8, అక్టోబర్ 2023, ఆదివారం

భగవద్గీత ఎందుకు చదవాలి

 *భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే ఏమీ వస్తుంది?*



"మనిషి తన తల రాతను కచ్చితంగా మార్చుకోలేడు, తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు" అన్న ఒక్క మాటను మనము పెద్దల నుంచి పదే పదే వింటూ ఉంటాము.. అలాంటప్పుడు ఈ భగవద్గీతలు లేదా ఇతర మత గ్రంథాలు ఎందుకు చదవాలి ?? అన్న భావన మనిషిలో కలిగే అతి సహజమైన ఆలోచన...దాని సమాధానం ఒక్కటే " భగవద్గీత మన జీవనగీతను, లేదా కర్మ భారాన్ని కచ్చితంగా మార్చదు.. కానీ మనము జీవితాన్ని చూసే పద్దతిని మటుకు కచ్చితంగా మార్చేస్తుంది ". ద్వాపరయుగం లో యుగం లో ఇంద్రుడినే జయించగలిగే బలం, తెగవు, అస్త్ర సంపద ఉన్న అర్జునుడు సైతం కురుక్షేత్రం లో తన వారిని చూసి మానసికముగా బలహీనుడు అయిపోతాడు.. దాదాపు అస్త్ర సన్యాసం చేసే పరిస్థితికి వస్తాడు. అలాంటి సమయంలోనే కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గీతోపదేశం ఒక్క అర్జునుడికి కాదు, సమస్త మానవజాతికే మార్గదర్శకం అయింది.. ఇది మతాలకు సంబంధం లేని ఒక సందేశం, సమస్త మానవ జాతికి అది ఉపయోగ పడే విధంగా చెప్పబడింది.. అది ఎలానో చూద్దాము


1) భగవద్గీత మనలో ఉన్న బలాన్ని మనము గుర్తించేలా చేస్తుంది:

మనిషికి ఎప్పుడు కూడా గతం గురించి లేదా జరగబోయే దాని గురించి చింత ఉంటుంది. గీత లో ఉన్న సారాంశం మనిషి యొక్క ఆలోచన పద్దతిని ప్రభావితం చేసి ప్రస్తుత కాలంలో ఉండి, ఆలోచించేలా మనిషిని ముందుకు నడిపిస్తుంది.


2) భగవద్గీత కర్మ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేస్తుంది. ఆత్మ బలం, దైవం యొక్క గొప్పతనాన్ని, చేసే కర్మ యొక్క ఫలాన్ని, గీత తెలియ చెప్తుంది. దాని వలన మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది.


3) భగవద్గీత మన మనసు ని కంట్రోల్ చేసుకునే మార్గం చూపిస్తుంది. నిత్యం మనలో చాల మంది అనవసరమైన ప్రాపంచిక సుఖాల మీద మోజుతో ఆనందాన్నికోలుపోతారు.. అట్లాగే అనవసరమైన ఆలోచనల వలన మన మనశాంతిని కోలుపోతాము .. అలాంటి పనికి రాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన మనసుని అదుపులో పెట్టుకొనే మార్గం గీత సారాంశం మనకు చూపిస్తుంది.


4) భగవద్గీత ఒంటరితనాన్ని జయించేలా చేస్తుంది:

మనలో చాల మంది వయసు పెరిగేకొద్దీ బాధ పడే అంశం ఏంటి అంటే ఒంటరితనం.. దాని నుంచి మనిషి తప్పించుకోవడం చాల కష్టం.. ఈ జీవాత్మకు, పరమాత్మ ఎప్పుడు తోడుగా ఉంటాడన్న సంగతి మనకు అర్ధం కాదు. ఆ విషయాన్నీ భగవద్గీత మనకు చాలా సరళంగా తెలియచెప్తుంది.


5) భగవద్గీత మనలో నిర్ణయాలు తీసుకునే సమర్ధత పెంచుతుంది:

మనలో చాల మంది ఒక నిర్ణయం తీసుకోడానికి భయపడుతూ ఉంటాము, దాని తరువాత వచ్చే పర్యవసానాలను ఎదురుకొనే ధైర్యం ఉండదు మనకు.. ఒక స్థిమితమైన ఆలోచన పద్దతిని మనకు అలవాటు చేసి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది భగవద్గీత .


6) భగవద్గీత మనల్ని మనము గుర్తించేలా చేస్తుంది. సమస్యలు అనేది మానవ జీవితంలో చాలా సాధారణమైనవి .. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనము ఢీలా పడిపోకుండా, కృష్ణుడు మనకు గీత రూపం లో చేయూతను ఇచ్చి కర్మను చేయమంటారు.


7) భగవద్గీత మనకు మంచి చెడు మధ్య తేడాను తెలియచేస్తుంది:

ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా చెడ్డదా అని అని మన మనసు మనకు చెప్తుంది. మనము తీసుకునే నిర్ణయం వలన ఇంకో మనిషికి సమస్య రాకుండా ఎలా తీసుకోవాలి అన్న ఒక దృష్టికోణాన్ని భగవద్గీత మనకు చెప్తుంది. మనకు తీసుకునే నిర్ణయాన్ని పక్క వారిని బాధిస్తే మటుకు దానికి మనమే పూర్తి బాధ్యులం అని కూడా తెలియచేస్తుంది.


8) భగవద్గీత భావోద్వేగాలకు, కర్మకు తేడా తెలియ చెప్తుంది.

అర్జునుడు భావోద్వేగాలకు లోనయ్యి యుద్ధం చేయను అంటాడు .. అట్లాగే మన అన్న ఒక భావనతో మనము కూడా చాల సార్లు మన వాళ్ళు చేసిన తప్పుని సమర్థిస్తాము. అది తప్పు అని అర్ధమయ్యేలా భగవద్గీత మనకు చెప్తుంది.


9) భగవద్గీత మనకు ఈ సమాజంలో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలో చెప్తుంది:

ఈ సమాజం లో ఉంటూనే, మనకు లోకం లో ఉన్న సంసార పరమైన రుచులు అంటకుండా, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ జీవితాన్ని ఎలా గడపాలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది.


10) భగవద్గీత మనకు తిండి యొక్క విశిష్టత గురించి చెప్తుంది:

ఒక రకమైన తిండి తినడం వలన మనలో ఉన్న భావోద్వేగాలు ఎలా మారుతాయి, మన జీవన శైలిని అది ఎలా నిర్దేశిస్తుంది.. అట్లాగే మనము తినే తిండి మన ఆరోగ్యం, ఆలోచన, జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న సారాంశం భగవద్గీత లో ఉంటుంది.


11) భగవద్గీత జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తుంది:

తిన్నామా,, పాడుకున్నామా, తెల్లారిందా .. అన్నట్టు కాకుండా భగవంతుడిని ఎలా అన్వేషించాలి అని ఒక మార్గాన్ని మనకు భగవద్గీత చూపిస్తుంది.

నాకు భగవద్గీత లో బాగా నచ్చిన శ్లోకం ఏంటి అంటే

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।

नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि

దీనికి అర్ధం ఏంటి అంటే " పార్థ .. ఈ ముల్లోకాల్లో నేను నిజంగా తల్చుకుంటే సాధించలేనిది ఏది లేదు.. అసలు నేను సాధించడానికి కూడా ఏమి మిగలలేదు. అయిన సరే నేను కర్మను చేస్తున్నాను .. అట్లా చేయకపోతే, కర్మ అనేది చేయక్కర్లేదు అని ఒక తప్పుడు ఉద్దేశాన్ని జీవులకు నేను చెప్పినట్టు అవుతుంది. దాని వలన వాళ్ళు కర్మ చేయడం మానేస్తారు.. కాల చక్రం అనేది దాని వలన ఆగిపోతుంది. జీవులో మేలు కోసమే నేను కర్మాణి చేస్తున్నాను.

భగవద్గీత మన నుదిటివ్రాత అని ఎవరో మహా కవి అన్నట్టు గుర్తు .. మతాలతో సంబంధం లేకుండా ఒక పుస్తకం పుస్తకం అనుకోని అందరూ దాన్ని ఒకసారన్నా అది చదివితే మన ఆలోచనలో వస్తుంది.


ఒక ముక్కలో చెప్పాలి అంటే జీవితం యొక్క పరమార్థాన్ని భగవద్గీత మనకు చెప్తుంది.

*కృష్ణం వందే జగద్గురుమ్*

కామెంట్‌లు లేవు: