👍 ఆలోచనాలోచనాలు 👌💐 సంస్కృత సూక్తి సుధ 💐 ***** పాతుం కర్ణాంజలిభిః, కిమమృత మిహయుజ్యతే? సదుపదేశం, కిం గురుతాయా / మూలం ? యదేత ద ప్రార్థనం నామ!! చెవులతో అమృతం లాగా ఆదరంతో పానం చెయ్యదగినది ఏది? ( శ్రద్ధాసక్తులతో వినదగినదేదీ?) ---- " మంచివారు చేసే హితోపదేశం." గౌరవం సంపాదించడానికి మూలమైనది ఏది? --- యాచించకుండా ఉండడం. ***** కిం గహనం? ..... స్త్రీచరితం, కశ్చతురో / యోన ఖండితస్తేన, కిం దుఃఖ? మసంతోషః, కిం లాఘవ? మధమతో యాచ్యా. తెలుసుకోవడానికి అసాధ్యమైనదేమిటి? స్త్రీల చరిత్ర లేదా వర్తనం. నిపుణుడెవడు? సన్మార్గాన్ని తప్పక అనుసరించేవాడు. దుఃఖం అంటే ఏమిటి? సంతోషంగా లేకపోవడమే! మానవుణ్ణి ఎందువలన చులకనగా చూస్తారు అంటే తనకంటే తక్కువవానిని యాచించడం ద్వారా. ***** కుత్ర విధేయో వాసః? సజ్జన నికటేఽధవా కాశ్యామ్, కః పరిహార్యో దేశః? పిశున జనయితో లుబ్ధభూపశ్చ. నివసించదగిన ప్రదేశం ఏది అంటే మంచివారుండే ప్రదేశం లేదా కాశీపట్టణం. తప్పక విడిచిపెట్టదగిన ప్రదేశం ఏదీ అంటే లుబ్ధుడైన పరిపాలకుడు , కొండెములు చెప్పే స్వభావం గల ప్రజలున్న దేశం. ***** కిం లఘుతాయా మూలం? ప్రాకృత పురుషేషు యాయాచ, రామాదపి క శ్శూరః? స్మరశర నిహతో నయశ్చలతి. ఎవరిని చులకనగా చూస్తారూ అంటే , ఎవడయితే పామరజనులను యాచిస్తాడో వాడిని. శ్రీరామచంద్రమూర్తి కంటే శూరుడు ఎవడు అంటే మన్మథబాణాలకు ఎవడైతే చలించకుండా ఉంటాడో, అతడు. ***** కో మాయీ? పరమేశః! , క ఇంద్రజాలాయతే? ప్రపంచోయమ్! కస్స్వప్నవిభో? జాగ్రద్వవహారః, సత్యమపిచ కిం? బ్రహ్మ! మాయకలవాడు ఎవడు? పరమేశ్వరుడు. ఇంద్రజాలం లాగా ఉన్నదేమిటి? -ప్రపంచం. స్వప్నంతో పోల్చదగిందేది అంటే మెలకువతో కనుపించే ఈ సమస్త వ్యవహారమునూ. సత్యమైనదేది అంటే పరబ్రహ్మ మాత్రమే! ***** పాత్రం కిమన్నదానే? క్షుదిరః, కోర్చ్యోహి? భగవదావతారః! కశ్చ భగవాన్? మహేశః, శంకర నారాయణాత్మైకః! అన్నం పెట్టదగినవాడు ఎవడు? ఆకలిగొన్నవాడు. పూజింపదగినవాడు ఎవడు? భగవంతుని అవతారాలలో ఒక రూపం. భగవానుడు ఎవరు అంటే అద్వితీయుడు మరియు హరిహరాత్మక రూపుడైన పరమేశ్వరుడు. చివరగా ఒక చమత్కార శ్లోకం తో ముగిద్దాం. ***** అంబలి, చింతకాయ, కూరగాయ, మరియు పాలనేతి. ఇవన్నీ తెలుగు పదాలు. వీటితో శ్రీ కృష్ణునికి( విష్ణువుకు) ప్రార్థనాశ్లోకాన్ని రచించిడొక కవి వరేణ్యుడు. గమనించండి. అంబలి ద్వేషిణం వందే. చింతకాయ శుభప్రదం. కూరగాయ కృతత్రాసం. పాలనేతి గవాం ప్రియం!! పై శ్లోకంలో అం+బలి ద్వేషిణం, చింత + కాయ, కు +ఉరగాయ, పాలన + ఇతి గా విడదీసుకొంటే ---- బలిచక్రవర్తిని అణచినట్టి, (ఆలోచించువారికి) చింతించువారికి శుభములను కలిగించునట్టి, విషసర్పమైన కాళీయుని భయం నుండి రక్షించునట్టి, ఆవులను పాలించుటకు ఇష్టపడేవాడైన శ్రీకృష్ణునికి ( విష్ణుమూర్తి కి) నమస్కారమని భావము. తేది 15--10--2023, ఆదివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి