకుండా ఉండడానికి చుట్టూ వలయాకారంగా నడుస్తున్నారు. రక్షకభటులు కూడా ముందుకు వచ్చారు. కాని ఆ కారుణ్యమూర్తి వారిని పక్కకు తప్పుకొమ్మని అతడిని, “నీకు ఏమైనా కావాలా ?” అని అడిగారు._


_“నాకు ఏమి అక్కరలేదు” అన్నాడు. “ఎవరో శంకరాచార్య, గొప్పవాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు, అది నువ్వేనా ?” అని అడిగాడు._


_“అది వదిలేయ్. నీ పేరు ఏమి ? ఇంత ఉదయాన్నే ఎక్కడకు వెళ్తున్నావు ?” అని ఒక తండ్రి పిల్లవాడిని అడిగిన రీతిలో ఎంతో ప్రేమగా అడిగారు స్వామివారు._


_అతను తన పేరు చెప్పి, “నాకు ఏమి పని లేదు అనుకున్నావా ? నేను నా పనికి వెళ్తున్నాను” అని అన్నాడు. ఆ మాటల్లో ‘పీఠాధిపతులైన మీరు సోమరులు, ఉపయోగపడేవి ఏమీ చెయ్యరు’ అన్న భావం కనబడుతోంది._


_“నీ ఉద్యోగం ఎక్కడ?” ఆ దయానిధి మరలా అడిగారు._


_“గ్యుండి లో” అని సమాధానం ఇచ్చి, “నేను ఒకటి అడుగుతాను, ఈ హిందూ మతాన్ని స్థాపించినది ఎవరు?” అని అడిగాడు. ఆ ప్రశ్నలో వినయము, జిజ్ఞాస ఆవగింజంత అయినా లేదు._


_జ్ఞానమేరు అయిన పరమాచార్య స్వామివారు, “అది నాకు తెలియదు, వత్సా” అని అతను వాదన గెలవడానికి అనుగుణంగా సమాధానమిచ్చారు._


_“నీకు తెలియదు అంటున్నావు. కాని నీవు శాస్త్రాలు అలా చెప్పాయి, ఇలా చెప్పాయి, రాతి విగ్రహం పైన పాలు పొయ్యి, అగ్నిలో నెయ్యి వెయ్యి అని చెబుతావు. ఇవన్నీ మంచికోసమే అని నేను ఎలా నమ్మాలి ?”._


_శరాఘాతంలా వచ్చిన ఆ ప్రశ్నకు ఎటువంటి చలనం లేకుండా, ఆ దయాళువు ప్రేమ నిండిన మాటలతో, “అది వదిలేయ్. నువ్వు గ్యుండికి వెళ్తున్నావు అని చెప్పావు కదా. ఈ దారి గుండా వెళ్తే ఆ స్థలాన్ని చేరుకుంటావా ?” అని అడిగారు._


“చేరుకుంటాను కాబట్టే ఇలా వెళ్తున్నాను” 

ఆ సమాధానంలో ఇదొక అనవసర ప్రశ్న

అన్న భావం కనిపించింది.


_“సరే. ఈ రోడ్డు వేసినది ఎవరో ?” మహాస్వామివారు ఆ నాస్తికుని హృదయ వీణను మ్రోగించడానికి సిద్ధమయ్యారు._


_“ఈ రోడ్డా, మా తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతల కాలం నుండి ఉంది. ఈ రోడ్డు ఎవరు వేస్తె ఏమి? ఇది గ్యుండికి వెళ్తుంది అంతే”._


_“అంటే ఈ రోడ్డు ఖచ్చితంగా గ్యుండికి వెళ్తుంది అంటావు”._


_“అందులో సందేహం ఏముంది? నేను రోజూ ఇలానే పనికి వెళ్తాను. అంతేకాదు, అక్కడ చూడండి ఏ రోడ్డు ఎలా వెళ్తుందో అన్న సమాచారంతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఫలకం”._


_స్వామివారు కారుణ అనే వలలో జింక పడింది. కాని ఇది బంధనం కాదు, విడుదల._


_“నేను కూడా నీలాగే, వత్సా. నువ్వు ఆ ఫలకాన్ని నమ్మి వెళ్తున్నట్టుగా, రోడ్డు ఎవరు వేసారో అన్న ఆలోచన, అనుమానం లేకుండా హిందూ మతం అనే రోడ్డుపై వెళ్తున్నాను. నువ్వు ఆ ఫలకాన్ని నమ్ముతున్నావు. అది గాలికి తన దిశను మార్చుకోవచ్చు, లేదా వానకు పడిపోవచ్చు. మా తాతలముత్తాతల కంటే పాతవైన వేల వేల సంవత్సరాల నుండి ఉన్న వేదాలు, శాస్త్రాలను నమ్ముతాను. వారు కూడా వాటిని నమ్మారు. కనుక నేను కూడా వాటిని నమ్ముతాను, ఇతరులని నమ్మమంటాను” అని ముగించి, కరుణ నిండిన వాక్కులతో, “సరే, నాలా కాకుండా నీకు పని ఉంది. నువ్వు వెళ్ళు. క్షేమంగా ఉండు” అని తమ అభయహస్తాన్ని చూపారు._


_మరుక్షణమే ఆ వ్యక్తి చెప్పులని విడిచి, నేలపై సాగిలపడి స్వామివారికి సాష్టాంగం చేశాడు. కళ్ళ నీరు కారుతుండగా, నాలుక తడబడుతుండగా, “నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు._


_దాంతో, బంగారంగా మారే రసవాద పరిణామం వల్ల, అతను స్వామివారికి మహాభాక్తునిగా మారి తరచూ స్వామివారి మకాంకు వచ్చేవాడు._


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyaVaibhavam


#KanchiParamacharyaVaibhavam

#కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



కామెంట్‌లు లేవు: