15, అక్టోబర్ 2023, ఆదివారం

విష్ణుచిత్తుని చరితము

 విష్ణుచిత్తుని చరితము

              (ఆముక్త మాల్యద)


ఆ. శ్రీల తోడ వెలుగు శ్రీవిల్లిపుత్తూరు

     భువనమందు మిగుల భూతితోడ

     పాండ్య దేశ మనెడు భామకు పాపటి

     బొట్టు వోలె నొప్పి పొందె కీర్తి.                  01*


వ. విభవోన్నతంబైన యా విల్లిపుత్తూరు

     పట్టణ మందు.                                   02*


సీ. ఊరికి న్నికటమౌ నుద్యాన వనములన్ 

              గోయిలల్ చిలుకలు గూయుచుండ 

    సవ్వడు లంతటన్ సదనాల మార్మ్రోగి 

             మిన్నుల నంటగా చెన్ను మీర

    నడయాడుచుండు తన్నగర మార్గస్థులు

             తలలెత్తి సద్మాల తరచి చూడ 

    చూరులం జెక్కిన శుక పిక గణములే

             పాడుచుండె ననెడి భ్రాంతి గల్గె

తే. అంబరమ్మున కంటిన హర్మ్య చయము 

     వింతగా ప్రాకియున్ వినువీథి యందు

     సందడించెను మనుజాళి డెందములను 

     విల్లిపుత్తూరు విభవమ్ము వినుతి కెక్క     03*        


సీ. చెంగల్వ కొలనులో నంగన లాపురిన్

           బసపాడి యత్యంత పావనముగ

     నచ్యుతు పూజకై యావస్యకంబైన 

           తీర్థమున్ బిందెల దీసికొనియు

     ఘటియందు నటునిటు కమలముల్ కదలగా 

           కటియందు కీలించి కదలు చుండ

     చనుదోయిభారాన తను మధ్య మల్లాడ

           భవ్య ప్రబంధముల్ పాడుకొనుచు

ఆ. పాదకటకము లను పదభూష లను దాల్చి

     నడచుచుందు రింతు లొడలు కదల

     నడక సోయగముల నయనాల వీక్షించి

     విల్లుపురము ప్రజలు విస్తు పోగ.     04*


✍️గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: