15, అక్టోబర్ 2023, ఆదివారం

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *తృతీయాశ్వాసము*


                      *24*



*అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం*


 తరువాత జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేసాడు. వ్యాస భగవానుని చూసి మీవంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురు పాండవులు యుద్ధం ఎందుకు చేసారు అని అడిగాడు. వ్యాసుడు వైశంపాయుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయునకు పూజలు చేసి బంధు మిత్ర పురోహిత సహితంగా భారతగాధను వినడానికి అతని ముందు కూర్చున్నాడు.


*ఉపరిచరవసువు*


చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒక నాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చట పడి తాను కూడా తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అది చూసిన ఇంద్రుడు రాజా ! రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపస్సేమిటి నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను. ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధానికి లొంగని పూల మాలనూ దుష్ట శిక్షణా శిష్ట రక్షణా సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి  (విమానము)ను ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్ర లోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తరువాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించ సాగాడు. చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని శుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. శుక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరిక అనే ఆడపిల్లను వసుపదుడు అనే మగ పిల్ల వాడిని శుక్తిమతి వసువుకు బహూకరించింది. వసువు గిరికను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేసాడు. ఒక రోజు వేటకు వెళ్ళిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్య పతనం జరుగగా వసువు దానిని ఒక దోనెలో భద్రపరచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్ధమని భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ శాపవశాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సర నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. జాలరి వాళ్ళ వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లనూ మగ పిల్లవాడిని చూసి జాలర్లు వారిని దాశరాజుకు సమర్పించారు. ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశ రాజైనాడు. దాశ రాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది.

కామెంట్‌లు లేవు: