8, అక్టోబర్ 2023, ఆదివారం

సుందరి చూపులో

 


సుందరి చూపులో  మదనుని  తూపులు !

                                          ------------------------------------------------------------- 


                చం:  " కొలకుల  కెంపు  సొంపు ,  రహిఁగుల్కెడు  తారల  నీలిమంబు ,  క


                           న్బెళకు  మెఱుంగులుం  , గలసి  , పెంపమరెన్  హరిణాక్షి  చూపు,  ల


                           వ్వలదొర , ముజ్జగంబుఁ  గెలువన్, నవ చూతదళంబు , మేచకో

                

                            త్పల , మరవింద ,  మొక్క మొగిఁ బట్టి   ప్రయోగము సేయు కైవడిన్;


                                      అనిరుధ్ధ చరిత్రము--ద్వి:ఆ:- 29వ: పద్యం; కనపర్తి అబ్బయా మాత్యుడు;


             అర్ధాలు:  కొలకులు-కన్నుల తుదలు; కెంపు -ఎరుపు; రహిగుల్కెడు- శోభలను ప్రసరంచు; తారలు-కనుగ్రుడ్లు;

బెళకు-చంచలము; పెంపమరెన్- అందగించెను; హరిణాక్షి: వనిత; వలదొర- మన్మధుడు;  చూతదళము-మామిడియాకు;

మేతకోత్పలము- నల్లకలువ; అరవిందము- పద్మము; 


                               ఇదియొక  అద్భుత మైన  చమత్కార పద్యము. ఇంతవరకు దీనిని బోలిన పద్యం రాలేదు.


                   మన్మధునకు  ముల్లోకాలను  జయించాలనే  కోరిక కలిగినదట! అదీ కేవలం  మూడేమూడు బాణాలతో.

మన్మధుడు  శృంగార రసానికి  అధినాయకుడు. కాబట్టి ఆమూడుబాణాలతో  యేమిచెయ్యదలచాడు? ముల్లోకాలలో

నివసించే  పురుషుల (యువకుల)  హృదయాలలో అలజడి లేపి  వారిని శృంగార పరాయణులను  చేయదలచాడన్నమాట!


                         జయించాలంటే  బాణాలు కావాలి. ఆయన కున్నవెన్ని? మొత్తం ఐదే  అయిదు బాణాలు."  అరవింద మశోకంచ,

చూతంచ, నవమల్లికా ,నీలోత్పలంచ, పంచైతే  పంచ బాణస్య సాయకాః" అని అమరం.  అరవిందము ,అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలములు. ఇందులో కేవలం  మూడేమూడు బాణాలతో  ముజ్జగాలను గెలవాలి. వెదికాడు లోకాలన్నీ  ,ఈమూడూ

ఒక్కచోట దొరికినాయి! ఎక్కడ  ఉషాసుందరి కంటిలో , అమ్మయ్య అనుకున్నాడు.


                       ఉషాసుందరి కన్నులలో  మూడు బాణాలు దొరికాయట! ఎలాగో  చూడండి!


              కొలకులకెంపు -కనుచివరలు యెర్రగా ఉన్నాయి. ఆయెరుపు నవచూత దళమువలె( మామిడాకు వలె)నున్నది.


              రహిగుల్కెడు తారల నీలిమంబు-  కనుగుడ్లు యొక్క నల్లదనం ,నీలోత్పలం  వలె  ఉన్నది. 


              కన్బెళకు మెఱుంగులు- కన్నులలోని  తరళమైన  కాంతులు  అరవిందము  వలె నున్నవి.


                                  ఇకనేం  చూతము  నీలోత్పలము  అరవిందము   యీమూటితో  ముజ్జగములను  సునాయాసంగా

గెలవ  గలమని  వాటిని మల్లోకముల మీద యెక్కుపెట్టెనా?  యనేరీతిగా  ఉషాసుందరి  కన్నులు , చూపులూ  ఉన్నాయని

కవి వర్ణన.  ముల్లోకాలలోనూ  ఇంత అందమైన  సుందరిలేదనీ, యెవరైనా ఆమెయందానికి, దాసోహ మనక  తప్పదనీ

కవిగారి యభిప్రాయం.  కంటిలో  మూడు  మన్మధబాణాలను  సృజించటం( ఊహించటం) ఇక్కడ కవితా చమత్కారం!


                                                                        స్వస్తి!🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: