8, అక్టోబర్ 2023, ఆదివారం

మహాభారతములో - ఆది పర్వము* *ద్వితీయాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *17*


*ద్వితీయాశ్వాసము లోని ప్రధానాంశాలు*


ఈ అశ్వాసమునందు, గరుడుని కథ, దేవదానవులు సముద్రము మదించి అమృతము సాధించుట, దేవదానవ యుద్ధం, వినతా దాస్యం, నాగుల శాపం, గరుడుని జననం, వినతా దాస్య విముక్తి, పరీక్షిత్తు మహారాజు శాపం, సర్పయాగ విశేషాలు వర్ణించ బడ్డాయి.


*నాగులకు శాపము*


కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా, కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకురెండు అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది వెయ్యి మంది నాగ కుమారులు జనించాయి. అందుకు వినత ఉక్రోష పడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అగుదువుగాక అని శపించాడు. ఆ తరువాత తాను సూర్యునికి సారథిగా వెళ్ళాడు. అనూరుడు వెళుతూ తన తల్లితో అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహా బల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు.

కామెంట్‌లు లేవు: